Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

ABN , First Publish Date - 2023-08-26T14:31:05+05:30 IST

యువగళం పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Yuvagalam: రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్

ఉమ్మడి కృష్ణా జిల్లా: యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) భాగంగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్తులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని.. చిన్న వర్షానికే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తికాక సాగునీరు అందడం లేదన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి లేదని..తమ శాసనసభ్యుడు అవినీతి ఎక్కువ అయ్యిందన్నారు. సంక్షేమం కార్యక్రమాల్లో కులం, మతం చూడను అని జగన్ అన్నారని... కానీ ఇప్పుడు కులం, మతం, పార్టీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసారన్నారు. గ్రామంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. శాసనసభ్యుడు కనీసం గ్రామానికి రారని.. తమ సమస్యలు పట్టించుకోరని వాపోయారు. ఆటో నడుపుకునే వారికి రూ.10 వేలు ఇస్తాను అని ఇన్స్యూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఛార్జీలు, ఫైన్లు విపరీతంగా పెంచి మమ్మల్ని జగన్ దోచుకుంటున్నారని లోకేశ్ ముందుకు ముసునూరు గ్రామస్తులు వాపోయారు.


ఏపీని చూసి నవ్వుతున్నారు...

లోకేష్ మాట్లాడుతూ.. ‘‘జగన్ తనది బటన్ ప్రభుత్వం అని పదే పదే చెబుతున్నాడు. ఇప్పుడు బటన్‌‌కి పవర్ పోయింది. అభివృద్ది చేసి సంక్షేమం చెయ్యాలి. జగన్ అప్పు చేసి సంక్షేమం చేస్తున్నాడు. ఇప్పుడు అప్పు ఇచ్చే వాడు లేక బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదు. జగన్ ప్రజలపై భారం వేసి సంక్షేమం అంటున్నాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాడు. జగన్ ది బటన్ ప్రభుత్వం కాదు బఫూన్ ప్రభుత్వం. దేశం మొత్తం ఏపీ వైపు చూసి నవ్వుతున్నారు. రాజధాని లేని రాష్ట్రం ఏది? పవర్ లేని రాష్ట్రం ఏది? క్రాప్ హాలిడే ఉన్న రాష్ట్రం ఏది? ఆక్వా హాలిడే ఉన్న రాష్ట్రం ఏది?. జగన్ ఏపీ పరువు తీశాడు. టీడీపీ ది సైకిల్ పాలన. సైకిల్‌కు రెండు చక్రాలు వెనక చక్రం అభివృద్ది, ముందు చక్రం సంక్షేమం. అభివృద్ధితో వచ్చిన ఆదాయంతో రూ.200 పెన్షన్ రూ.2000 వేలు చేశాం. చంద్రన్న భీమా, పెళ్లి కానుక, పండుగ కానుకలు ఇచ్చాం. టీడీపీ హయాంలో కరెంట్ ఛార్జీలు, పన్నులు, ఆర్టీసి ఛార్జీలు పెంచలేదు. జగన్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేశాడు. పంచాయతీ డబ్బులు కాజేసాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచు ల గౌరవం నిలబెడతాం. ముసునూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కొత్త రోడ్లు వేస్తాం. చింతలపూడి ప్రాజెక్టు రెండేళ్లలోనే పూర్తి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే కంటే ఆయన అబ్బాయి కేటు గాడు. భూకబ్జాలు, ఇసుక దోపిడి, గ్రావెల్ దోపిడికి నూజివీడుని కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూజివీడులో జరిగిన భూకబ్జాలు ఇతర అరాచకాలపై సిట్ వేసి అవినీతి బయటపెడతాం’’ అని యువనేత హెచ్చరించారు.


ఆనాడు మేము అలా చేయలేదు.. కానీ ఇప్పుడు...

లోకేశ్‌ ఇంకా మాట్లాడుతూ... ‘‘నేను జగన్‌లా ముఖ్యమంత్రిని కాల్చాలి, చెప్పుతో కొట్టాలి, రోడ్డు మీద కల్చేయాలి అని రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. మా తల్లిని అవమానించారు, పార్టీ కార్యాలయంపై దాడి చేశారు, మా ఇంటిపై దాడి చేశారు. అప్పుడు పోలీసులకు రెచ్చగొట్టే చర్యలు లా కనపడలేదు. నేను జగన్ చేసే సైకో పనులు చూసి సైకో అనడం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమి చెయ్యలేదు. జగన్ అన్నం తినడు... ఇసుక తింటాడు. రోజుకి ఇసుకలో మూడు కోట్లు తింటున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్, ఐరెన్ ధరలు తగ్గిస్తాం. జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ రెచ్చగొట్టలేదు. ఆ దారిలో ఫ్లెక్సీలు కట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యలేదు, కార్యకర్తలు వెళ్లి అడ్డుకోలేదు. కేసులు పెట్టలేదు. లోకే‌శ్‌ను చూస్తే జగన్‌కు ప్యాంటు తడుస్తుంది. అందుకే పాదయాత్ర అడ్డుకుంటున్నాడు. నా పై కేసులు పెడుతున్నాడు. జగన్ పేదలకు ఉచితంగా ఇళ్లు కడతా అన్నాడు. ఇప్పుడు మీరే కట్టుకోండి అని చేతులు ఎత్తేసాడు. పేదలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది జగన్ కోరిక. 7 లక్షలు అప్పు చేస్తే కానీ పేదలు సెంటు స్థలం లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. నూజివీడులో టీడీపీ జెండా ఎగరేయండి. అభివృద్ధి బాధ్యత నాది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500. తల్లికి వందనం కింద పిల్లల చదువుకి రూ.15,000. ఇద్దరు పిల్లలు ఉంటే 30 వేలు. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌కు టీడీపీ హయాంలో 700 పరిశ్రమల ను తీసుకొస్తే సైకో పాలన చూసి ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. ఆటో డ్రైవర్లను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇన్స్యూరెన్స్ ధరలు తగ్గేలా చేస్తాం. జగన్ పెంచిన పన్నులు తగ్గిస్తాం. వేధింపులు లేకుండా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’’ అంటూ లోకేశ్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-26T14:31:05+05:30 IST