Sleep : రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా..? ఈ ఐదు తినడం మానేయకపోతే ఎలా నిద్రపడుతుంది..?

ABN , First Publish Date - 2023-04-01T12:34:54+05:30 IST

ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది నిద్ర. రోజుకు 8 గంటల నిద్ర అవసరం. అది కాదన్నప్పుడు కనీసం ఆరున్నర గంటల నిద్ర అయినా తప్పనిసరి. ఇది మన మనసు, శరీరాలను రీచార్జ్ చేస్తుంది. మనం చక్కగా విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Sleep : రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా..? ఈ ఐదు తినడం మానేయకపోతే ఎలా నిద్రపడుతుంది..?

ఆరోగ్యానికి అతి ముఖ్యమైనది నిద్ర. రోజుకు 8 గంటల నిద్ర అవసరం. అది కాదన్నప్పుడు కనీసం ఆరున్నర గంటల నిద్ర అయినా తప్పనిసరి. ఇది మన మనసు, శరీరాలను రీచార్జ్ చేస్తుంది. మనం చక్కగా విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. తలనొప్పి నుంచి గుండె జబ్బుల వరకూ అనేక రకాల సమస్యలు కంటి నిండా నిద్రపోతే సెట్ అవుతాయి. ఆహారం వంటి శారీరక అంశాలు కూడా ముఖ్యమైనవి. కొన్ని ఆహారాలు, డ్రింక్స్ మనకు నిద్రలేమికి చేరువ చేస్తాయి. హాయిగా నిద్ర పోవడానికి ఒక ఐదు రకాల ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సరైన నిద్ర కోసం ఈ 5 రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే..

1. టమాటాలు : టమాటాలు రెండు కారణాల వల్ల నిద్రను దూరం చేస్తాయి. టమాటాలో టైరమైన్ ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను ప్రేరేపించి నిద్రను దూరం చేస్తుంది. రెండవది.. టమోటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. పడుకునే ముందు వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, అసిడిటీ వస్తుంది. అందుకే నిద్రపోయే ముందు నారింజ వంటి ఇతర సిట్రస్ ఆహారాలకు దూరంగా ఉండాలి.

2. వైట్ బ్రెడ్ : వైట్ బ్రెడ్‌లో పెద్ద ఎత్తున కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కొన్ని పరిశీలనల ప్రకారం ఇది ఇన్‌సోమ్నియాకు అతి పెద్ద కారణమవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అలాగే అత్యధిక జీఐ ఉన్న ఫుడ్స్ షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణమవుతాయి. ఇది ప్రశాంతమైన నిద్రను నాశనం చేస్తాయి.

3. స్పైసీ ఫుడ్స్ : మన ఆహారం కారంగా ఉండటాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఇవి మన శరీరంలో వేడిని పెంచడంతో పాటు నిద్రను నాశనం చేేస్తాయి. అంతే కాకుండా ఈ ఫుడ్ కారణంగా గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అజీర్ణం వంటివి జరిగి నిద్రలేమికి కారణమవుతాయి. కాబట్టి నిద్రపోవడానికి ముందు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను అవాయిడ్ చేయడం తప్పనిసరి.

4. ఐస్ క్రీం : రాత్రి భోజనం చేసిన తర్వాత లేదంటే అర్ధరాత్రి అతిగా ఐస్ క్రీం తినకూడదు. ఐస్‌క్రీమ్‌లో ఫ్యాట్, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రెండూ నిద్రలేమికి కారకాలే. అధిక ఫ్యాట్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఇన్సులిస్‌ స్థాయిలను పెంచి నిద్రలేమికి కారణమవుతాయి.

5. చాక్లెట్ : నిద్ర సమయానికి ముందే చాక్లెట్ తినడం లేదంటే చాక్లెట్ డిజర్ట్‌ను తీసుకోవడం వంటి వాటికి చెక్ పెట్టాలి. కొన్ని రకాల చాక్లెట్లలో టైరోసిన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది. డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ ఉంటుంది. ఇది హార్ట్ బీట్ రేటును పెంచుతుంది. తత్ఫలితంగా నిద్ర లేమికి కారణమవుతుంది. ఇక ప్యాకేజ్డ్ చాక్లెట్లలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి వేళ చాక్లెట్ తింటే నిద్రకు దూరమైనట్టే.

Updated Date - 2023-04-01T12:34:54+05:30 IST