TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!

ABN , First Publish Date - 2023-06-17T11:15:16+05:30 IST

టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఇవేం నియామకాలు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన..!
TSPSC

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఇష్టానుసారంగా నియమిస్తారా?

ఎలాంటి చర్చలు, స్ర్కీనింగ్‌ జరిగినట్లు కనిపించడం లేదు

మార్గదర్శకాలు లేనంత మాత్రాన ఇష్టారాజ్యంగా నియమిస్తారా?

ఆరుగురు సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

పున:పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు

సమర్థులు, అర్హులను నియమించాలని వ్యాఖ్య

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ (TSPSC) సభ్యుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు సభ్యుల నియామకాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని పేర్కొంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ధన్‌సింగ్‌, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్‌.సత్యనారాయణ నియామకాలపై మూడు నెలల్లో మళ్లీ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయానికి లోబడే వారి నియామకాలు ఉంటాయని పేర్కొంది. ఈ సందర్భంగా.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకాల విషయంలో ఎలాంటి చర్చలు, స్ర్కీనింగ్‌ ప్రక్రియ జరిగినట్లు కనిపించడం లేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సభ్యుల నియామకాల విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు లేనంత మాత్రాన ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించరాదని, సమర్థులను, అర్హులను నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వ్యాఖ్యానించింది. టీఎ్‌సపీఎస్సీ సభ్యులుగా ఆరుగురిని నియమిస్తూ 2021 మే 19న ప్రభుత్వం జీవో నెంబర్‌ 108ని జారీ చేయగా, సభ్యులుగా అనర్హులను నియమించారని, ఆ నియామకాలను కొట్టేయాలని కోరుతూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌రెడ్డి 2021 జూన్‌లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టి.. శుక్రవారం తీర్పు వెలువరించింది. వివాదంలో ఉన్న సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌ కవర్‌ రికార్డును ధర్మాసనం పరిశీలించింది. వివాదాస్పద సభ్యుల్లో ఒకరైన సుమిత్రా ఆనంద్‌ తనోబా ఎంఏ (తెలుగు) అర్హతతో జెడ్పీహెచ్‌ఎ్‌స లింగంపేట్‌లో తెలుగు పండిట్‌గా పనిచేశారని తెలిపింది. కారం రవీందర్‌రెడ్డి బీఎస్సీ డి గ్రీ అర్హతతో నాయబ్‌ తహసీల్దార్‌గా రిటైర్‌ అయ్యారని, ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నట్లు రికార్డుల్లో ఉందని పేర్కొంది. డాక్టర్‌ అరవెల్లి చంద్రశేఖర్‌రావు బీఏఎంఎస్‌ అర్హత కలిగి ఉండి ముస్తాబాద్‌లో తిరుమల నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్నట్లు బయోడేటాలో ఉందని తెలిపింది. ఆర్‌.సత్యనారాయణ బీఏ డిగ్రీ అర్హతతో ఈనాడు, ఉదయం, వార్త పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసినట్లు ఉందని వెల్లడించింది. వీరంతా ఎలా, ఏ ప్రాతిపాదికన తమ బయోడేటాలు సమర్పించారు? ఎవరికి సమర్పించారో తమకు అసలు అర్థంకాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీరి బయోడేటాలు ఎవరు.. ఎప్పుడు అడిగారనేది విషయాల గురించి రికార్డుల్లో ఏమీ లేదని పేర్కొంది. ‘‘మిగితా వ్యక్తుల నుంచి సైతం ఇలా బయోడేటాలు కోరారా? అనే వివరాలు లేవు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల పదవులకు నియామకాలు జరుగుతున్నాయని వీరికి ఎలా తెలిసింది? వీరి బయోడేటాలు పంపించాలని ఎవరు అడిగారు? అనేది అర్థం చేసుకోవడంలో మేం విఫలమయ్యాం. వీరిపై ఎలాంటి ఆరోపణలు లేవని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు లేవని చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌, వివిధ శాఖల కార్యదర్శులు నోట్‌ ఫైల్స్‌ కూడా రికార్డుల్లో ఉన్నాయి. ఈ ఫైల్స్‌ను సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రాసెస్‌ చేసి.. ఎనిమిది పేర్లను ఎంపిక చేశారు. ఆ తర్వాత విజిలెన్స్‌ నివేదికకు లోబడి సభ్యుల నియామకాలకు ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మొత్తం ప్రక్రియలో చైర్మన్‌, సభ్యుల నియామకాలకు సంబంధించి ఎక్కడా చర్చ జరగలేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

స్ర్కీనింగ్‌ ప్రక్రియ తప్పక ఉండాలి..

2021 మే 19న జీవో నెంబర్‌ 108 జారీ అయింది. ఈ మొత్తం ప్రక్రియలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకాలకు సంబంధించి.. చర్చా ప్రక్రియ ఎక్కడ జరిగిందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఒక్క నియామకం సంబంధించి కూడా చర్చ జరగలేదు. చైర్మన్‌, సభ్యుల సెలక్షన్‌పై ఆర్టికల్‌ 316, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రెగ్యులేషన్‌లో ఎలాంటి ప్రక్రియ లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంప్రదింపుల ప్రక్రియ, స్ర్కీనింగ్‌ ప్రక్రియ తప్పకుండా ఉండాలి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అనేది అత్యున్నత రాజ్యాంగబద్ధమైన సంస్థ.. ఈ పదవుల్లో నియామకమయ్యే వారికి కనీస అర్హతలు, హోదా ఉండాలి. సమర్థులు, అర్థత కలిగిన వారిని ఛైర్మన్‌, సభ్యులుగా నియమించడానికి చర్చల ప్రక్రియ చేపట్టకుండా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఇక్కడ అలాంటి కసరత్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వివాదంలో ఉన్న సభ్యుల సమర్థత, అర్హతలను.. పారదర్శక దృష్టితో తగిన పరిశీలన జరపడానికి ఈ అంశాన్ని ప్రభుత్వానికి రిమాండ్‌ చేస్తున్నాం. సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా ఎలాంటి రూల్స్‌, మార్గదర్శకాలు లేనంత మాత్రాన చిత్తశుద్ధి, కసరత్తు లేకుండా నియామకాలు చేయడం సరికాదు. ఈ దశలో నియామకాలకు సంబంధించిన జీవో 108ను కొట్టేయడం సబబుగా ఉండదు కాబట్టి.. ప్రభుత్వం నియామకాలను పునపరిశీలించి.. మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలి’’ అని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-06-17T11:19:38+05:30 IST