Nara Lokesh: మంత్రి రోజాకు నారా లోకేష్ కౌంట‌ర్

ABN , First Publish Date - 2023-02-15T18:15:47+05:30 IST

వైసీపీ (YCP) ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా (Minister Roja)కు టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు.

Nara Lokesh: మంత్రి రోజాకు నారా లోకేష్ కౌంట‌ర్

వెంకటరెడ్డి కండ్రిగ, తిరుపతి జిల్లా: వైసీపీ (YCP) ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా (Minister Roja)కు టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా అవినీతిని ప్ర‌శ్నిస్తే.. మ‌హిళ‌ల్ని కించ‌ప‌రిచిన‌ట్ట‌.. తన ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని రోజా వార్నింగ్‌లు ఇస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌ళ్లు రాల‌గొట్టాల్సి వ‌స్తే ముందుగా జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్టాలని రోజాకు లోకేష్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా బుధ‌వారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రోజూ తనకు చీర‌-గాజులు పంపుతాన‌ని ప్ర‌క‌టించే రోజాకు తెలుగు మ‌హిళ‌లు సారె పెట్టేందుకు వెళ్తే వారిని అరెస్టు చేయించింద‌ని లోకేష్ మండిపడ్డారు. సాటి మ‌హిళ‌ల్ని అత్యంత దారుణంగా కొట్టించి, అరెస్ట్ చేయించిన రోజా మ‌హిళ‌ల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేట‌న్నారు.

తన ప‌ళ్లు రాల‌గొడ‌తానంటోన్న రోజా.. చంద్ర‌బాబును న‌డివీధిలో కొట్టాలి, కాల్చాలంటూ జ‌గ‌న్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన‌ప్పుడు జ‌గ‌న్‌ ప‌ళ్లు రాల‌గొట్టాల్సింద‌ని లోకేష్ మంత్రి రోజాకు చురకలంటించారు. తన త‌ల్లిని అసెంబ్లీలో అవ‌మానించిన‌ప్పుడు ఏమైంది ఈ రోజా?, అప్పుడు జ‌గ‌న్ రెడ్డి ప‌ళ్లు రాల‌గొట్ట‌లేదు ఎందుకు అని రోజాను లోకేష్ నిల‌దీశారు.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పైనా స్పందిస్తూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు చంద్రబాబుపై 16 హౌస్‌ క‌మిటీలు, 8 సీఐడీ కేసులు పెట్టారని, ఒక్క‌టీ నిరూపించ‌లేక‌పోయార‌ని, రాజ‌శేఖ‌ర్ రెడ్డి, వైసీపీలో ఉన్న‌ ల‌క్ష్మీపార్వ‌తి కూడా తమపై సుప్రీంకోర్టులో వేసిన‌ కేసుల్లో క‌నీసం ఆధారాలు కూడా చూప‌లేకపోవ‌డంతో కేసుల‌ను కోర్టు కొట్టేసింద‌ని లోకేష్ తెలిపారు. ఇదీ తమ చిత్త శుద్ధి అని లోకేష్ అన్నారు. తాము తమ ఆస్తులు ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నామని, మీ వైసీపీలో మీరు, మీ 150 మంది దొంగ‌లు కూడా ఆస్తులు ప్ర‌క‌టించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

..........................................................................................................

తలసాని కీలక వ్యాఖ్యలు.. జగన్ చేసిన..

..................................................................................................

కల్లు రుచి చూసిన షర్మిల.. వీడియో వైరల్

Updated Date - 2023-02-15T18:51:38+05:30 IST