TS DSC: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్! భర్తీ ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2023-08-25T11:03:19+05:30 IST

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కొన్నిటిని భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 6,612 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

TS DSC: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్! భర్తీ ఎప్పుడంటే..!

6,612 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ

డీఎస్సీ ద్వారా నియామకాలు

ప్రకటించిన విద్యామంత్రి సబిత

ఎన్నికల లోపు భర్తీ అనుమానమే

వచ్చే ఏడాది మే వరకూ పట్టొచ్చు!

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో కొన్నిటిని భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 6,612 టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భర్తీ చేయాలని నిర్ణయించిన పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఫర్‌ డిసెబుల్డ్‌లో 1,523 పోస్టులు ఉన్నాయి. వీటిని టీఎ్‌సపీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా నిర్వహించాలని భర్తీ చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా, డీఈవో సెక్రటరీగా, జిల్లా పరిషత్‌ సీఈవో సభ్యులుగా ఉండే ఈ కమిటీ నియామకాలను చేపడుతుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. కాగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడం లేదు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పోస్టులను భర్తీ చేసిన తర్వాత కూడా మరో 1455 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఆర్థిక శాఖ అనుమతించిన పోస్టుల సంఖ్య ప్రకారమే ప్రస్తుతం భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. 2017లో టీఆర్టీ ద్వారా సుమారు 13 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసిన తర్వాత మళ్లీ నియామకాలను చేపట్టలేదు.

విద్యారంగానికి పెద్ద పీట: మంత్రి సబిత

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యా రంగానికి పెద్ద పీట వేశారని మంత్రి సబిత పేర్కొన్నారు. 2014-15లో విద్యపై రూ.9,518 కోట్లు ఖర్చు చేయగా, 2023-24లో రూ.29,611 కోట్లను కేటాయించామని, గడచిన తొమ్మిదేళ్లలో రూ.1,87,269 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. గురుకులాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద 26,065 పాఠశాలను దశలవారీగా అభివృద్ధిపరుస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకులాల్లో 11,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, మరో 12,150 పోస్టుల బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 491 లెక్చరర్‌, 24 లైబ్రెరియన్‌, 54 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను భర్తీచేయబోతున్నామన్నారు.

టెట్‌ ఫలితాల తర్వాతే..

డీఎస్సీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసినా అసెంబ్లీ ఎన్నికల లోపు టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి కావటం సందేహమే. సెప్టెంబరు 15న టెట్‌ను నిర్వహించి, వాటి ఫలితాలను అదే నెల 27న ప్రకటించనున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాతనే అభ్యర్థుల నుంచి డీఎస్సీకి దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉంది. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత కనీసం రెండు నెలల అనంతరమే డీఎస్సీ నిర్వహించాల్సి ఉంటుంది. అంటే డిసెంబరులోపు డీఎస్సీ నిర్వహించటం వీలుకాకపోవచ్చు. ఒక వేళ డిసెంబరులో జరపాలని భావించినా... అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధ్యం కాదు. అసెంబ్లీ ఎన్నికలు కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి, వచ్చే ఏడాది జనవరి తర్వాతనే డీఎస్సీనిర్వహించే అవకాశం ఉంది. తర్వాత వాటి ఫలితాలు, అభ్యర్థుల ఎంపిక వంటి ప్రక్రియ ముగిసి పోస్టుల భర్తీ పూర్తి కావటానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల వరకు సమయం పట్టవచ్చు.

teach.jpg

Updated Date - 2023-08-25T11:03:19+05:30 IST