RBI Policy Rates : కీలక రేట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2023-06-08T11:09:05+05:30 IST

భారతీయ రిజర్వు బ్యాంక్ గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.

RBI Policy Rates : కీలక రేట్లపై ఆర్బీఐ సంచలన ప్రకటన
Reserve Bank of India

న్యూఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంక్ (Reserve Bank of India-RBI) గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటు 6.5 శాతంను సవరించకుండా కొనసాగించాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనటువంటి అంతర్జాతీయ ఒడుదొడుకుల నేపథ్యంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్లు తెలిపింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) గురువారం మీడియాతో మాట్లాడుతూ, రెపో రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. ద్రవ్యోల్బణంపై పట్టు సాధించేందుకు ఈ కమిటీ సరైన, తగిన చర్యలను కొనసాగిస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా గతంలో కనిపించని ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పటికీ, భారతీయ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ సెక్టర్ ఆ ఒడుదొడుకులను తట్టుకుని, పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌లో చురుగ్గా, సత్వర నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక అవసరాల కోసం తగిన వనరులను అందుబాటులో ఉంచుతామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.2 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసింది, దీనిని ప్రస్తుతం సవరించి 5.1 శాతం ఉంటుందని అంచనా వేసింది.

కరంట్ అకౌంట్ లోటు తీవ్రత తగ్గుతుందని, దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేనేజ్ చేయవచ్చునని అంచనా వేస్తున్నట్లు దాస్ తెలిపారు. జూన్ 2నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 595.1 బిలియన్ డాలర్లు ఉన్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలనే లక్ష్యం దిశగా కృషి జరుగుతోందన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన చర్యలు కోరుకున్న ఫలితాలను ఇస్తున్నాయని, అందువల్ల ఈ సమావేశంలో కీలక రెపో రేటును సవరించకుండా యథాతథంగా కొనసాగించేందుకు అవకాశం కలిగిందని చెప్పారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) రేటు 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 8 శాతం, రెండో త్రైమాసికంలో 6.5 శాతం, మూడో త్రైమాసికంలో 6 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.7 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటుందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పునరుద్ధరణ పథంలో పడిందని తెలిపింది. యావరేజ్ సిస్టమ్ లిక్విడిటీ మిగులులో ఉందని, రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది.

ఇవి కూడా చదవండి :

Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

Updated Date - 2023-06-08T11:42:26+05:30 IST