Supreme Court: జీవో నెంబర్ 1పై సుప్రీం కీలక ఆదేశాలు.. ఏబీఎన్‌ చేతిలో ఆర్డర్ కాపీ

ABN , First Publish Date - 2023-04-26T11:12:57+05:30 IST

జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Supreme Court: జీవో నెంబర్ 1పై సుప్రీం కీలక ఆదేశాలు.. ఏబీఎన్‌ చేతిలో ఆర్డర్ కాపీ

అమరావతి: జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఆర్డర్ రూపంలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆర్డర్‌ కాపీ ఏబీఎన్- ఆంధ్రజ్యోతి చేతిలో ఉంది. ఏపీలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Government) జారీ చేసిన జీవో నెంబర్ 1పై ఉన్న స్టే పై ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలంటూ హైకోర్టును కోరాలని సుప్రీం కోర్టు సూచించింది. తుది తీర్పు వచ్చే వరకు జీవో నెంబర్ 1పై న్యాయస్థానం స్టే ఇచ్చింది. వెకేషన్‌ బెంచ్ నుంచి మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు మౌఖికంగా చెప్పినా లిఖితపూర్వకంగా డివిజన్ బెంచ్ చెప్పకపోవడాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది. అందుకే తుది తీర్పు వచ్చేంత వరకు జీవో నెంబర్ -1పై స్టే విధిస్తూ వెకేషన్‌ బెంచ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేలా డివిజన్ బెంచ్‌‌ను కోరమని పిటిషనర్ కొల్లు రవీంద్రకు సూచించింది. తమ ఆర్డర్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్‌కు చూపించాలని సీజేఐ ధర్మాసనం చెప్పింది. త్వరగా విచారణ ముగించి తీర్పునివ్వాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది.

జనవరి 12న జీవో నెం 1పై స్టే ఇస్తూ వెకేషన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. దానిపై డివిజన్ బెంచ్ విచారించింది. వెకేషన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నట్లు డివిజన్ బెంచ్ మౌఖికంగా చెప్పినా లిఖిత పూర్వకంగా చెప్పని అంశాన్ని సుప్రీం గుర్తించి.. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ జనవరి 24న విచారణ ముగించి తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం విచారణను త్వరగా ముగించాలని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు మరోసారి వినతి చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాదులకు సూచించారు. తుది తీర్పు వచ్చే వరకు జీవోనెంబర్ 1పై ఉన్న స్టే కొనసాగేలా ఆదేశం ఇవ్వాలని హైకోర్టును కోరాలని, తమ ఆర్డర్‌ కాపీని డివిజన్ బెంచ్‌కు చూపించాలని ఆర్డర్‌ కాపీలో స్పష్టం చేసింది.

Updated Date - 2023-04-26T11:18:07+05:30 IST