TSPSC: మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే...!

ABN , First Publish Date - 2023-03-18T12:54:35+05:30 IST

ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leak) వ్యవహారం తర్వాతనైనా.. టీఎస్‌పీఎస్సీ(TSPSC) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు

TSPSC: మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే...!
TSPSC paper leak

టీఎస్‌పీఎస్సీలో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలుంటాయా?

సిబ్బంది కొరతతో చాన్నాళ్లుగా సతమతం

కావాల్సింది 260.. ఇచ్చింది 120 మందిని!

వారిలో రెగ్యులర్‌ సిబ్బంది కేవలం 83 మందే

చైర్మన్‌ వద్ద ఉండాల్సిన పేపర్లు ఎస్‌వో వద్ద!

కంప్యూటర్ల భద్రతపై ఆడిట్‌ లేదు

సంస్థలో ఉంటూ పరీక్ష రాసిన ప్రవీణ్‌పై నిఘా ఏదీ?

ప్రభుత్వం తీరుపై విమర్శలు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Paper Leak) వ్యవహారం తర్వాతనైనా.. టీఎస్‌పీఎస్సీ(TSPSC) విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్ని తీసుకుంటుందా? అనే ప్రశ్న అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది. కమిషన్‌ పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్ననిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని వారు మండిపడుతున్నారు. గ్రూపు-1 వంటి పెద్ద స్థాయి పోస్టుల భర్తీతో పాటు, ఇతర అనేక విభాగాల పోస్టుల భర్తీ బాధ్యతలను చేపట్టిన టీఎస్‌పీఎస్సీకి సరైన సిబ్బంది లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కమిషన్‌ ఏర్పాటైన సమయంలో మొత్తం 260 రెగ్యులర్‌ సిబ్బందిని కేటాయించాలని ప్రతిపాదించగా.. 120 పోస్టులను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ 120 పోస్టుల్లో 83 మంది మాత్రమే రెగ్యులర్‌ సిబ్బంది పని చేస్తున్నారు. మరో 23 మంది అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఫలితంగా పని ఒత్తిడి అంతా ఉన్న ఆ కొద్దిమంది సిబ్బందిపైనే పైనే పడుతోంది. ప్రభుత్వం ఈ ఏడాది సుమారు 23 వేల పోస్టుల భర్తీ కోసం అనుమతిని ఇచ్చింది. వాటిలో గ్రూపు-1,2,3,4 వంటి పోస్టులే కాకుండా, పలు విభాగాలకు చెందిన గెజిటెడ్‌ పోస్టులు కూడా ఉన్నాయి.

ఇన్ని పోస్టులను భర్తీ చేయాల్సిన కమిషన్‌ను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి చర్యలనూ ఎందుకు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. టీఎస్‌పీఎస్సీకి అవసరమైన సాంకేతిక సహకారాన్ని తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీస్‌ సర్వీస్‌ (టీఎస్‌పీఎస్సీ) అందిస్తోంది. అయితే, ఆ సంస్థ తరఫున టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ల వ్యవస్థను పర్యవేక్షించడానికి కూడా రెగ్యులర్‌ ఉద్యోగిని కాకుండా టెంపరరీ ఉద్యోగిని పంపిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇటు కమిషన్‌ అధికారులు కానీ, అటు ప్రభుత్వం కానీ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమనే వాదనలున్నాయి..

సెక్యూరిటీ ఆడిట్‌ లేదు

టీఎస్‌పీఎస్సీ వంటి సంస్థల్లో ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా సెక్యూరిటీ ఆడిట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఐటీ యాక్ట్‌ ప్రకారం.. ఉద్యోగాల భర్తీ, ఇతర ముఖ్యమైన అంశాల్లో వాడే కంప్యూటర్ల విషయంలో ఈ సెక్యూరిటీ ఆడిట్‌ తప్పనిసరి అని నిపుణులు చెప్తున్నారు. కానీ, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా అలాంటిదేమీ జరగట్లేదన్న విమర్శలున్నాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఈ సెక్యూరిటీ ఆడిట్‌ను గనక నిర్వహించి ఉంటే... లీకేజీ వంటి లోపాలు ఎప్పటికప్పుడు బయటపడేవని, ముందుజాగ్రత్త చర్యల్ని తీసుకోవడానికి అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రాలు చైర్మన్‌ కంప్యూటర్‌లో ఉండాలి. కానీ టీఎస్‌పీఎస్సీలో వాటిని సెక్షన్‌ ఆఫీసర్‌ కంప్యూటర్‌లో భద్రపరిచారన్న చర్చ జరుగుతోంది. గ్రూప్‌-1 పరీక్ష రాయడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్న నిందితుడు ప్రవీణ్‌పై ఎలాంటి నిఘా లేకపోవడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిలిమినరీలో అతనికి 103మార్కులు వచ్చిన విషయం తెలిసిన వెంటనే అయినా అప్రమత్తమై ఉంటే... మిగిలిన పరీక్షల పేపర్లు లీక్‌ కాకుండా ఉండేవని చెప్తున్నారు.

Updated Date - 2023-03-18T12:54:35+05:30 IST