Avinash Reddy : సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి

ABN , First Publish Date - 2023-04-19T10:39:32+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న విషయం తెలిసిందే.

Avinash Reddy : సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న విషయం తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున అనుచర గణంతో అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకోగా.. పోలీసులు అనుచరులను లోపలికి అనుమతించలేదు. గేటు వద్దే వాహనాలను నిలిపివేశారు.

కాగా.. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని నిన్న తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. హోరాహోరీ వాదనల అనంతరం మంగళవారం జస్టిస్‌ సురేందర్‌ ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ‘‘25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాశ్‌ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి’’ అని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

బెయిల్‌ ఇవ్వొద్దు: సీబీఐ

అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న పిటిషనర్‌ ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్‌ చేయకుండా విచారించి దర్యాప్తు ముగించాలని.. ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది చెప్తున్నారు. దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని నిర్దేశించడానికి ఆయన ఎవరు? ఇంకా దర్యాప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉంది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడ ఉందో తెలియదు. ఏ-2 సునీల్‌ యాదవ్‌ హత్య తర్వాత గొడ్డలిని తీసుకుని అవినాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లాడు’’ అని తెలిపారు. ఏ-4 దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందన్నారు. దీనిపై అవినాశ్‌ రెడ్డికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ‘‘హత్య జరిగిన సమయంలో నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారో గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించాం. దీనిని ఫోరెన్సిక్‌ కూడా ధ్రువీకరించింది’’ అని స్పష్టం చేశారు. అవినాశ్‌ రెడ్డికి వివేకానందరెడ్డితో రాజకీయ శత్రుత్వం ఉందని... హత్య వెనుక అసలు ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ దశలో ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

Updated Date - 2023-04-19T10:39:32+05:30 IST