Viveka Case Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ.. మూసుకుపోయిన దారులు..

ABN , First Publish Date - 2023-03-17T11:17:23+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్‌ చేయకుండా..

Viveka Case Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ.. మూసుకుపోయిన దారులు..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో అవినాష్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. అరెస్ట్‌ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

విచారణ ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచుతూ.. తమ్ముడు, ఆత్మీయుడైన ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పటికీ... వాటిని పక్కనపెట్టి మరీ ఢిల్లీకి ఫ్లైటు ఎక్కారు. గురువారం ఉదయం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా... సాయంత్రానికి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఖరారు కావాల్సి ఉంది. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ బాగా దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారాక సీబీఐ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పైనా దృష్టి సారించింది. తండ్రీకొడుకులిద్దరినీ కలిపి ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కీలక నిందితులని, అరెస్టు చేయడం ఖాయమని సీబీఐ తెలంగాణ హైకోర్టుకే స్పష్టం చేసింది. నిజానికి... హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఈనెల 10వ తేదీనే అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసేది. అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌పై తీర్పు వెలువడేదాకా ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. కానీ.. తాజాగా అరెస్ట్‌ చేయొద్దని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ దాదాపు ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది.

Updated Date - 2023-03-17T11:17:31+05:30 IST