Nellore: కోటంరెడ్డి పార్టీ మార్పుపై కాకాని, బాలినేని కీలక భేటీ..

ABN , First Publish Date - 2023-02-01T13:06:41+05:30 IST

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, పార్టీ పరిస్థితిపై నెల్లూరులోని ఓ హోటల్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు సాగించారు.

Nellore: కోటంరెడ్డి పార్టీ మార్పుపై కాకాని, బాలినేని కీలక భేటీ..

నెల్లూరు: వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై.. పార్టీ పరిస్థితిపై నెల్లూరులోని ఓ హోటల్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy), మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) సుదీర్ఘ మంతనాలు సాగించారు. అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ తాము నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజక వర్గాల గురించి మాట్లాడుకునేందుకు జరిపిన సాధారణ సమావేశమే తప్ప ఎలాంటి ప్రాధాన్యం లేదని తెలిపారు. ఎవరెన్ని ఆలోచనలు చేసినా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంటుందన్నారు. తామందరి ఆలోచన పార్టీని బలోపేతం చేయడమేనని.. అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకున్నామని మంత్రి కాకాణి అన్నారు.

నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల గురించి మాట్లాడుకున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేత చేయాలని అందరి ఆలోచనని చెప్పారు. ఎవరు ఎన్నిరకాలు ఆలోచనలు చేసినా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా గతంలో ఏ విధంగా బలంగా ఉందో.. భవిష్యత్తులో కూడా అదే బలంగా ఉంటుందన్నారు. ప్రజలు కూడా జగన్ (Jagan) పరిపాలన పట్ల మొగ్గు చూపుతున్నారని.. ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య వారధిలా ప్రజాప్రతినిధులు ఉంటారని... దీనికి సంబంధించి ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిపై చర్చించి పరిష్కరిస్తామని, అంతిమంగా పార్టీ నిర్ణయానికి, బలోపేతానికి కట్టుబడి పనిచేయడం జరుగుతుందని మంత్రి కాకాణి స్పష్టం చేశారు.

కాగా నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టారు. వైఎస్సార్ (YSR), జగన్‌ (Jagan)కు తనెప్పుడూ విధేయుడిగానే ఉన్నానని చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని, అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలను భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి (IPS Officer) చెప్పారన్నారు. ముందు తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదన్నారు. సీఎం జగన్‌పై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించానన్నారు. 20 రోజుల ముందు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికిందన్నారు. సీఎం గానీ, సజ్జల గానీ చెప్పకుండా తన ఫోన్ ట్యాప్ చేయరని అన్నారు. అనుమానాలు ఉన్న చోట తానుండాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నానని తన ఫోన్ ట్యాంపింగ్ చేశారన్నారు.

తన ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి మనస్తాపం చెందానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడితే.. కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇద్దరు ఐపీఎస్‌లకు ఇబ్బందికర పరిస్థితి వస్తుందన్నారు. 15 నెలల తర్వాత ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో ఎవరికీ తెలియదని, నాయకుడే నమ్మకపోతే ఇక తాను పార్టీలో ఎందుకుండాలన్నారు. కనీసం సంజాయిషీ కూడా అడగరా? అని ప్రశ్నించారు. తన రాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

నిన్న బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారని, పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లొచ్చని బాలినేని చేసిన వ్యాఖ్యలపై కోటంరెడ్డి మండిపడ్డారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నానని అన్నారు. ‘‘అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల (Sajjala), విజయసాయిరెడ్డి (Vijayasaireddy), ధనుంజయ్‌రెడ్డి (Dhanunjayareddy)ల ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది?.. మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా?’’ అంటూ కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం తన బాల్య మిత్రుడితో ఐ ఫోన్‌లో మాట్లాడానని కోటంరెడ్డి తెలిపారు. తన స్నేహితుడితో మాట్లాడిన విషయాలపై ఇంటెలిజెన్స్ చీఫ్‌ అడిగారని, ఐబీ చీఫ్‌ సీతారామాంజనేయులు తనకు ఆడియో పంపారన్నారు. ట్యాపింగ్‌ జరిగిందనడానికి ఇంతకుమించిన ఆధారాలు ఇంకేం కావాలని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఆడియో క్లిప్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ‘98499 66000’ ఈ నెంబర్ నుంచి తనకు ఆడియో క్లిప్ వచ్చిందని, ఇక తన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-02-01T13:06:45+05:30 IST