TSPSC-Revanth Reddy: ఆయన్ను విచారిస్తే నిజాలన్నీ బయటకొస్తాయ్‌!

ABN , First Publish Date - 2023-03-24T13:04:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్‌ (KTR) పెద్ద తలల్ని

TSPSC-Revanth Reddy: ఆయన్ను విచారిస్తే నిజాలన్నీ బయటకొస్తాయ్‌!
రేవంత్‌రెడ్డి సిట్‌కు ఏం చెప్పారంటే

పెద్దల్ని కాపాడే యత్నం

టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ను ఇద్దరికే పరిమితం చేస్తున్న కేటీఆర్‌

ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి

లీకేజీపై ముగ్గురం స్పందిస్తే కేటీఆర్‌కెందుకు నోటీసులివ్వలే?

మంత్రిని 4 రోజులు విచారిస్తే నిజాలన్నీ బయటకొస్తాయ్‌

తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్‌ కుటుంబమే

సిట్‌ విచారణ అనంతరం మీడియాతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

సిట్‌ కార్యాలయం వద్ద బైఠాయించిన కాంగ్రెస్‌ శ్రేణులు

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ నేతల హౌస్‌ అరెస్టులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్‌ (KTR) పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ (TSPSC)పై నిరుద్యోగులకు విశ్వాసం కలిగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్‌ లీక్స్‌ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దేనని.. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిట్‌ నోటీసులకు అనుగుణంగా గురువారం విచారణకు హాజరైన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, నిరుద్యోగులు నాయకత్వం వహించారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులని గుర్తు చేశారు. ఉద్యోగ నియామకాల కేంద్రమైన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను అందరూ పవిత్రంగా భావిస్తారని.. కానీ తెలంగాణలో మాత్రం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు లోపభూయిష్టంగా జరిగాయని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, పార్టీని విస్తరించుకువడంపైనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు.

లీకేజీలో ఆ ఇద్దరికీ భాగస్వామ్యం..

ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌ రెడ్డికి కేటీఆర్‌ పీఏ తిరుపతికి పేపర్‌ లీకేజీలో కీలక భాగస్వామ్యం ఉందని రేవంత్‌ ఆరోపించారు. వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని గతంలో తాము చెబితే.. వారిని విచారించాల్సింది పోయి సిట్‌ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం తమను భయపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివా్‌సకు అందించినట్టు తెలిపారు. పేపర్‌ లీకేజీపై తాను, బండి సంజయ్‌, కేటీఆర్‌ ముగ్గురం స్పందిస్తే తమకు మాత్రమే నోటీసులిచ్చి.. కేటీఆర్‌కు ఎందుకు ఇవ్వలేదన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యల వివరాలను సిట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కేటీఆర్‌ను 4 రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తే అప్పుడే టీఎ్‌సపీఎస్సీ కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు. సిట్‌ విచారణ చేయకుండానే కేటీఆర్‌ నేరం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి వివరించారని, ఇంత చేసిన కేటీఆర్‌ వ్యాఖ్యలు సిట్‌ అధికారులు తమ దృష్టికి రాలేదనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేటీఆర్‌పై ఫిర్యాదు తీసుకోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారన్నారు.

కేటీఆర్‌తో పాటు జనార్దన్‌ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను విచారణ చేయాల్సిందేనని.. విచారించకుండా సిట్‌ దర్యాప్తును ముగించే పరిస్థితి వస్తే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడం, టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయడం, పేపర్‌ లీక్‌ కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలనే మూడు ప్రధాన డిమాండ్ల భవిష్యత్‌ కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు.

ఆంధ్రా అధికారి చేతిలో తాళాలా?

30 లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్‌ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని, రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయని రేవంత్‌ ప్రశ్నించారు. ప్రవీణ్‌ కుమార్‌ ఏపీలోని రాజమండ్రికి చెందిన వ్యక్తని.. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ హోదా ఉన్న ఒక్క తెలంగాణ బిడ్డ లేడా అని ప్రశ్నించారు. అలాగే సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ కూడా విజయవాడకు చెందిన వ్యక్తని చెప్పారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్‌ కుటుంబమేనని.. ఆ చీడ, పీడను వదిలించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కాగా, అంతకుముందు కాంగ్రెస్‌ నేతలతో కలిసి సిట్‌ కార్యాలయానికి తన నివాసం నుంచి బయలుదేరిన రేవంత్‌ వాహన శ్రేణి. లిబర్టీ చౌరస్తాకు చేరుకోగానే.. రేవంత్‌ వాహనం మినహా ఇతర అవహనాలు వెళ్లకూడదని పోలీసులు తేల్చిచెప్పారు. అక్కడనుంచి ఎన్ఎ‌స్‌యూఐ బల్మూరి వెంకట్‌, మరికొందరు నేతలతో కలిసి రేవంత్‌ కాలినడకన సిట్‌ కార్యాలయానికి 12 గంటలకు చేరుకున్నారు. గంటపాటు రేవంత్‌ విచారణ జరిగింది.

ఈ క్రమంలోనే సిట్‌ వద్దకు చేరుకున్న వందలాది కాంగ్రెస్‌ శ్రేణులు, విద్యార్థి నేతలు ఆందోళన చేపట్టారు. రేవంత్‌ సిట్‌ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు సిట్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, సింగిరెడ్డి రోహిణిరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎం.నగేశ్‌ ముదిరాజ్‌ తదితరులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

ఓయూలో నిరుద్యోగ దీక్షపై ఉత్కంఠ..

ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన నిరుద్యోగ మహాదీక్షపై ఉత్కంఠ నెలకొంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ దీక్షకు రేవంత్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలుపనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా, మరోవైపు దీక్ష నిర్వహిస్తామని ఓయూ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే రేవంత్‌ ఓయూకు వెళ్లకుండా అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. మరోవైపు, రేవంత్‌ను ఓయూలో అడుగుపెట్టనివ్వబోమని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌ గౌడ్‌ హెచ్చరించారు.

Updated Date - 2023-03-24T13:05:20+05:30 IST