TS TET Special: ఈ కవుల గురించి ప్రశ్నలొస్తే.. !

ABN , First Publish Date - 2023-08-29T13:07:35+05:30 IST

టీఎస్‌ టెట్‌ రెండు పేపర్లలోనూ కామన్‌గా ఉండేది లాంగ్వేజ్‌-1. సహజంగానే 10వ తరగతి వరకు ప్రథమభాషగా తెలుగు చదివిన అభ్యర్థులందరూ ఐచ్ఛికంగా తెలుగును ఎంపిక చేసుకుంటారు. తెలుగులో

TS TET Special: ఈ కవుల గురించి ప్రశ్నలొస్తే.. !

టీఎస్‌ టెట్‌ రెండు పేపర్లలోనూ కామన్‌గా ఉండేది లాంగ్వేజ్‌-1. సహజంగానే 10వ తరగతి వరకు ప్రథమభాషగా తెలుగు చదివిన అభ్యర్థులందరూ ఐచ్ఛికంగా తెలుగును ఎంపిక చేసుకుంటారు. తెలుగులో తెలంగాణ కవులు, రచయితలకు సంబంధించిన అంశాలు కీలకమైనవి. ఎక్కువ ప్రశ్నలు ఈ విభాగం నుంచే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 2015 నుంచి అమల్లోకి వచ్చిన తెలుగు పాఠ్యపుస్తకాల్లో చేర్చిన పాఠాల కవులు, రచయితలపై అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. 6 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు ప్రథమభాష పాఠ్యపుస్తకాల్లో సుమారు 70 మంది కవులు, రచయితల గురించి ఉంది. వీరిలో కొందరు తెలంగాణేతర కవులు, రచయితలు కూడా ఉన్నారు. వీరందరి గురించి తెలుసుకుంటే ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా సరైన జవాబు గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

నన్నయ

11వ శతాబ్దానికి చెందిన నన్నయ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి. ఈయనకు వాగనుశాసనుడనే బిరుదు ఉంది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ అశ్వాసంలో ‘శారదరాత్రులు’ అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్నకథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వం అనే లక్షణాలున్నాయని చెప్పుకొన్నాడు.

పాల్కురికి సోమనాథుడు

12వ శాతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుని జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి(పాలకురికి/పాల్కురికి). ఈయన దేశ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన ఆదికవి. తెలుగులో ‘మణి ప్రవాళ శైలి’ని వాడిన తొలికవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. బసవపురాణము, అనుభవసారము, బసవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలైన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు.

గోన బుద్ధారెడ్డి

13వ శతాబ్దికి చెందిన ఈయన కాకతీయుల సామంతరాజు. ప్రస్తుతం నాగర్‌ కర్నూలు జిల్లాలో నందివడ్డెమాన్‌గా పిలుస్తున్న వర్ధమానపురం రాజధానిగా పాలించాడు. తన తండ్రిపేరిట ‘రంగనాథ రామాయణం’ యుద్ధకాండ వరకు రాశాడు. మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచ భూపతి, విఠలనాథుడు పూర్తిచేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులోని శైలి సరళంగా, మధురంగా ఉంటుంది.

యథావాక్కుల అన్నమయ్య

13వ శాతాబ్దికి చెందిన ఈయన శైలి ధారాళమైనది. ఈయన రచించిన సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యమున్నది.

బద్దెన

13వ శతాబ్దానికి చెందిన బద్దెన లౌకికనీతులను అతిసులువుగా కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశాడు. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు.

శ్రీనాథుడు

15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుడు కొండవీటి పాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. మరుత్తరాట్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, క్రీడాభిరామం తదితర గ్రంథాలు రచించాడు. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. ఉద్దండ లీల, ఉభయ వాక్ర్పౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి శ్రీనాథుని కవితా లక్షణాలు. శ్రీనాథుడు సీసపద్య రచనలో మేటి.

పోతన

15వ శతాబ్దానికి చెందిన పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. శ్రీమహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు. భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం ఈయన రచనలు. భక్తకవిగా, సహజ కవిగా పేరు పొందాడు. మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని ప్రకటించాడు. భగవంతుడిచ్చిన కవితాకళను భగవంతుడికే అంకితం చేస్తానన్నాడు. ఆ మేరకు తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా, పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. పోతన శైలి, మధు భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి.

కొఱవి గోపరాజు

15వ శతాబ్దానికి చెందిన కొఱవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొఱవి కసవరాజు. ఈయన నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్‌ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతోపాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలతో సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని రచించాడు.

పొన్నికంటి తెలగన

16వ శతాబ్దానికి చెందిన పొన్నికంటి తెలగన అచ్చ తెనుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న అచ్చతెనుగు ఆదికవిగా సుప్రసిద్ధుడు. గోలకొండ పరిసరాల్లో పొట్ల చెరువు(సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరువు) తెలగన నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చతెనుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలనేర్పరచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. ‘యయాతి చరిత్ర’ కావ్యం అచ్చ తెనుగు కావ్యాల్లో మొదటిదేగాక, అత్యుత్తమమైంది. దీన్ని ఒక మహ్మదీయ సరదారుకు అంకితమీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే.

ధూర్జటి

ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకడు. 16వ శతాబ్దికి చెందిన ఈయన శ్రీకాళహస్తి మహాత్మ్యం అనే ప్రబంధం, శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా ‘రాజుల్‌ మత్తులు, వారి సేవ నరకప్రాయం’ అని చెప్పిన ధీశాలి.

drtr.jpg

స్తంభంకాడి గంగాధర్‌

తెలుగు ఉపాధ్యాయులు

Updated Date - 2023-08-29T13:07:35+05:30 IST