Liver: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే కాలేయం..!

ABN , First Publish Date - 2023-06-29T11:45:05+05:30 IST

గుండె పోటులా కాలేయానికి ఎలాంటి ఎటాక్‌ రాదు. కాలేయ వ్యాధి తిరిగి సరిదిద్దలేనంతగా, చివరి దశకు చేరుకున్నప్పుడు మాత్రమే లక్షణాలు బయల్పడతాయి. ఆ సమయంలో కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. కాలేయం జబ్బుపడడానికి వంద కారణాలు ఉంటాయి. వీటిలో లివర్‌ డ్యామేజ్‌కు దారి తీసే, కొన్ని అత్యంత సాధారణమైన

Liver: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే కాలేయం..!

డాక్టర్‌! మా వారికి మద్యపానం అలవాటు ఉంది. తరచూ కామెర్లు వేధిస్తూ ఉంటాయి. అయితే కామెర్ల వచ్చిన ప్రతిసారీ ఆయన మూలికా వైద్యంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఈ వైద్యం సరైనదేనా? ఆయన కాలేయం ఆరోగ్యం గురించి కచ్చితంగా అంచనా వేయాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలను గమనించాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

గుండె పోటులా కాలేయానికి ఎలాంటి ఎటాక్‌ రాదు. కాలేయ వ్యాధి తిరిగి సరిదిద్దలేనంతగా, చివరి దశకు చేరుకున్నప్పుడు మాత్రమే లక్షణాలు బయల్పడతాయి. ఆ సమయంలో కాలేయ మార్పిడి ఒక్కటే ప్రత్యామ్నాయం. కాలేయం జబ్బుపడడానికి వంద కారణాలు ఉంటాయి. వీటిలో లివర్‌ డ్యామేజ్‌కు దారి తీసే, కొన్ని అత్యంత సాధారణమైన, కీలకమైన కారణాలు మద్యం, హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, ఫ్యాటీ లివర్‌. కాలేయం తిరిగి సరిదిద్దలేనంత చివరి దశ ‘సిర్రోసిస్‌’కు చేరుకునేంత వరకూ లక్షణాలు కూడా బయల్పడవు. విపరీతమైన నిస్సత్తువ, అలసట, కండరాలు కరిగిపోవడం లాంటి లక్షణాలు ప్రారంభంలో కనిపించవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో రక్తపు వాంతులు, నల్లని మలం, కామెర్లు, పొట్టలో నీరు చేరడం, కాళ్ల వాపు, శ్వాస అందకపోవడం, అయోమయం, మత్తు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

వ్యాయామం అవసరం!

నాన్‌ ఆల్కహాలిక్‌ స్టెటోహెపటైటిస్‌ - ఫ్యాటీ లివర్‌ రుగ్మత అయిన ‘నాష్‌’తో తలెత్తిన సిర్రోసిస్‌ ఇటీవలి కాలంలో ఎక్కువగా బయల్పడుతోంది. ఇందుకు కొవిడ్‌ సమయంలో వ్యాయామానికి ఆస్కారం లేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిని గడపడం ప్రధాన కారణం. అలాగే ఊబకాయం, మధుమేహం, అధిక కొలెసా్ట్రల్‌తో కూడిన మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కూడా కాలేయానికి మద్యంతో కలిగే నష్టానికి సమాన నష్టాన్ని కలిగిస్తాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, క్రమం తప్పక వ్యాయామం లేదా యోగా చేస్తూ, అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలను అదుపులో ఉంచుకోవాలి.

కాలేయానికి గాయాలు!

కాలేయం జబ్బు పడిందనడానికి కామెర్లు ఒక సంకేతం. అయితే కామెర్లకు కారణమైన కాలేయ జబ్బుకు దారితీసిన అసలు కారణాన్ని వైద్య సహాయంతో కనిపెట్టి, అందుకు తగిన చికిత్స తీసుకోవడం ఎంతో కీలకం. మూలికా వైద్యాలు, ఇతరత్రా నాటు మందుల వల్ల కాలేయానికి మేలు కంటే హాని ఎక్కువ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ ఫెయిల్యూర్‌కూ దారి తీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. కాబట్టి కామెర్లు కనిపించినప్పుడు కాలేయ వ్యాధి మరింత ముదిరిపోకుండా ఉండడం కోసం వైద్యుల సలహాలను తీసుకోవాలి. ఆకలి మందగించడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, మత్తుగా ఉండడం, బరువు కోల్పోవడం, కాళ్ల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతిం చాలి. ఆలస్యం చేయడం వల్ల కాలేయ సిర్రోసిస్‌ లేదా కాలేయ కేన్సర్‌లకు గురి కాక తప్పదు.

-డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

చీఫ్‌ లివర్‌ స్పెషలిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-06-29T11:45:05+05:30 IST