Heart Stents: స్టెంట్లు మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-22T11:29:28+05:30 IST

డాక్టర్‌! గుండె జబ్బు మూలంగా గత ఏడాది స్టెంట్లు వేయించుకున్నాను. అయితే అవి మళ్లీ పూడుకుపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు? అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Heart Stents: స్టెంట్లు మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉందా? డాక్టర్లు ఏమంటున్నారంటే..!

డాక్టర్‌! గుండె జబ్బు మూలంగా గత ఏడాది స్టెంట్లు వేయించుకున్నాను. అయితే అవి మళ్లీ పూడుకుపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు? అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

శరీరంలో గుండె జబ్బు తీవ్రం కాకుండా నిలువరించడానికి స్టెంట్లు వేయించుకోవడంతో పాటు బ్లడ్‌ థిన్నర్లు కూడా వాడుకోవాలి. అయితే ఎంత మెరుగైన చికిత్స అందించినప్పుటికీ, ఐదు నుంచి పది శాతం మందికి, మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి, స్టెంట్లు వేయించుకున్న 8 నుంచి 12 నెలల లోపు తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలుంటాయి. అవి కొత్త పూడికలు కావచ్చు, లేదా స్టెంటు వేసిన చోటే పూడిక ఏర్పడవచ్చు, లేదా స్టెంటు వ్యాకోచించకపోయి ఉండచ్చు. కొందరికి రక్తనాళంలో రియాక్షన్‌ మూలంగా స్టెంట్‌ పూడుకుపోవచ్చు. అలాంటప్పుడు కొరొనరీ ఇమేజింగ్‌ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించి, కారణాన్ని కనిపెట్టి, బెలూన్‌ యాంజియోప్లాస్టీతో పూడికను తొలగించి, అవసరాన్ని బట్టి మరొక స్టెంటు వేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో డ్రగ్‌ ఎల్యూటింగ్‌ బెలూన్‌ను ఉపయోగిస్తారు. అలాగే పదే పదే స్టెంట్లు పూడుకుపోతున్నప్పుడు, బైపాస్‌ సర్జరీ చేయవలసి ఉంటుంది.

డ్రగ్‌ కోటెడ్‌ స్టెంట్లు ప్రయోజనకరం

ప్రస్తుతం డ్రగ్‌ కోటెడ్‌ స్టెంట్లు వాడుకలో ఉన్నాయి. స్టెంట్‌కు మందు పైపూత ఉంటుంది కాబట్టి రక్తనాళాలు త్వరగా పూడుకుపోకుండా ఉంటాయి. దీనికి ముందు లేజర్‌ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళంలోని పూడికను తొలగించవలసి ఉంఉంటుంది.

స్టెంట్లు పూడుకుపోకుండా....

రక్తనాళం తిరిగి పూడుకుపోకుండా ఉండాలంటే... స్టెంటు వేయించుకుని, రక్తం పలుచనయ్యే మందులు వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలి. అవేంటంటే...

● మధుమేహం, అధిక రక్తపోటులను మందులతో అదుపులో ఉంచుకోవాలి.

● ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను కొనసాగించాలి.

● వైద్యుల సూచన మేరకు తగిన వ్యాయామాన్ని ఎంచుకోవాలి.

● ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.

-డాక్టర్‌ వి. రాజశేఖర్‌

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌,

హైదరాబాద్‌.

Updated Date - 2023-06-22T11:29:38+05:30 IST