TSPSC paper leak: ఇంకా ఉంది.. తవ్వేకొద్దీ బయటకొస్తున్న...!

ABN , First Publish Date - 2023-03-17T11:28:05+05:30 IST

ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసు నిందితుడు ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ (Praveen pen drive)లో.. ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నపత్రాలతోపాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు కూడా ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌

TSPSC paper leak: ఇంకా ఉంది.. తవ్వేకొద్దీ బయటకొస్తున్న...!
TSPSC paper leak

పెన్‌డ్రైవ్‌లో మరో 2 ప్రశ్నపత్రాలు

ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్‌ పరీక్ష పేపర్లుగా గుర్తింపు

మొత్తం ఐదు పరీక్షల ప్రశ్నపత్రాలు!

వాటిలో ఇప్పటికే 3 పరీక్షలు రద్దు

మహిళలతో ప్రవీణ్‌ అశ్లీల చాటింగ్‌

అతడి ఫోన్‌లో 50 దాకా న్యూడ్‌కాల్స్‌

నిర్ధారించిన ఫోరెన్సిక్‌ నిపుణులు!

ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి తీరుపై టీఎస్‌పీఎస్సీ

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో సిట్‌ విచారణ

భవిష్యత్తులో జరిగే ప్రతి పరీక్ష పేపర్‌నూ మళ్లీ కొత్తగా తయారు చేయాల్సిందే!

లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC paper leak) కేసు నిందితుడు ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌ (Praveen pen drive)లో.. ఇప్పటికే గుర్తించిన మూడు పరీక్షల ప్రశ్నపత్రాలతోపాటు, మరో రెండు పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు కూడా ఉన్నట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష (AE Exam) తోపాటు టౌన్‌ ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ పేపర్లను ఇప్పటికే గుర్తించి వాటిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అవి కాక.. ఎంవీఐ, గ్రౌండ్‌వాటర్‌ ఎగ్జామ్‌ పేపర్లు కూడా అతడి పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించామని ఎఫ్‌ఎ్‌సఎల్‌ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. సిట్‌ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రంలాగా మిగతా పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లను సైతం ప్రవీణ్‌ ఇంకెవరికైనా ఇచ్చాడా? లేక అతడి పెన్‌డ్రైవ్‌కు మాత్రమే అవి పరిమితమయ్యాయా? అనే విషయాన్ని తేల్చేపనిలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే, ప్రవీణ్‌ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. పలువురు మహిళల నగ్నచిత్రాలు, అశ్లీలపదజాలంతో కూడిన చాటింగ్‌లు, 50కి పైగా నగ్న వీడియోలు ఉన్నట్టు తెలిసింది. అతడికి న్యూడ్‌ కాల్స్‌ చేసిన మహిళలు ఎవరో గుర్తించడంపై పోలీసులు దృష్టి సారించారు.

ఈ మేరకు ఒక బృందం సాంకేతిక వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2017 నుంచి నాలుగేళ్లపాటు టీఎ్‌సపీఎస్సీలో వెరిఫికేషన్‌ సెక్షన్‌లో పనిచేసిన ప్రవీణ్‌.. పబ్లిక్‌ పరీక్షల సమయంలో వెరిఫికేషన్‌, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే మహిళల ఫోన్‌ నంబర్లు తీసుకునేవాడు. అలా వారితో పరిచయం పెంచుకొని తరచూ మాట్లాడుతుండేవాడు. వారితో వాట్సాప్‌ చాటింగ్‌లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకునేవాడు. ప్రవీణ్‌ మెబైల్‌లో ఎక్కువగా మహిళల నంబర్లే ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. వారిలో ఎవరైనా రేణుక తరహాలోనే ప్రవీణ్‌ నుంచి పబ్లిక్‌ ఎగ్జామ్‌ పత్రాలు తెప్పించుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనపై సిట్‌ చీఫ్‌, అడిషనల్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సభ్యులు గురువారం టీఎస్‌పీస్సీ (TSPSC) కార్యాలయ ఉన్నతాధికారులతో, సిబ్బందితో మాట్లాడారని.. పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని సమాచారం. సెక్షన్‌లో జరిగే కార్యాకలాపాల గురించి తెలుసుకున్నారని.. ముఖ్యంగా ప్రవీణ్‌, రాజు కదలికలపై ఆరా తీశారని తెలిసింది.

‘‘ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ రాజు కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తారు? ఎవరి అనుమతితో వస్తారు? ఏయే అంశాల్లో వారి ప్రమేయం ఉంటుంది’’ తదితరఅంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్‌.. కార్యదర్శి పీఏ కావడంతో తరచూ సెక్షన్‌లోకి వస్తుంటాడని, రాజు నెట్‌వర్క్‌ అడ్మిన్‌ కావడంతో సిస్టంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తినా వచ్చి మరమ్మతులు చేస్తుంటాడని అక్కడి సిబ్బంది సిట్‌కు వెల్లడించారు. ఏఈ పరీక్షలకు ముందు ప్రవీణ్‌ కదలికలు, ప్రవర్తనపై వారిని ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్న పోలీసులు పలు సాంకేతిక ఆధారాలను సేకరించారు. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకర్‌లక్ష్మి సిస్టం మరమ్మతులకు గురికావడంతో దాన్ని రాజు, ప్రవీణ్‌ అవకాశంగా తీసుకున్నారని.. శంకర్‌లక్ష్మి కార్యదర్శి వద్దకు వెళ్లినప్పుడు ఆమె నుంచి కొట్టేసిన పాస్‌వర్డు, యూజర్‌ఐడీతో సిస్టంలోకి జొరబడి, అందులో దాచి ఉంచిన పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని, లాన్‌ ద్వారా వేరే సిస్టమ్‌కు పంపి.. అక్కణ్నుంచీ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారని సమాచారం. ప్రవీణ్‌కు కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో ఐదు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లభించిన నేపథ్యంలో.. భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలనూ కొత్తగా రూపొందించాలని టీఎ్‌సపీఎస్సీ అధికారులు నిర్ణయించారు.

సిట్టింగ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలి: కూనంనేని

టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వాస్తవాల వెలికితీతకు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు కమిషన్‌ వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌చేశారు. గ్రూప్‌-1 పరీక్ష పత్రాలు కూడా లీక్‌ అయ్యాయనే అనుమానాలు నిరుద్యోగులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. దీనిపై కూడా లోతుగా పరిశీలించి, ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని కోరారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌రద్దు చేయాలి

నిరుద్యోగుల కన్నీళ్లు, కష్టాలు మీకేం తెలుసని టీఎ్‌సపీఎస్సీని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. మీరు పాస్‌వర్డ్‌లు షేర్‌ చేసుకున్నంత ఈజీగా నిరుద్యోగుల జీవితాలు ఉండవన్నారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన గురువారం ట్విటర్‌లో డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.

కేటీఆర్‌ రాజీనామా చేయాలి: లక్ష్మణ్‌

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.ప్రశ్నప్రత్రం లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

Updated Date - 2023-03-17T11:28:05+05:30 IST