జగన్.. బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి ఓట్లేయించుకున్నారు: అనిత
ABN , First Publish Date - 2023-07-21T14:13:28+05:30 IST
అమరావతి: తెలుగు మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ నిరసన దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ బుగ్గలు నిమిరి..
అమరావతి: తెలుగు మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ నిరసన దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ బుగ్గలు నిమిరి.. ముద్దులు పెట్టి ఓట్లేయించుకున్నారని, ఓట్లేయించుకున్న జగన్ మహిళ ద్రోహి అని ఆరోపించారు. ఏపీలో మహిళలంతా బాధతో ఉన్నారని, వైసీపీ (YCP)లో ఉన్న మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారన్నారు. పదవి పోయిన తర్వాత కూడా ఇంకా తన పదవి ఉందనే భ్రమలో ఉన్న వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) కూడా సంతోషంగానే ఉన్నారన్నారు. అమరావతి నిర్మాణం గురించి అడిగితే అమరావతి మహిళల కట్టు బొట్టు గురించి మాట్లాడతారని మండిపడ్డారు.
మణిపూర్ (Manipur) మహిళల కంటే దారుణమైన పరిస్థితిని ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నిస్తే.. ఆయన భార్య గురించి జగన్ మాట్లాడతారని అనిత దుయ్యబట్టారు. తల్లుల పెంపకం బాగాలేదని ఓ మంత్రి.. ఒకటి రెండు రేపులకే ఇంత గొడవ అని మహిళా మంత్రులే మాట్లాడ్డడం విచారకరమన్నారు. వాలంటీర్లు మహిళలను వేధిస్తున్నారని సుమారు 500 కేసులు నమోదయ్యాయని, అయ్యన్న (Ayyanna) వంటి వాళ్లపై రేప్ కేసులు (Rape Cases) పెడతారట.. వలంటీర్లపై కేసులు పెట్టరట అంటూ మండిపడ్డారు.
పెన్షన్ తీసుకునే వాళ్లు వృద్ధులే కాదు.. ఒంటరి మహిళలు కూడా ఉన్నారని, అమ్మ అనే పదం కూడా జగన్ ప్రభుత్వంలో బూతుగా మారిందని అనిత అన్నారు. ఫిర్యాదులు చేసే కాలం పోయిందని.. ట్రోల్ చేసే వాళ్ల ఇళ్లకెళ్లి చెప్పులు చూపించే రోజులు వచ్చాయన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగడం లేదన్నారు. ఎవడైనా తప్పుడు పోస్టులు పెడితే ఇంటికెళ్లి తంతామని హెచ్చరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. ట్రోలింగులకు ఏడుస్తూ పోస్టులు పెట్టొద్దు.. ఏడిపించే రీతిలో పోరాడాలి. ప్రతి శుక్రవారం ఆత్మగౌరవ దినోత్సవం అంటూ వాసిరెడ్డి పద్మ కార్యక్రమాలు చేపడుతున్నారని, తాము కూడా శుక్రవారమే ఆత్మ గౌరవ నిరసన దీక్ష చేపడుతున్నామని అనిత పేర్కొన్నారు.