Share News

CM Jagan: మిచాంగ్ తుపాన్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2023-12-03T22:30:27+05:30 IST

మిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) మరోమారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

CM Jagan:  మిచాంగ్ తుపాన్‌పై అధికారులతో సీఎం జగన్  సమీక్ష

అమరావతి: మిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) మరోమారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పగడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుపాను వల్ల విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మరోమారు సమీక్ష చేయనున్నారు. పొలాల్లో, కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రత కలిగిన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్‌ చేసి, ఆ ధాన్యాన్ని భద్రమైన ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. దీనిపై పురోగతిని వెంటనే తనకు తెలియజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో భారీవర్షాలు కారణంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-12-03T22:30:31+05:30 IST