YCP: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-05T13:25:28+05:30 IST

వైసీపీ విస్తృత స్ధాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

YCP: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

విజయనగరం: వైసీపీ విస్తృత స్ధాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు వైసీపీకి ఓటేయరని మనలో చాలా మంది అనుకుంటున్నారని, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కేవలం 15 శాతం మాత్రమేనని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju), తాను పోటీ చేస్తే అశోక్ గెలుస్తారని చాలా మంది అంటున్నారని, మరి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అశోక్ ప్రచారం చేసినపుడు టీడీపీ ఎందుకు ఓడిపోయిందో ఆలోచించాలని ఆసక్తికరంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అశోక్ రోడ్డు మీదకొస్తే ఎన్నికలొచ్చినట్టు తెలుస్తుందన్నారు. తాను జనంలోకి వెళ్తే సంక్షేమ పనులు గుర్తొస్తాయని వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా... ఈనెల 13వ తేదీన జరుగునున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి బలపరిచిన సీతం రాజు సుధాకర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని పట్టభద్రులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. ఈ మేరకు శనివారం నగరంలోని కమ్మ వీధి, శివాలయం వీధి తదితర ప్రాంతాలలో పట్టభద్రులను కలిసి సీతం రాజు సుధాకర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఇళ్లకు స్వయంగా వెళ్లి సీతం రాజు సుధాకర్ ని గెలిపించాల్సిన ఆవశ్యకత, వైసిపి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్చార్జ్ లు గుజ్జల నారాయణరావు, అల్లు చాణక్య మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సీతంరాజు సుధాకర్ ను గెలిపించడం ఎంతో అవసరం అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వైసీపీ చేస్తున్న కృషి గమనించాలన్నారు. పారిశ్రామికపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. దీని ఫలితంగానే ఇండస్ట్రియల్ సమ్మెట్ లో 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానుండడం సంతోషదాయకమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు ఆకర్షితులుగా ఉన్నారని, ఈ సందర్భంలో పట్టభద్రులు కూడా మద్దతుగా నిలిచి సీతం రాజు సుధాకర్ ను గెలిపించాలని కోరారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వారదిగా నిలిచారని అన్నారు

పార్కుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ఇంటింటికి కులాయి కనెక్షన్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మీసాల రమాదేవి,వైసిపి నాయకులు ఎవర్న కుమారస్వామి, వెంపడాపు శ్రీనివాసరావు, దేసెట్టి మోహన్,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T13:37:50+05:30 IST