TSPSC: గ్రూప్‌-2 ప్రిపరేషన్‌కు అదనపు సమయం వినియోగించుకుంటే మేలే

ABN , First Publish Date - 2023-09-04T12:55:57+05:30 IST

రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో అత్యధిక అభ్యర్థులు సంసిద్ధమయ్యే ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన వరుస పరీక్ష తేదీలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ విద్యార్థులు, ప్రిపరేషన్‌కు సమయం కావాలని

TSPSC: గ్రూప్‌-2 ప్రిపరేషన్‌కు అదనపు సమయం వినియోగించుకుంటే మేలే

రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో అత్యధిక అభ్యర్థులు సంసిద్ధమయ్యే ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్‌-2. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన వరుస పరీక్ష తేదీలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ విద్యార్థులు, ప్రిపరేషన్‌కు సమయం కావాలని ఉద్యమించిన నేపథ్యంలో, ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు మొదటివారంలోని 2, 3 తేదీలకు వాయుదాపడ్డాయి. అదనంగా లభించిన ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం.

గ్రూప్‌-2 సిలబస్‌ నేపథ్యం ఏమిటి?

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహశీల్దార్‌ తదితర ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షలు, విద్యార్థుల అవగాహన, నైపుణ్యం, వినియోగ జ్ఞాన సామర్థ్యాలకు ఉన్నతస్థాయి మూల్యాంకనాలే. అభ్యర్థులు ప్రతి నిమిషాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుంటేనే విజయాన్ని సాధించగలరు.

అన్నింటికంటే ముందు గ్రూప్‌-2 సిలబస్‌ నేపథ్యాన్ని అవగతం చేసుకోవాలి. ఈ సిలబస్‌ విద్యార్థులను బహుముఖ కోణంలో పరిశీలించి, విశ్లేషించే నేపథ్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఎక్కువమంది రాసే అగ్రగామి పరీక్ష. అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన విషయాలకే సిలబ్‌సలో అత్యధిక ప్రాధాన్యం ఉంది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఈ పరీక్షలో రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఆర్థిక అంశాలు, ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర ఆవిర్భావం, సమాజం, భూగోళం మొదలైన అంశాలతోపాటు భారత రాజ్యాంగ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను అభ్యర్థులు లోతుగా అర్థం చేసుకోవాలి. గత పరీక్షల్లో ప్రధానంగా జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లీష్‌ అంశాలపై అడిగిన ప్రశ్నలు నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాయని అభ్యర్థులు గమనించాలి.

అదనపు సమయం అంటే ఏమిటి?

ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-2 నవంబరు మొదటి వారానికి వాయిదా పడింది. దాంతో ప్రిపరేషన్‌కు రెండు నెలల వ్యవధి లభించింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ గత డిసెంబరులోనే రావడం వల్ల, అప్పటికే ప్రిపరేషన్‌ను పూర్తిచేసిన విద్యార్థులు, 2016లో పరీక్ష రాసిన విద్యార్థులు, నూతనంగా దరఖాస్తు చేసుకున్నవారు ప్రిపరేషన్‌లోకి వెళ్లారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజ్‌ సంక్షోభంతో అనేక పరీక్షలు రద్దయి, నూతన తేదీలను ఖరారుచేయడం వల్ల గ్రూప్‌-2పై ఫోకస్‌ జరగలేదు. ఈ నేపథ్యంలో నూతన ప్రిపరేషన్‌ ప్లాన్‌ ప్రతి విద్యార్థికి అవసరం.

జనరల్‌ స్టడీస్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

వాస్తవంగా గ్రూప్‌-2 ప్రిపరేషన్‌లో అత్యంత క్లిష్టమైన పేపర్‌ ఇది. పదకొండు అంశాలతో కూడిన ఈ పేపర్‌లో కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌, పర్యావరణం, భూగోళం, చరిత్ర-సంస్కృతి, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ విధానాలు, సామాజిక రక్షణ, లాజికల్‌ రీజనింగ్‌, బేసిక్‌ ఇంగ్లీష్‌ కీలకాంశాలు. జనరల్‌ స్టడీస్‌ ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అభ్యర్థులు దీనిని చివరికి వాయిదా వేయడం మంచిది. ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో లేటెస్ట్‌ సమాచారానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా అక్టోబరు మొదటివారం వరకు సంఘటనలు నమోదు చేసుకొని ప్రిపరేషన్‌ కొనసాగించడం అవసరం. లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, బేసిక్‌ ఇంగ్లీష్‌ ప్రిపరేషన్‌ కోసం గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అవసరం. ప్రధానంగా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా గుర్తెరగాలి. మిగిలిన అంశాలు పేపర్‌-2, పేపర్‌-3, పేపర్‌-4లో భాగంగా అధ్యయనం చేయాలి.

పేపర్‌-2: చరిత్ర, పాలిటీ, సమాజం ఎలా చదవాలి?

వాస్తవంగా గ్రూప్‌-2 అన్ని పేపర్లలో అతి కఠినమైన ప్రశ్నలు ఈ పేపర్‌లోనే ఉంటాయి. సిలబస్‌ ఎక్కువ, కాఠిన్యత, క్లిష్టత ఈ పేపర్‌ ప్రత్యేకత. ఈ పేపర్‌లో భారత చరిత్ర-సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తూ 25 మార్కులు కేటాయించారు. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతచరిత్రలో ఆధునిక చరిత్ర ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు బీఏ మొదటి, రెండో సంవత్సరం అకడమిక్‌ పుస్తకాలు చదవడం మంచిది. లేదా కనీసం ఇంటర్‌ మొదటి సంవత్సర చరిత్ర పుస్తకం చదవడం మంచిది. తెలంగాణ చరిత్ర-సంస్కృతిపై అవగాహనకు ఇంటర్‌ రెండో సంవత్సరం లేదా బీఏ ఫైనల్‌ ఇయర్‌ చరిత్ర పుస్తకాలు చదవడం అవసరం.

50 మార్కులు కేటాయించిన పాలిటీ ప్రిపరేషన్‌ చాలా ముఖ్యమైంది. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణలు, పరిపాలనా సంస్కరణలు, సుపరిపాలన దిశగా చర్యలు, స్థానిక ప్రభుత్వాల అంశాలు అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఇటీవలికాలంలో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు, వివిధ రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పేపర్లు పరిశీలించడం అవసరం. తక్కువ సమయంలో ప్రాథమిక అవగాహనకు ఇంటర్‌ రెండో సంవత్సరం రాజనీతిశాస్త్రం లేదా బీఏ రెండో సంవత్సరం రాజనీతిశాస్త్రం చదవడం అవసరం. సమాజశాస్త్రం కోసం 50 మార్కులు కేటాయించారు. అయితే గత ప్రశ్నపత్రాల్లో ఈ శాస్త్రంపై ప్రశ్నల సంఖ్య తక్కువ. అవగాహన కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఉపయోగపడతాయి.

పేపర్‌-3: ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

అభ్యర్థులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే పేపర్‌ ఆర్థికవ్యవస్థ. మారిన సిలబ్‌సకు అనుగుణంగా ఉన్న ఇంటర్‌ రెండో సంవత్సరం అర్థశాస్త్రం, బీఏ ఫైనల్‌ ఇయర్‌ డెవల్‌పమెంట్‌ ఎకానమీ చదవడం అవసరం. వీటితోపాటుగా ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వే రిపోర్టులు, తెలంగాణ ఎకనమిక్‌ సర్వే రిపోర్టులను అవగతం చేసుకోవడం అవసరం. డేటాను గుర్తుపెట్టుకోవడం కన్నా విశ్లేషణ ఫలితాలను అవగతం చేసుకోవడం అవసరం.

పేపర్‌-4: తెలంగాణ ఉద్యమం

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం, రాజ్యాంగ అవగాహన, ఉద్యమ రూపాల అవగాహన, చారిత్రక పరిణామక్రమాల ప్రభావం కోణంలో అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి దారితీసిన సంఘటనలు, ఒప్పందాల ఉల్లంఘనలను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. మలిదశ ఉద్యమంలో సంఘటనలను తేదీల వారీగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు, సియా పబ్లికేషన్స్‌ ప్రచురించిన తెలంగాణచరిత్ర-సంస్కృతి-ఉద్యమం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు.

ప్రిపరేషన్‌కు ప్రత్యేక సూచనలు

అభ్యర్థులు గ్రూప్‌-2 కోసం అదనంగా లభించిన సమయాన్ని కిందివిధంగా వినియోగించుకోవడం అవసరం.

  • గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల ట్రెండ్‌ను గమనించడం.

  • అకడమిక్‌ పుస్తకాలకు ప్రాధాన్యం ఇచ్చి స్వీయ నోట్స్‌ తయారుచేసుకోవడం.

  • రెగ్యులర్‌గా నాణ్యమైన టెస్ట్‌ సిరీ్‌సలను గుర్తించి ప్రాక్టీస్‌ చేయడం.

  • చిన్న చిన్న స్టడీ గ్రూప్స్‌గా ఏర్పడి, విషయాలను చర్చించడం.

  • అనవసర ఆందోళనలకు గురికాకుండా, ఒక ప్లాన్‌ రూపొందించుకొని దానిని ఆచరణలో పెట్టడం.

విద్యార్థుల కృషి, నిర్విరామ పోరాట ఫలితంగా లభించిన ఈ అదనపు కాలాన్ని సద్వినియోగపర్చుకొని విజయం లభించే దిశగా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

DE.jpg

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2023-09-04T12:55:57+05:30 IST