Viveka Case: వీడియోగ్రఫీ అవసరం లేదన్న తెలంగాణ హైకోర్టు.. తీర్పు రిజర్వ్
ABN , First Publish Date - 2023-03-13T14:33:57+05:30 IST
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadap MP Avinash Reddy) రిట్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు (Telangana High Court) లో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో వీడియోగ్రఫీ అవసరం లేదని హైకోర్టు పేర్కొంటూ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. మొత్తం 35 సాక్షుల స్టేట్‌మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్, ఎఫ్‌ఎస్ఎల్ నివేదికను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. 160 సీర్పీసీలో విచారించబడుతున్నారని... కోర్టు ద్వారా విచారణకు రాలేదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చారని సీబీఐ వెల్లడించింది. సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవినాష్ తరపు న్యాయవాది వానదలు...
సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. సునిత అభియోగాల వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. వివేక హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తరువాత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్రపై సీబీఐ విచారణ చేయడం లేదని తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు జరగాలని అవినాష్ తరుపు న్యాయవాది కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. కేసును హైకోర్టు రిజర్వ్ చేసింది.
మేము జోక్యం చేసుకోలేం...
అయితే పార్లమెంటు సెషన్ ఉందని, అవినాష్ సీబీఐ అధికారులు విచారణ జరపకుండా చూడాలని అవినాష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ‘‘మీరే పిటిషన్ వేస్తారు.. మీరే పార్లమెంట్ ఉందని చెప్తారు.. ఆర్డర్ రేపే ఇవ్వవొచ్చేమో’’ అంటూ హైకోర్టు తెలిపింది. రేపు విచారణకు పిలవకూడదు అనుకుంటే సీబీఐ అనుమతి తీసుకోవాలని తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.