Kothapaluku : ఏది ‘న్యాయం’?

ABN , First Publish Date - 2023-10-01T01:03:54+05:30 IST

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెపుడు బయటకు వస్తారు? ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలో కూడా అనేక మంది నోటి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ..

Kothapaluku : ఏది ‘న్యాయం’?

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెపుడు బయటకు వస్తారు? ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలో కూడా అనేక మంది నోటి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చంద్రబాబును జైలుకు పంపి మూడు వారాలు దాటుతోంది. తాడూ బొంగరం లేని కేసులో ఆయనను అన్యాయంగా ఇరికించారన్న భావనతో ఉన్న ప్రజలు, న్యాయ వ్యవస్థలో కూడా ఆయనకు ఉపశమనం లభించడంలో జాప్యం జరుగుతూ ఉండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా ఉపశమనం కల్పించిన న్యాయస్థానాలు, చంద్రబాబు విషయంలో ఆధారాలు లేకపోయినా చెరసాల నుంచి విముక్తి కల్పించకపోవడం ఏమిటి? లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను కనీసం విచారణకు పిలవకుండా రెండు నెలల పాటు సర్వోన్నత న్యాయస్థానమే వెసులుబాటు కల్పించినప్పుడు చంద్రబాబు విషయంలో మరోలా ఎందుకు జరుగుతోంది? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం జరగకపోవడం, స్కిల్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు సేకరించాల్సి ఉందని సీఐడీ చెబుతున్నప్పటికీ ఆయనను రిమాండ్‌కు పంపడం వంటివి న్యాయ వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. స్కిల్‌ కేసులో ప్రభుత్వం ఖర్చు పెట్టిందే 371 కోట్ల రూపాయలు. ఇందులో ఎంత మొత్తం దుర్వినియోగం జరిగిందో కూడా నిర్ధారణ కాలేదు. ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబు బయటకు రావడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలియదు. దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించకపోయినా ఈ కేసులో చంద్రబాబు నెల రోజులకు పైగా జైలుకే పరిమితం కావాల్సి వస్తోంది. 371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని రచ్చ చేస్తున్న వాళ్లు... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులతో పోల్చితే ఇది ఎంత అని కూడా ప్రశ్నించుకోవాలి. తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం నుంచి అక్రమంగా మేళ్లు చేయించి, 43 వేల కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని జగన్మోహన్‌ రెడ్డి కొల్లగొట్టారన్నది సీబీఐ చేసిన ఆరోపణ. ఈ కేసుల్లో జగన్‌ పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిలుపై విడుదలైన ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. చంద్రబాబు బయట ఉంటే ఆయన సహ నిందితులను ప్రభావితం చేస్తారని చెప్పి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అధికారంలో లేని వ్యక్తి సహ నిందితులు లేదా సాక్షులను ప్రభావితం చేస్తారనుకుంటే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి తనపై ఉన్న కేసులలో సహ నిందితులను, సాక్షులను ప్రభావితం చేయరా? ఎవరినైనా ప్రభావితం చేసే శక్తి అధికారంలో ఉన్న వారికే ఉంటుంది కదా? అయినా జగన్‌రెడ్డి బెయిలు రద్దు చేయాలని సీబీఐ కోరడం లేదు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 371 కోట్ల రూపాయల మొత్తానికే ఒక వ్యక్తిని నెల రోజులకు పైగా నిర్బంధించినప్పుడు 43 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్‌ రెడ్డిని ఎంతకాలం జైల్లో ఉంచాలి? వెయ్యి కోట్లకు మూడు నెలల వంతున లెక్కించినా దాదాపు పదేళ్లపాటు జైలుకే పరిమితం కావాలి కదా? వ్యవస్థలను ఎవరు మేనేజ్‌ చేశారో, చేస్తున్నారో ఇపుడు అర్థమైందా? ఇంతకీ స్కిల్‌ కేసులో ఏ మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయో ఇంతవరకు నిర్ధారించలేదు. అయినా జగన్మోహన్‌ రెడ్డి రోత మీడియా, కూలి మీడియాతో పాటు మరికొన్ని తీతువుపిట్టలు మొత్తం 371 కోట్లు తినేశారని ప్రచారం చేయడం వింతగా ఉంది.

సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఒకచోట 371 కోట్ల రూపాయలు అనీ, మరో చోట 241 కోట్లు దుర్వినియోగం అయ్యాయనీ పేర్కొన్నారు. జీఎస్టీ అధికారులు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 241 కోట్లు అని చెప్పినప్పుడు 371 కోట్లు అని సీఐడీ అధికారులు ఎలా చెబుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జీఎస్టీ అమలులో లేదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు సామగ్రి సమకూర్చిన కింది స్థాయి సంస్థలు కొన్ని అప్పట్లో అమలులో ఉన్న సర్వీస్‌ టాక్స్‌ను ఎగవేశాయన్నది ప్రధాన ఆరోపణ.

371 కోట్ల రూపాయల కాంట్రాక్టులో చెల్లించాల్సిన పన్ను మొత్తం 241 కోట్ల రూపాయలు ఉండదు కదా? మొత్తం 241 కోట్లు దుర్వినియోగం అయ్యాయని జీఎస్టీ అధికారులు ఎలా చెబుతారు? పరికరాలు సరఫరా చేయకుండానే నిధులు కాజేసి ఉంటే సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఏముంటుంది? అలా జరిగి ఉంటే అది కుంభకోణమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం డిజైన్‌టెక్‌ సంస్థకు విడుదల చేసిన 371 కోట్లలో 58 కోట్ల రూపాయలను సీమెన్స్‌ సంస్థకు చెల్లించారు. ఈ మేరకు సీమెన్స్‌ కూడా ధ్రువీకరించింది. ఇక మిగిలింది 313 కోట్ల రూపాయలే. ఇందులో 241 కోట్లు దుర్వినియోగం జరిగాయని ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించిన శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ ఎలా నిర్ధారించింది? శిక్షణ కేంద్రాలను తనిఖీ చేసి, కంప్యూటర్లు వగైరా సరఫరా అయ్యాయా? లేదా? అన్నది తెలుసుకోకుండానే 241 కోట్ల రూపాయల వరకూ దుర్వినియోగం జరిగిందని నిర్ధారించిన శరత్‌ అసోసియేట్స్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాల్సి ఉంటుంది. చార్డర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ శరత్‌ అసోసియేట్స్‌పై చర్య తీసుకోవాలి కూడా. శిక్షణ కేంద్రాలను తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు శరత్‌ అసోసియేట్స్‌ తన నివేదికలో పేర్కొంది.

ఇటు శరత్‌ అసోసియేట్స్‌ సంస్థ గానీ, అటు జీఎస్టీ అధికారులు గానీ శిక్షణ కేంద్రాలను పరిశీలించలేదని స్పష్టమవుతున్నప్పుడు అన్ని వందల కోట్లు, ఇన్ని వందల కోట్లు తినేశారని గోబెల్స్‌ ప్రచారం చేయడం ఏమిటి? ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులైనా శిక్షణ కేంద్రాలను తనిఖీ చేశారా? అంటే అది కూడా జరగలేదు! అదేమంటే జీఎస్టీ అధికారులు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన వాళ్లూ చెప్పారు కదా? అని సీఐడీ అధికారులు చెప్పుకోవడం వారి దర్యాప్తులోని డొల్లతనాన్ని బయటపెట్టడం లేదా? మొత్తం ఈ వ్యవహారాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా చంద్రబాబును మాత్రం జైలుకు పంపించేశారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో అంకెలు ఒక్కోచోట ఒక్కోలా ఉండటం ఏమిటని ఏసీబీ న్యాయస్థానం కూడా ప్రశ్నించలేదు. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు చెప్పారు కనుక ఆయన దోషి అని అంటున్నారు.


ఏ ముఖ్యమంత్రి అయినా ఫలానా పథకానికి లేదా ఫలానా పనికి నిధులు విడుదల చేయవలసిందిగా ఆదేశించడం సహజం. నిధుల లభ్యత తెలుసుకోవడంతో పాటు నిబంధనలు పాటించడం అధికారుల బాధ్యత. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు చెప్పారో లేదో తెలియదు. చెప్పినా అది నేరం కాదు. ఇంతకు మించి కాంట్రాక్టు మొత్తం 371 కోట్లలో ఇంత మొత్తం దొడ్డి దారిన చంద్రబాబుకు చేరిందని జీఎస్టీ కానీ, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కానీ, సీఐడీ అధికారులు కానీ నిర్ధారించలేదు కదా! జగన్మోహన్‌ రెడ్డి విషయంలో అలా కాదు. ఆయన నెలకొల్పిన కంపెనీలలోకి ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చి పడ్డాయో, ఆ నిధులు సమకూర్చిన వారికి ప్రభుత్వపరంగా జరిగిన మేళ్లు ఏమిటో కూడా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో వివరించారు. స్కిల్‌ కేసులో అలాంటి నిర్ధారణ జరగకపోయినా అరెస్టు చేసి జైలుకు పంపారు.

సుప్రీంకోర్టులో అయినా చంద్రబాబుకు న్యాయం జరుగుతుందో లేదో తెలియదు. ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ కేసులలో విచారణ ఏడాదిలోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సదరు ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలై పదేళ్లు దాటినా ఆయనపై దాఖలైన చార్జిషీట్లు విచారణకు నోచుకోవడం లేదు. ఈ కేసులు ఎప్పుడు తేలుతాయో కూడా తెలియదు. తనపై అన్యాయంగా కేసులు పెట్టారని, తాను అధికారంలో లేకపోయినా అవినీతి చేశాననడం ఏమిటని జగన్‌ ఆక్రోశిస్తూనే ఉన్నారు. ఆయన నిర్దోషి అని స్పష్టం కావాలన్నా కేసులు విచారణకు నోచుకోవాలి కదా? ఈ కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితులను గమనిస్తున్న వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్‌ రెడ్డి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతగా విస్తరించుకున్నారో అందరికీ తెలిసిందే.

45 ఏళ్ల ప్రజా జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఉన్నది ఒక్క హెరిటేజ్‌ సంస్థ మాత్రమే.. అది కూడా ప్రస్తుత స్థాయికి చేరడానికి 30 ఏళ్లు పట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారి కుమారులు ఎవరూ జగన్మోహన్‌ రెడ్డి వలె వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పుకోలేదే? అదేమంటే అది వారి చేతగానితనం అని వాదించే వారు ఉంటారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్‌ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారు. అనతికాలంలోనే జగన్మోహన్‌ రెడ్డి దేశంలోకెల్లా అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఎదిగారంటేనే ఆయన లీలలను అర్థం చేసుకోవచ్చు.

పగ, ప్రతీకారంతో రగులుతూ..

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు విషయానికి వద్దాం. తనపై సీబీఐ విచారణ జరగడానికి చంద్రబాబు కూడా కారణం అన్నది జగన్మోహన్‌ రెడ్డి అభిప్రాయం. జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మొదటగా దాఖలు చేసింది కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్‌ శంకర్రావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన పూసపాటి అశోక గజపతిరాజు, కె.ఎర్రన్నాయుడు ఆ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన మీదట జగన్మోహన్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇది చరిత్ర. తాను అరెస్టు కావడానికి, పదహారు నెలలపాటు జైలు జీవితం గడపటానికి చంద్రబాబు కారణం అని భావించి నాటి నుంచి ఆయనపై జగన్‌ పగ పెంచుకున్నారు. పూసపాటి అశోక గజపతిరాజును ఏ విధంగా వేధించారో మనం చూశాం.

ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించినందున ఆయన సోదరుడైన అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసి కక్ష తీర్చుకున్నారు. అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసి మూడేళ్లు దాటుతున్నప్పటికీ, ఆయనపై మోపిన కేసులో పురోగతి శూన్యం. సీఐడీ అధికారులు కనీసం చార్జిషీటు కూడా దాఖలు చేయలేదు. ఎర్రన్నాయుడు కుటుంబంపై పగ తీర్చుకోవడమే జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యం కనుక అది నెరవేరినందున కేసు గాలికి పోయింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. అదను చూసి తలా తోకా లేని కేసులో ఆయనను అరెస్టు చేయించారు. ఇంతటితో ఆయనలోని పాలెగాడు శాంతించలేదు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను కూడా జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నారు. అంతటితోనైనా జగన్‌ శాంతించే సూచనలు కనిపించడం లేదు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుతో హెరిటేజ్‌ సంస్థకు ముడిపెట్టి ఆ సంస్థలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కూడా అరెస్టు చేయించాలన్న దుష్ట తలంపుతో జగన్‌ ఉన్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ హయాంను కూడా కలుపుకొంటే నందమూరి, నారా కుటుంబాలు దాదాపు ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయి.

ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నారని గానీ, అవినీతికి పాల్పడినట్టు గానీ ఇంతవరకు ఎవరూ ఆరోపించలేదు. ఇప్పుడు మొదటిసారిగా పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్మోహన్‌ రెడ్డి ఏకంగా జైలుకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. స్కిల్‌ కేసులో కూడా చంద్రబాబుకు ఇంత డబ్బు ముట్టిందని ఏ సంస్థ కూడా చెప్పలేక పోతున్నది. అయినా ఆయనను చెరసాలకు పరిమితం చేశారు. న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా ఈ కేసు లోతుల్లోకి వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకు కూడా అదే అవసరం. సీఐడీపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికీ అంతో ఇంతో నమ్మకం ఉంది. స్కిల్‌ కేసులో సాంకేతికంగా కాకుండా కేసు మెరిట్స్‌ను బట్టి చంద్రబాబు తప్పు చేశారో లేదో సుప్రీంకోర్టు అయినా చెబుతుందని ఆశిద్దాం. అలా జరిగితే న్యాయ వ్యవస్థ ఔన్నత్యమే పెరుగుతుంది. నిందితులు, సాక్షులతో అంతా నిజమే చెబుతామని న్యాయస్థానంలో ప్రమాణం చేయిస్తారు. న్యాయమూర్తులు కూడా ఆయా కేసులలో న్యాయమైన తీర్పునే ఇస్తామని ప్రమాణం చేయాలని కార్టూన్లు వస్తున్నాయంటే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం సడలుతోందని భావించాలి.


బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా..

స్కిల్‌ కేసు తర్వాత చంద్రబాబు పనై పోయిందని కొంతమంది సంతోషిస్తూ ఉండవచ్చును గానీ నిజానికి జైలుకు వెళ్లిన తర్వాత ప్రజల్లో ఆయన పరపతి పెరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే కాదు– ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. చంద్రబాబు ఇన్ని రోజులు జైల్లో ఉండి ఉండకపోతే ప్రజల్లో సానుభూతి పెరిగేది కాదు. ఆయనను ఎంత ఎక్కువ కాలం జైల్లో ఉంచితే ప్రజల్లో సానుభూతి అంతలా పెరుగుతూనే ఉంటుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి నామమాత్రమే. అయినా చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత తెలంగాణలో ఆయన పట్ల సానుభూతి ఏర్పడింది. ఆంధ్ర మూలాలు ఉన్నవారిలోనే కాదు తెలంగాణవాదుల్లో కూడా చంద్రబాబు పట్ల సానుభూతి ఏర్పడింది. సాత్వికంగా ఉండే చంద్రబాబును 73 ఏళ్ల వయసులో జైల్లో పెట్టడాన్ని తెలంగాణ సమాజం కూడా గర్హిస్తున్నది.

ఆంధ్ర మూలాలు ఉన్న వారు నివసించే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యులు ముక్తకంఠంతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీలు నిర్వహించడాన్ని అనుమతించబోమని ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ కూడా గొంతు సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మంలో శనివారం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌, పొరపాటును సరిదిద్దుకొనే ప్రయత్నం చేశారు. ఉభయ రాష్ర్టాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే చంద్రబాబు అరెస్టును ఖండించే విషయమై అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. తెలంగాణకు చెందిన బండి సంజయ్‌ మాత్రమే చంద్రబాబుకు పూర్తి స్థాయి సంఘీభావం ప్రకటించగా, మిగతా నాయకులలో కొందరు మొక్కుబడిగా ఖండించారు. ఈ కారణంగా తెలంగాణలో కూడా బీజేపీ ఎంతో కొంత నష్టపోతుంది.

కేంద్ర పెద్దల సహకారం, గ్రీన్‌సిగ్నల్‌ ఉన్నందునే చంద్రబాబును జగన్‌ రెడ్డి అరెస్టు చేయించారని ఉభయ రాష్ర్టాల ప్రజలూ బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో బీజేపీ నానాటికీ బలహీనపడటానికి ఇది కూడా ఒక కారణం. బీజేపీ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలపడుతోంది. ఈ పరిణామమే అధికార భారత రాష్ట్ర సమితికి తలనొప్పిగా మారింది. త్రిముఖ పోటీలో తాము సునాయాసంగా గెలుస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటిదాకా భరోసాతో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నష్ట నివారణ చర్యలపై అటు కేటీఆర్‌, ఇటు హరీశ్‌రావు దృష్టిసారించారు. మరో వారం పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుంది. ఈ ఎన్నికలు అటు బీఆర్‌ఎస్‌కు, ఇటు కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ కారణంగానే బీఆర్‌ఎస్‌ దూరమైన వర్గాలను దరిచేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2018లో బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారకుడు అయ్యారు. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో నష్టం అంటూ జరిగితే అందుకు చంద్రబాబు అరెస్టు అంశం కూడా అంతో ఇంతో కారణం అవుతుంది. ఈ వాస్తవాలను గుర్తిస్తే బీఆర్‌ఎస్‌కే మంచిది. చంద్రబాబు ఉదంతంలో జగన్‌రెడ్డి కూడా ఒక విషయం తెలుసుకోవాలి.

పోలీసులను అతిగా ఉపయోగించే ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందే కానీ సానుకూలత ఏర్పడదు. చంద్రబాబు అరెస్టు తర్వాత తన గ్రాఫ్‌ పడిపోయిందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జగన్‌కు వాస్తవం తెలుస్తుంది. ‘చంద్రబాబును అరెస్టు చేయడం జగన్మోహన్‌ రెడ్డికి ఆత్మహత్యా సదృశం’ అని ఐప్యాక్‌ అధిపతి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారంటే భవిష్యత్తులో జరగబోయేది ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబును అరెస్టు చేసినా ప్రజలు బయటకు వచ్చి నిరసనలు తెలపడంలేదని జగన్‌ అండ్‌ కో ఆత్మవంచనకు పాల్పడుతుండవచ్చును గానీ భయం నీడలో బతుకుతున్న ప్రజల చేతిలో కూడా బటన్‌ ఉంటుందన్న విషయం వారు గుర్తించాలి!

ఆర్కే

Updated Date - 2023-10-01T07:29:00+05:30 IST