School Children : బడి ఈడు పిల్లలు.. కోటి!

ABN , First Publish Date - 2022-11-05T06:00:27+05:30 IST

రాష్ట్రంలో బడి ఈడు పిల్లలు కోటి మందికి పైగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. విద్యాశాఖలోని యూడైస్‌ ప్లస్‌ 2021-22 అంచనాలను విడుదల చేసింది.

School Children : బడి ఈడు పిల్లలు.. కోటి!

ప్రాథమిక విద్యార్థులే 37లక్షల మంది

రాష్ట్రంలో టీచర్లు 3.2లక్షల మంది వారిలో మహిళా టీచర్లే ఎక్కువ

12 వేల బడుల్లో క్రీడా మైదానాల్లేవు

యూడైస్‌ ప్లస్‌ నివేదికలో కేంద్రం వెల్లడి

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడి ఈడు పిల్లలు కోటి మందికి పైగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. విద్యాశాఖలోని యూడైస్‌ ప్లస్‌ 2021-22 అంచనాలను విడుదల చేసింది. వాటి ప్రకారం రాష్ట్రంలో 4 నుంచి 17 ఏళ్ల మధ్య అంటే దాదాపుగా బడి ఈడు వయసుండే పిల్లలు 1,07,33,667 మంది ఉన్నారని వెల్లడించింది. 3 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్నవారు 1,69,35,333 ఉన్నట్లు తెలిపింది. అదే బడి తర్వాత కళాశాల విద్యనభ్యసించేవారు అంటే 18 నుంచి 23 ఏళ్ల మధ్య 52,85,000 మంది ఉన్నట్లు పేర్కొంది. కాగా వీరిలో ఆధార్‌ నమోదుచేసుకున్న వారితో పోలిస్తే అంచనాలు అటూఇటుగా మారుతున్నాయి. ప్రీప్రైమరీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వారీగా పిల్లలను వేర్వేరుగా చూస్తే... 3- 5ఏళ్ల మధ్య 25,48,333 మంది, 6-10ఏళ్ల మధ్య 36,65,000 మంది, 11-13 ఏళ్ల మధ్య 22,22,000 మంది, 14-15 ఏళ్ల మధ్య 15,71,000 మంది, 16-17ఏళ్ల మధ్య 16,44,000 మంది ఉన్నట్లు అంచనా వేసింది. వీరిలో ఎస్సీ పిల్లలు... 3-5ఏళ్ల మధ్య 4,68,942 మంది, 6-10ఏళ్ల మధ్య 6,75,828 మంది, 11-13 ఏళ్ల మధ్య 4,21,893 మంది ఉన్నట్లు తెలిపింది. ఎస్టీ పిల్లలు... 3-5ఏళ్ల మధ్య 1,65,994 మంది, 6-10ఏళ్ల మధ్య 2,47,581 మంది, 11-13ఏళ్ల మధ్య 1,39,436 మంది ఉన్నట్లు పేర్కొంది.

3.2లక్షల మంది టీచర్లు

అన్ని యాజమాన్యాలు కలిపి మొత్తం 3,20,724 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వారిలో ప్రాథమిక పాఠశాలల్లో 1,19,133 మంది, ప్రాథమిక, ప్రాథమికోన్నత కలిసున్న పాఠశాలల్లో 27,126 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19,522 మంది, ప్రాథమికోన్నత, ఉన్నత రెండూ కలిసున్న పాఠశాలల్లో 92,993 మంది, ఉన్నత పాఠశాలల్లో 29,998 మంది, హయ్యర్‌ సెకండరీలో 27,434 మంది టీచర్లు ఉన్నట్లు స్పష్టంచేసింది. మొత్తం టీచర్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,91,466 మంది, ఎయిడెడ్‌లో 6146 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1,22,646 మంది ఉన్నట్లు తెలిపింది.

ఇంటర్‌కు టీచర్లు తక్కువ

ఈ నివేదిక ప్రకారం చూస్తే ఇంటర్మీడియట్‌ విద్యలో విద్యార్థులు, టీచర్ల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. 1-5 తరగతుల వరకు ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉంటే, 6-8 తరగతులకు 16 మందికి ఒకరు, 9-10 తరగతులకు 11 మంది విద్యార్థులకు ఒకరు ఉన్నారు. 11, 12 తరగతులకు 32 మంది విద్యార్థులకు ఒకరు బోధిస్తున్నట్లు తెలిపింది. టీచర్లలో మహిళలు 1,62,047 మంది ఉంటే, పురుషులు 1,58,677 మంది ఉన్నారు. అంటే మహిళా టీచర్లే కాస్త అధికంగా ఉన్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

క్రీడా మైదానాలు లేవు

తాజా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో అనేక పాఠశాలలకు క్రీడా మైదానాలు లేవని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్‌ మొత్తం కలిపి 61,948 పాఠశాలలుంటే వాటిలో 49,171 పాఠశాలలకు మాత్రమే మైదానాలున్నాయి. అంటే సుమారు 12వేల పాఠశాలల్లో పిల్లల ఆటలకు అవకాశం లేదు. ఇక కేవలం 3110 పాఠశాలల్లో మాత్రమే డిజిటల్‌ లైబ్రరీలున్నాయి. 3483 పాఠశాలల్లో సోలార్‌ ప్యానెళ్లు అమర్చారు. 34,744 పాఠశాలల్లో ఇంటర్నెట్‌ ఉంది. 61,915 పాఠశాలల్లో తాగునీరు అందుబాటులో ఉంది. అలాగే 1,18,877 పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ బోర్డుతో అఫిలియేషన్‌ పొందితే, 12,050 పాఠశాలలు సీబీఎ్‌సఈ పరిధిలో ఉన్నాయి. 324 పాఠశాలలు రెండు బోర్డులతో అఫిలియేషన్‌ కలిగి ఉన్నాయి.

Updated Date - 2022-11-05T06:00:47+05:30 IST