Gurukula teachers posts: టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో స్కోరింగ్‌ ఇలా సాధించొచ్చు..!

ABN , First Publish Date - 2023-05-08T11:52:43+05:30 IST

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాల నియామక బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) దాదాపుగా 12,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో

Gurukula teachers posts: టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌లో స్కోరింగ్‌ ఇలా సాధించొచ్చు..!
Gurukula teachers posts

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల ఉద్యోగాల నియామక బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) దాదాపుగా 12,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు, జూనియర్‌ కళాశాల అధ్యాకులు, టీజీటీ, పీజీటీ, వ్యాయామ, గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించనప్పటికీ ఆగస్టు లేదా సెప్టెంబరులో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోటీ పరీక్షల్లో విజయం కోసం సాధన చేస్తున్నారు.

గురుకుల్‌ నియామక బోర్డు విడుదల చేసిన సిలబ్‌సలో జూనియర్‌ లెక్చరర్లు, టీజీటీ, పీజీటీ అభ్యర్థులకు కామన్‌గా ఉన్న అంశం బోధన సామర్థ్యాలు లేదా టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ అంటే ఏమిటి?

విద్యా మనో విజ్ఞాన శాస్త్రం లేదా సైకాలజీ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రవర్తన అతని సహజ సామర్థ్యాలు(ఆప్టిట్యూడ్‌), అభ్యసన వైఖరుల(ఆటిట్యూడ్‌)తో ప్రభావితమవుతుంది. ఒక వ్యక్తి తన వృత్తిని ఎంచుకోవడం అతని అభీష్టం మేరకు నిర్ణయిం కావాలి. అదేవిధంగా ఆ వృత్తికి సరిపోయే సహజ సామర్థ్యాలు అభ్యర్థిలో ఉన్నయా లేవా అనే అంశాన్ని ఉద్యోగ నియామక బోర్డు పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్‌ ఆప్టిట్యూడ్‌, క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌ వంటి పరీక్షలను నిర్వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తి కోసం సంసిద్ధం అవుతున్న అభ్యర్థుల బోధన సహజ సామర్థ్యాలను కూడా పరీక్షిస్తారు. ఈ అవగాహనతోనే గురుకుల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ను ఒక కామన్‌ అంశంగా పరీక్షల సిలబ్‌సలో చేర్చింది.

వాస్తవానికి ఈ సబ్జెక్ట్‌ ఎథిక్స్‌ లేదా నీతి శాస్త్రంతో అనుసంధానమై ఉంది. పరీక్షలు రాయడానికి సిద్ధపడిన అభ్యర్థులు ఈ సబ్జెక్టు నుంచి 20 నుంచి 25 మార్కుల వరకు వస్తాయనే విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నల సరళి అభ్యర్థుల సహజ సామర్థ్యాన్ని పరీక్షించే కోణంలో ఉంటుంది.

ఏ విషయాలపై పరిజ్ఞానం అవసరం?

వాస్తవానికి టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక ప్రత్యేక సబ్జెక్టు కాదు. అభ్యర్థులలో బోధన-అభ్యసన, తరగతి నిర్వహణ మొదలైన అంశాలపై ఉన్న తార్కిక సహజ జ్ఞానాన్ని పరిశీలిస్తారు. అభ్యర్థులు ఈ అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని సాధించగలగాలి. దీని కోసం విద్యకు సంబంధించిన సహజ పునాదులపై స్పష్టత ఉండాలి. విజ్ఞాన శాస్త్ర పునాదులుగా కిందివి గుర్తింపు పొందుతున్నాయి.

  • విద్యా తత్త్వ శాస్త్రం

  • విద్యా సమాజ శాస్త్రం

  • విద్యా మనో విజ్ఞాన శాస్త్రం

  • విద్యా సాంకేతిక శాస్త్రం

ఈ సబ్జెక్టులన్నీ బీఎడ్‌లో అంతర్భాగాలే. విద్యార్థులకు ఈ అంశాలపై ఉండే ప్రాథమిక అవగాహన తన సామర్థ్యాల ద్వారా అనుసంధానం చేయగలిగినప్పుడు విషయ అవగతం సులభం అవుతుంది.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రిపరేషన్‌కు ప్రత్యేక సన్నద్ధత ఏమీ అవసరం లేదు. అందుకు బదులు చదివిన బీఎడ్‌ కోర్సులోని ప్రాథమిక సబ్జెక్ట్స్‌ను పునశ్చరణ చేయడం ద్వారా ఎక్కువగా అవగతం చేసుకోవచ్చు.

సిలబస్‌లోని అంశాలు ఏమిటి?

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌కు ప్రత్యేక సిలబస్‌ ఉండదు. అభ్యర్థుల సహజ సామర్థ్యాలు, విశ్లేషణ గుణాలు, తార్కిక ఆలోచనల సమాహారంతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు రాసే స్థాయిని చేరుకోగలగాలి. అయితే గత ప్రశ్న పత్రాల ఆధారంగా టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ కోసం కొనసాగే ప్రిపరేషన్‌లో ఒక పద్ధతిని ఫ్రేమ్‌ చేసుకోవడం కోసం సిలబ్‌సను కింది విధంగా రూపొందించుకోవచ్చు.

  • బోధన మౌలికాంశాలు

  • అభ్యసన స్వభావ స్వరూపాలు

  • బోధన - అభ్యసన ప్రభావిత అంశాలు

  • బోధన పద్ధతులు - ఉపగమనాలు- వ్యూహాలు

  • బోధన - అభ్యసన ఉపకరణాలు(టీఎల్‌ఎం)

  • మూల్యాంకనము - నూతన మార్పులు

  • విద్యా వ్యవస్థలో వస్తున్న నూతన ధోరణలు

అభ్యర్థులు పై అంశాల ఆధారంగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేక నోట్స్‌ను రూపొందించుకోవాలి.

ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?

తెలంగాణ గురుకుల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొదటిసారిగా జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఇస్తోంది. వాస్తవానికి గురుకుల్‌ పాఠశాలలన్నీ ఇంగ్లీష్‌ మీడియంలో బోధించే స్కూల్స్‌. ఈసారి తెలుగు మీడియం అభ్యర్థులకు జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో భాషపరమైన వెసులుబాటు లభించింది.

ప్రశ్నలు ప్రధానంగా బోధన సామర్థ్యాలపై, బోధనలో ప్రాచీన, ఆధునిక పద్ధతులపై, బోధన స్వభావం మారుతున్న ధోరణులపై, బోధన అభ్యసనలో టెక్నాలజీ వినియోగంపై, అభ్యసన స్వభావం, బోధన-అభ్యసనం మధ్య సంబం ధం, అభ్యసన సూత్రాలు, అభ్యసన ప్రక్రియలు, బోధన-అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు, ప్రధానంగా దైనిక, సామాజిక పరిసరాలు, మాపనం-మూల్యాంకనంలో వస్తున్న మార్పులు, ఎన్‌సీఎఫ్‌-2005, ఎన్‌ఈపీ-2020 మొదలైన అం శాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదే విధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడి ప్రవర్తన, పిల్లలు, వారి తల్లిదండ్రులు, పరిసరాలతో ఉండే సంబంధంపై ప్రశ్నలు వస్తాయి.

మాదిరి ప్రశ్నలు

1. వ్యక్తిగా మీరు ఏమిటో మీరు వివరించడాన్ని ఏమంటారు?

1. స్వీయ అవగాహన 2. ఆత్మగౌరవ వ్యక్తీకరణ

3. ఆత్మ ఆవిష్కరణ 4. పైవన్నీ

2. వినడం అనేది

1. అప్రయత్నంగా జరిగే శారీరక ప్రక్రియ

2. సహజ అలవాటు

3. సోపానాలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియ 4. ప్రతిక్రియ

3. సహజ సామర్థ్యాలు అనేవి?

1. ప్రతిభలు 2. కౌశలాలు

3. నిష్పాదన 4. అభ్యసించని సామర్థ్యాలు

1) 1, 2, 4 2) 2, 3, 4 3) 1, 2, 3 4) 1, 2, 4

4. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించిన పాఠశాల స్థాయులు

1. 5+3+2 2. 5+3+3+4

3. 3+3+3+3 4. 5+3+4+4

5. మంచి విద్యార్థి అంటే?

1. శ్రద్ధగా పాఠాలు వినేవాడు

2. ప్రశ్నించే తత్వం కలిగినవాడు

3. పుస్తకాలు అతిగా చదివేవాడు

4. పరీక్షల లక్ష్యంతో సంసిద్ధం అయ్యేవాడు

సమాధానాలు:

1) 3; 2) 3); 3) 1; 4) 2; 5) 2

dldl.jpg

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-05-08T11:52:43+05:30 IST