Chandrababu: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై చంద్రబాబు ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-08-25T20:02:30+05:30 IST

తెలుగు పరిశ్రమలో 58 ఏళ్ల తర్వాత తొలిసారి మన హీరో అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చిందని.. ఇది అందరూ గర్వించదగ్గ విషయమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అటు ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆరు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వైసీపీ ప్రభుత్వం అవమానపరిచిందని.. ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంపై చంద్రబాబు ఏమన్నారంటే..?

జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న టాలీవుడ్ యువ హీరో అల్లు అర్జున్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు బన్నీకి నేరుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డుపై రావడంపై స్పందించారు. శుక్రవారం నాడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో వైసీపీ అక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గర్వించేస్థాయికి చేరుకుందని ప్రశంసలు కురిపించారు. ఈ విషయంపై తెలుగు వ్యక్తిగా తాను ఎంతో ఆనందిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు పరిశ్రమలో 58 ఏళ్ల తర్వాత తొలిసారి మన హీరో అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డు వచ్చిందని.. ఇది అందరూ గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. అటు ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆరు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయని.. ఇలాంటి వాళ్లను వైసీపీ ప్రభుత్వం అవమానపరిచిందని.. ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే వాళ్లపై దాడులు చేయడం, అవమానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu: జగన్ ప్రజలను ఎంతగా నమ్మించే ప్రయత్నం చేసినా టీడీపీ వైపే ప్రజలు

మరోవైపు గత నాలుగేళ్లుగా వైసీపీ సర్కారు పాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై మీడియాకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2022 నుంచి వైసీపీ నేతలు ఇసుక దందా చేస్తున్నారని.. విచ్చలవిడిగా ఇసుక తోడేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌లలో ఒక మీటర్ కంటే ఎక్కువ తవ్వకూడదని.. కానీ వైసీపీ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు కొన్ని కోట్ల రూపాయలను ఇసుక దందా ద్వారా దోచుకుతింటున్నారని విమర్శలు చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. అనధికారికంగా 500 రీచ్‌లలో ఇసుకను తవ్వేసి వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాను ప్రశ్నించేవారిని కేసులతో వేధిస్తున్నారని.. వాళ్ల ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-25T20:07:13+05:30 IST