Womens Health: నారీమణులారా... ఆరోగ్యం జర జాగ్రత్త!

ABN , First Publish Date - 2023-03-07T11:39:42+05:30 IST

హోదాలు వేరైనా, వాళ్లిద్దరివీ ఉరుకుల పరుగుల జీవితాలే! అందరి గురించీ పట్టించుకునే వాళ్లను పట్టించుకునే వాళ్లు తక్కువ. ఉదయం నుంచీ రాత్రి వరకూ బొంగరాల్లా తిరిగే

Womens Health: నారీమణులారా... ఆరోగ్యం జర జాగ్రత్త!
ఆరోగ్యం జర జాగ్రత్త!

రేపు మహిళా దినోత్సవం (Womens Day) సందర్భంగా..

హోదాలు వేరైనా, వాళ్లిద్దరివీ ఉరుకుల పరుగుల జీవితాలే! అందరి గురించీ పట్టించుకునే వాళ్లను పట్టించుకునే వాళ్లు తక్కువ. ఉదయం నుంచీ రాత్రి వరకూ బొంగరాల్లా తిరిగే మహిళలు తమ అలసటనూ, నిస్సత్తువనూ, ఆరోగ్యాన్నీ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. గృహిణిగా, ఉద్యోగినిగా కుటుంబం కోసం ఖర్చయిపోతూ ఉండే మహిళల జీవితాలు చలాకీగా సాగినంత కాలమే కుటుంబం ఎదగగలుగుతుంది. కాబట్టి మహిళలూ... మీ మెండైన ఆరోగ్యం (Womens Health) కోసం ఈ ఆరోగ్య నిమయాలను, ఆరోగ్యకరమైన జీవనశైలినీ పాటించండి.

‘పనులు ఎప్పుడూ ఉండేవే! కొద్దిసేపు నడుం వాలుద్దాం’ అనుకునే మహిళలు తక్కువ. పనులన్నీ ముగించేస్తే, తీరుబాటుగా తినొచ్చనే ఆలోచనతో ఉదయం అల్పాహారాలు మానేసే మహిళలూ ఎక్కువే! ఆఫీసుకు ఆలస్యమైపోతోందనే తొందర్లో లంచ్‌ బాక్సులు (Lunch boxes) మర్చిపోయే ఉగ్యోగినులూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో ఏ ఒక్కరికి సుస్తీ చేసినా, వైద్యుల దగ్గరకు పరుగులు తీసే మహిళలు, తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, ఎంతో ఆలస్యంగా, అత్యవసర పరిస్థితుల్లోనే వైద్యులను కలుస్తూ ఉంటారు. కానీ నిజానికి కుటుంబ శ్రేయస్సుకు వాళ్ల ఆరోగ్యమే కీలకమనే విషయాన్ని మహిళలు మర్చిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు గృహిణులైనా, ఉద్యోగినులైనా తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడానికి కొన్ని నియమాలను పాటించడం అవసరం. రోజులో ఏం తింటున్నాం? పనుల్లో సమయపాలన పాటిస్తున్నామా? అనవసరంగా హైరానా పడిపోతున్నామా? అవసరానికి మించిన పనులు కల్పించుకుని అలసటకు లోనవుతున్నామా? సరిపడా విశ్రాంతి తీసుకుంటున్నామా? అని ప్రతి మహిళా తనను తాను ప్రశ్నించుకోవాలి. తన కోసం, తన ఆరోగ్య క్షేమం కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.

11.jpg

స్వీయ శ్రద్ధ అవసరం

ఇంటి పట్టున ఉండే మహిళల పట్ల కొంత చులకన భావం ఉంటోంది. హాయిగా ఇంటి పనులు చేసుకుని, నీడ పట్టున ఉంటున్నారనేది అపోహ మాత్రమే! నిజానికి ఉద్యోగినులతో పాటు గృహిణుల జీవితాలు కూడా బిజీగా మారిపోయాయి. భర్తకూ, పిల్లలకూ, అత్తామామలకూ ఏం వండి పెట్టాలి? వాళ్ల అవసరాలన్నింటినీ ఎలా తీర్చాలి? కుటుంబసభ్యుల అలవాట్లకు తగ్గట్టుగా అన్నీ అమరుస్తున్నానా? అనే ఆలోచనలే గృహిణుల మనసుల్లో తిరుగుతూ ఉంటాయి. దాంతో తమ ఆకలి గురించీ, ఆరోగ్యం గురించీ శ్రద్ధ తగ్గిపోతుంది. ఫలితంగా బరువు పెరగడం, నెలసరి సమస్యలు వేధించడం, మధుమేహం, థైరాయిడ్‌ లాంటి సమస్యలు మొదలవుతాయి. నిజానికి వీటన్నింటినీ ఎంతో ముందుగానే నియంత్రించుకునే వీలున్నప్పటికీ, తమలో తలెత్తే మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని మహిళలు ఎంతో ఆలస్యంగా వైద్యులను కలుస్తూ ఉంటారు. ఫలితంగా జీవితాంతం మందులు వాడవలసిన ఆరోగ్య సమస్యలు అప్పటికే మహిళల్లో తిష్ఠ వేసుకుని ఉండిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు వాళ్లు తీసుకునే డైట్‌ మీద దృష్టి పెట్టాలి.

రోజంతా చురుగ్గా ఉంచే ఆహారం

తిన్నామంటే తిన్నాం అని అందరూ తినగా మిగిలిన వాటితో కడుపు నింపేసుకోకూడదు. రోజు మొత్తానికీ శక్తిని అందించే సరిపడా పోషకాలను తీసుకుంటున్నామా? అనేది గమనించుకోవాలి. సాధారణంగా తెలుగు భోజనంలో ఉండే ప్రధాన పదార్థం అన్నం. దాంతో పాటు కొద్దిగా కూర, లేదా పప్పు, పెరుగు ఉంటాయి. కానీ ఈ భోజనంతో అవసరానికి మించిన పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా, అత్యవసరమైన మాంసకృత్తులు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా శరీరంలో చేరతాయి. నిజానికి ఒక భోజనంలో 30 నుంచి 40ు పిండిపదార్థాలు ఉంటే సరిపోతుంది. అంతకు మించి అవసరమే లేదు. కాబట్టి అన్నం బలం అనే అపోహను వదిలించుకుని, భోజనంలో అన్నం తక్కువగా పప్పుపదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. భారతీయ మహిళల్లో ఐరన్‌ లోపం ఎక్కువ. రక్తంలో హిమోగ్లోబిన్‌ సమంగా ఉండడం కోసం ఆహారంలో బీట్‌రూట్‌, క్యారెట్‌, దానిమ్మ, ఆకుకూరలు తీసుకోవాలి.

ప్రొటీన్‌ కోసం మొలకలు, నట్స్‌, పప్పు పదార్థాలు, మాంసాహారం, పన్నీర్‌, టోఫు, సోయా ఇలా భోజనంలో 20 నుంచి 30ు ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. నీరసం నిస్సత్తువ ఆవరించకుండా రోజులో కూరగాయలూ పండ్లు కలిపి ఐదు రకాలు, వాల్‌నట్స్‌, బాదం, పిస్తా (మొత్తం కలిపి ఏడు నుంచి పది నట్స్‌) తీసుకోవాలి. మెనోపాజ్‌ మహిళల్లో క్యాల్షియం లోపం తలెత్తుతుంది. కాబట్టి ఆ లోటును పాలు, క్యాల్షియం సప్లిమెంట్లతో భర్తీ చేసుకోవాలి. ఇలా ముందు జాగ్రత్తగా ఉండగలిగితే, పెద్ద వయసు మహిళల్లో జారి పడి తుంటి విరిగే అవకాశాలు తగ్గుతాయి. ఎముకలు గుల్లబారడం, కీళ్లు అరిగిపోవడం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

నచ్చిన వ్యాయామం ఎంచుకుని...

రోజు మొత్తంలో కనీసం ముప్పై నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. ఇంటిపనులే వ్యాయమాలతో సమానం అనుకుంటే పొరపాటు. గుండె వేగం పెరిగే వ్యాయామాలు చేస్తేనే వ్యాయామ ఫలం దక్కుతుంది. కాబట్టి నడక, యోగా.. ఇలా సౌకర్యంగా ఉండే నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. నెలసరిలో అవకతవకలు, వాటితో తలెత్తే మానసిక కుంగుబాటు, భావోద్వేగాలు అదుపు తప్పడం లాంటి ఇబ్బందులు వ్యాయామంతో అదుపులోకొస్తాయి. శరీరం చురుకుగా ఉంటే, మనసూ చురుగ్గా ఉంటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. వ్యాయామంతో మానసిక ఒత్తిడి, కుంగుబాటు అదుపులోకి వస్తాయి. అలాగే వ్యాయామాలతో ఎత్తుకు తగిన బరువు సమకూరుతుంది. ఇలా బరువు అదుపులో ఉన్నంత కాలం వ్యాధులు దరి చేరవు.

12.jpg

హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఇలా సమం

నెల నెలా వచ్చే నెలసరి చట్రంలోని వేర్వేరు దశల్లో హార్మోన్ల మోతాదులు కూడా వేర్వేరుగా ఉంటాయి. నెలసరి ముందు ఒకలా, నెలసరి తర్వాత ఇంకోలా హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పుల ప్రభావాల మూలంగా కొందరు మహిళలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఈ పరిస్థితి అదుపులోకి రావాలన్నా ఆరోగ్యకరమైన జీవనశైలినే అనుసరించాలి. సమతులాహారం, వ్యాయామం హార్మోన్లను సమంగా ఉంచుతాయి. అలాగే రెడీమేడ్‌, ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే బరువు పెరిగినా హార్మోన్లలో హెచ్చుతగ్గులు తప్పవు. కాబట్టి డైట్‌, వ్యాయామాలతో బరువును అదుపులో ఉంచుకోవాలి. బాడీ మాస్‌ ఇండెక్స్‌ 23కి మించకుండా చూసుకోవాలి. కెఫీన్‌ను ఎక్కువగా తీసుకున్నా, భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతాం. కాబట్టి వాటి పరిమాణం తగ్గించాలి. అదే పనిగా కాఫీలు, టీలు తాగేయకుండా, రోజుకు అర కప్పు కాఫీకి పరిమితం కావాలి.

ఆ దూరం తగ్గించాలి

ఇంటి పనులు, ఆఫీసు పనులతో అలసటకు లోనై, పడక చేరగానే నిద్ర ముంచుకు రావడం సహజమే! ప్రేమగా దగ్గరకు తీసుకునే భాగస్వామిని సున్నితంగా దూరం పెట్టేసి, నిద్రకే ప్రాథాన్యం ఇచ్చే మహిళలు ఉంటారు. అయితే ఆ దూరం మరింత పెరగకుండా ఉండాలంటే అందుకు దారితీస్తున్న కారణాలను పరిష్కరించుకోవాలి. భాగస్వామికి దగ్గర కాలేకపోవడానికి, అలసట కారణమా? లైంగికాసక్తి లోపించడం కారణమా? అనేది మహిళలు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా శారీరకంగా కలవడమే ప్రధానం కాదు. బంధం దృఢంగా కొనసాగడానికి అన్యోన్యమైన మాటలు, నాణ్యతతో కూడిన సమయాలు సరిపోతాయి. కాబట్టి రోజులో కొంత సమయాన్ని దంపతులు తమ కోసం కేటాయించుకోవాలి.

మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో హార్మోన్ల కొరత వల్ల శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. లైంగికాసక్తి కొరవడుతుంది. శరీరం సహకరించడం మానేస్తుంది. అయితే ఈ సమస్యలను యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, షియా సీడ్స్‌, గ్రీన్‌ టీ, ప్రూన్స్‌ లాంటి కొన్ని పదార్థాలను తీసుకోవడం, నీళ్లు ఎక్కువ తాగడం, కెఫీన్‌ తగ్గించడం, వ్యాయామం చేయడం ద్వారా కొంత మేరకు పరిష్కరించుకోవచ్చు. అలా పరిస్థితి సర్దుకోకపోతే, లక్షణాల ఆధారంగా హార్లోన్లను తలపించే కొన్ని మందులను వాడుకోవచ్చు. వాటితో కూడా ఫలితం లేనప్పుడు లక్షణాలను బట్టి కొంత కాలం పాటు హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీని ఎంచుకోవచ్చు.

13.jpg

ఉద్యోగినులు ఇలా...

ఉద్యోగినులు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా పనులన్నీ సక్రమంగా ముగించడం కోసం పనుల్లో సమయపాలన పాటించడం ఎంతో అవసరం. వారం రోజుల్లో వంట, ఆఫీసుకు ధరించే దుస్తులకు సంబంధించిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుంటే పనులు తేలికవుతాయి. అలాగే ఉదయాన్నే వంట పనుల్లో హడాహుడి తగ్గాలంటే ముందు రాత్రే కూరగాయలను కట్‌ చేసి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. అలాగే వంట పనుల్లో ఇంటి పనుల్లో భర్త, పిల్లల సహకారం తీసుకోవచ్చు. పనులను పంచుకునే పద్ధతిని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అలవాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగిని పాత్రను ఇంటి గడప దగ్గరే వదిలేయడం అలవాటు చేసుకోవాలి. వృత్తిలోని ఒత్తిడిలను ఇంటికి మోసుకురాకూడదు. ఆఫీసు పనుల్లో అలసటకు గురి కాకుండా ఉండడం కోసం, లంచ్‌ బాక్స్‌తో పాటు నట్స్‌, ఫ్రూట్స్‌ లాంటివి అదనంగా వెంట తీసుకువెళ్లాలి. రోజంతా సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. ఆఫీసు, ఇంటికే పరిమితమైపోకుండా, వారాంతాల్లో కుటుంబంతో పిక్నిక్‌లు లాంటివి ప్లాన్‌ చేసుకోవాలి. వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..

నడుము పట్టేస్తోందా?

పనులు త్వరగా ముగించేయాలనే హైరానాలో టక్కున బరువులు ఎత్తేయడం, చటుక్కున వంగడం, హఠాత్తుగా స్టవ్‌ దగ్గరకు పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాం. అపసవ్య భంగిమల్లో శరీరాలను ఒత్తిడికి లోను చేయడం వల్ల కండరాలు పట్టేసే ప్రమాదం ఉంటుంది. నడుము, మెడ పట్టేయడం, మడమ శూల లాంటి సమస్యలు వేధిస్తాయి. కాబట్టి బక్కెట్‌ నీళ్లు మోయవలసి వస్తే, మోయగలిగినంత నీళ్లతోనే బక్కెట్‌ను నింపుకోవాలి. ఏదైనా బరువైన వస్తువును లేపవలసివచ్చినా, పిల్లలను ఎత్తుకోవలసి వచ్చినా, మోకాళ్లను వంచి, వెన్ను సరళరేఖలో ఉండేలా చూసుకుని బరువు ఎత్తే ప్రయత్నం చేయాలి. ఎక్కువ సమయాల పాటు నిలబడి పనులు చేయడం వల్ల మడమ నొప్పి మొదలవవచ్చు. కాబట్టి వంటగదిలో స్టూలు అందుబాటులో ఉంచుకోవాలి.

చెప్పుల్లో, షూలలో అదనంగా సిలికాన్‌ సోల్స్‌ను ధరించాలి. ఎత్తు చెప్పుల వాడకం తగ్గించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద కూర్చుని పనులు చేయకూడదు. మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మెట్లు ఎక్కువగా ఉండే గుళ్లు, గోపురాలను తరచుగా కాకుండా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సందర్శిస్తూ ఉండాలి. ఉద్యోగినులైనా, గృహిణులైనా వేడికి ఎక్కువగా బహిర్గతం అవుతూ ఉంటారు. కాబట్టి చర్మ రక్షణ కోసం వైద్యులు సూచించిన సన్‌స్ర్కీన్‌ తప్పనిసరిగా వాడుకోవాలి. అలాగే సెల్ఫ్‌ గ్రూమింగ్‌ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. వీలైతే బడలిక వదలడం కోసం టబ్‌ బాత్స్‌, మసాజ్‌లను ఆశ్రయించవచ్చు.

ldl.jpg

అపోహలు - వాస్తవాలు

అపోహ: గర్భిణులు పైనాపిల్‌, బొప్పాయి తినకూడదు

వాస్తవం: గర్భిణులు అన్ని పండ్లనూ పరిమితంగా తినవచ్చు.

అపోహ: గర్భిణులు వేరుసెనగలు తింటే పుట్టిన పిల్లల్లో అలర్జీలు వస్తాయి

వాస్తవం: గర్భంతో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ పదార్థాలు తినాలి. దాంతో తల్లి తినే ఆ పదార్థాలన్నింటికీ కడుపులో పెరిగే బిడ్డ ఎక్స్‌పోజ్‌ అవుతాడు. గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఏఏ పదార్థాలకు దూరంగా ఉంటుందో, పుట్టిన తర్వాత ఐదేళ్ల వయసు లోపు అవే పదార్థాలతో పిల్లలు అలర్జీలకు గురయ్యే అవకాశాలు ఎక్కువని పరిశోధనల్లో తేలింది. కాబట్టి గర్భిణులు అన్ని పదార్థాలనూ పరిమితంగా తినాలి.

అపోహ: గర్భిణులు ఎక్కువ సమయాలు పడకకే పరిమితం కావాలి

వాస్తవం: ప్రెగ్నెన్సీ వ్యాధి కాదు. కాబట్టి విశ్రాంతి అవసరం లేదు. సాధారణ శారీరక శ్రమలను మానుకోవలసిన అవసరం లేదు. నడక, యోగా కూడా కొనసాగించవచ్చు. ఇలా చేయడం వల్ల శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. నెలలు నిండేకొద్దీ ఒంటి నొప్పులు వేధించకుండా ఉంటాయి. సాధారణ ప్రసవమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.

అపోహ: గర్భిణులు ఇద్దరికి సరిపడా ఆహారాన్ని తినాలి

వాస్తవం: నిజానికి అంత తినవలసిన అవసరం లేదు. అలా తినడం వల్ల బరువు పెరిగితే, షుగర్‌, బిపి లాంటి సమస్యలు తలెత్తవచ్చు. తొలి నెలల్లో రోజుకు అదనంగా 100 నుంచి 200 క్యాలరీలు తీసుకుంటే సరిపోతుంది. నెలలు నిండేకొద్దీ క్యాలరీల పరిమాణం పెంచాలి.

అపోహ: ఎలాంటి ఇబ్బంది లేకపోతే వైద్యులను కలవవలసిన అవసరం లేదు

వాస్తవం: సాధారణంగా గర్భం దాల్చినప్పుడు, డెలివరీ సమయానికి వైద్యులను కలిసే మహిళలు ఆ తర్వాతి కాలంలో ఎంతో పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తితే తప్ప వైద్యులను కలవరు. కానీ నిజానికి క్రమం తప్పకుండా వయసుల వారీ స్ర్కీనింగ్‌ పరీక్షలు, హెల్త్‌ చెకప్స్‌ చేయించుకుంటూ ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇలా అప్రమత్తంగా ఉంటే, సమస్యను ముందుగానే కనిపెట్టి సమర్థంగా సరిదిద్దుకోవచ్చు.

అపోహ: మెచ్యూర్‌ అయిన ఆడపిల్లలకు పత్యం అవసరం

వాస్తవం: నువ్వుల చిమ్మిరి లాంటి ఐరన్‌ రిచ్‌ ఆహారం ఇచ్చినట్టే అన్ని రకాల బలవర్థకమైన ఆహారాలూ ఈ సమయంలో తినిపించాలి. ఉప్పు, కారాలు లేని చప్పటి ఆహారం తినిపించడంలో అర్థం లేదు.

ఎప్పుడు, ఎలాంటి పరీక్షలు?

పాప్‌స్మియర్‌: గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను ముందుగానే పసిగట్టే ఈ పరీక్షను సెక్సువల్లీ యాక్టివ్‌గా ఉన్న పాతికేళ్ల మహిళలందరూ మూడేళ్లకోసారి తప్పనిసరిగా చేయించుకోవాలి. సమస్య లేకపోతే ప్రతి మూడేళ్లకూ, సమస్య తలెత్తే అవకాశం ఉన్న వాళ్లు ఏడాదికోసారి.... ఇలా యాభై ఏళ్ల వయసు వరకూ ఈ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. 50 ఏళ్ల తర్వాత ఇదే పరీక్ష ప్రతి ఐదేళ్లకొకసారి 65 ఏళ్ల వయసుకు చేరుకునే వరకూ చేయించుకోవాలి.

బ్రెస్ట్‌ స్క్రీనింగ్‌:

నెలసరి మొదలైన ప్రతి మహిళా ప్రతి నెలా నెలసరి ముగిసిన తర్వాత చేత్తో రొమ్ములను స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. కుడి చేత్తో ఎడమ రొమ్మునూ, ఎడమ చేత్తో కుడి రొమ్మునూ నొక్కి పరీక్షించుకుని, గడ్డ ఉన్నా, నొప్పి ఉన్నా, స్రావం కనిపించినా వెంటనే వైద్యులను కలవాలి. ఈ లక్షణాలేవీ లేకపోయినా 40 ఏళ్లకు చేరుకున్న ప్రతి మహిళా ఏడాదికోసారి బ్రెస్ట్‌ అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ చేయించుకోవాలి.

హెల్త్‌ చెకప్‌:

పురుషుల్లాగానే మహిళలు కూడా 40 ఏళ్ల తర్వాత నుంచీ ఏడాదికోసారి హెల్త్‌ చెకప్‌ చేయించుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్‌, బిపి, షుగర్‌ సమస్యలు ప్రారంభంలోనే బయట పడతాయి.

కేన్సర్‌:

కుటుంబ చరిత్రలో కేన్సర్లు ఉన్నవాళ్లు 35 ఏళ్ల నుంచే స్ర్కీనింగ్‌ చేయించుకోవాలి.

థైరాయిడ్‌:

నెలసరి సక్రమంగా ఉన్నవాళ్లు ప్రతి ఏడాదీ ధైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. నెలసరిలో అవకతవకలు తలెత్తిన వెంటనే ఈ పరీక్ష చేయించుకుని, ప్రతి ఆరు నెలలకోసారి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

54.jpg

-డాక్టర్‌ హిమబిందు అన్నమరాజు కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌, గైనకాలజిస్ట్‌ అండ్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌, బర్త్‌ రైట్‌ బై రెయినబో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-03-07T11:54:28+05:30 IST