AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

ABN , First Publish Date - 2023-08-17T12:43:30+05:30 IST

తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్‌ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది.

AP NIT: ఏపీ నిట్‌లో సీట్ల కుదింపు! రాష్ట్ర సర్కారు అలసత్వమేనంటూ..!

మొత్తం 240 సీట్లు నష్టపోతున్న విద్యార్థులు

ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం

రాష్ట్ర సర్కారు అలసత్వమేనని విమర్శలు

(భీమవరం-ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో (AP NIT) సీట్లు కుదించేశారు. గత ఏడాది 750 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, ఈ ఏడాది 480 సీట్లకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నారు. అంతకుముందు ఏడాది 600 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించారు. వాస్తవానికి దేశంలోనే ఏపీ నిట్‌ అత్యధిక సీట్లతో ప్రారంభమైంది. కొత్తగా ప్రారంభమైన దశలో 120 సీట్లు మాత్రమే కేటాయిస్తారు. అటువంటిది రాష్ట్ర విభజన కారణంగా విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో సీట్ల సంఖ్యను పెంచారు. ఏపీ నిట్‌లో 50శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. విభజన సమయంలో వరంగల్‌ నిట్‌ తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడ 50 శాతం రిజర్వేషన్‌ను ఏపీ విద్యార్థులు కోల్పోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నిట్‌కు 480 సీట్లు కేటాయించారు. తొలి ఏడాది నుంచే అడ్మిషన్లు నిర్వహించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ కృషితో.. వరంగల్‌ నిట్‌లో మరో 60 సూపర్‌ న్యూమరీ సీట్లను ఏపీ విద్యార్థులకే కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత మొత్తం సీట్లను ఏపీ నిట్‌కు కేటాయిస్తూ ఆమోదముద్ర వేసింది. దీంతో 2019-20లో వరంగల్‌ నిట్‌లోని సూపర్‌ న్యూమరీ సీట్లు ఏపీ నిట్‌కు బదలాయించారు. దీంతో సీట్ల సంఖ్య 600కు పెరిగింది. తర్వాత కేంద్రం అమలుచేసిన ఈ-కేటగిరి కోటాలో మరో పది శాతం కలిశాయి. ఫలితంగా గతేడాది 700 సీట్లకు అడ్మిషన్‌లు నిర్వహించారు. తీరా ఫ్యాకల్టీ కొరతతో ఇప్పుడు సీట్ల సంఖ్య కుదించేశారు. ఏపీ నిట్‌కు గతేడాది మాదిరిగానే 700 సీట్లు ఉన్నట్టయితే ఏపీ విద్యార్థులకు 350 సీట్లు లభించనున్నాయి. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. ఇప్పుడు 480 సీట్లకు అడ్మిషన్‌లు కల్పిస్తే 240 సీట్లు మాత్రమే ఏపీ విద్యార్థులకు దక్కనున్నాయి. అంటే 110 సీట్లు తగ్గిపోనున్నాయి. ఇతర రాష్ట్ర విద్యార్థులూ ఆ మేరకు నష్టపోనున్నారు.

అనుమతి వస్తే సరే..

బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఈ విషయంలో ఆలస్యంగా మేల్కొంది. రెగ్యులర్‌ ఫ్యాకల్టీ నియామకానికి ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ ఇప్పటికీ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నిట్‌లో 43 మంది మాత్రమే రెగ్యులర్‌ ఫ్యాకల్టీ ఉన్నారు. మరో 110 మంది తాత్కాలిక సిబ్బందితో బోధన నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టుల్లో 68 మంది బోధనేతర సిబ్బంది ఉంటే అవుట్‌ సోర్సింగ్‌లో 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ తాజా ప్రతిపాదనల మేరకు కేంద్ర విద్యాశాఖ 68 మంది బోధన సిబ్బందికి, 150మంది బోధనేతర సిబ్బందికి ఆమోదముద్ర వేసింది. కేంద్రం అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంతమేర ఫ్యాకల్టీ సమస్య తీరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించడం లేదు.

Updated Date - 2023-08-17T12:43:30+05:30 IST