AP News: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆచూకీ లేని ఏఆర్ కానిస్టేబుల్

ABN , First Publish Date - 2023-02-03T11:29:28+05:30 IST

పోలీసుగా విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు ఆచూకీ మిస్ అయ్యింది.

AP News: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఆచూకీ లేని ఏఆర్ కానిస్టేబుల్

విజయవాడ: పోలీసుగా విధులు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ (AP CM JaganMohanReddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు (AR Constable Tanniru Venkateswara Rao) ఆచూకీ మిస్ అయ్యింది. వెంకటేశ్వరరావు చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు గాను ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో తన్నీరు వెంకటేశ్వరావు (AR Constable)పై కేసు నమోదు చేశారని సమాచారం. అయితే ఇప్పటి వరకు కుటుంబసభ్యులు ఎలాంటి సమాచారం లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు. వెంకటేశ్వరావు వ్యాఖ్యలు ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

అసలేం జరిగిందంటే... నందిగామ చిల్లకల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో హైవే పెట్రోలింగ్‌ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా వెంకటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గౌరవరం గ్రామంలో టీ తాగేందుకు ఓ టీస్టాల్ దగ్గర ఆగిన సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకటేశ్వరరావును బాగున్నారా అంటూ పలకరించిన సదరు వ్యక్తి జీతాలపై ప్రశ్నించారు. సీఎం జగన్ జీతాలు ఇస్తున్నారా అంటూ అడిగారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండబూతులు తిట్టారు. వెంకటేశ్వరరావు తిట్ల పురాణాన్ని సదరు టీస్టాల్ వ్యక్తి రికార్డు చేసి మరీ పోలీస్ ఉన్నతాధికారులకు పంపించాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వరరావును రెచ్చగొట్టారని... ఆయన నిజాయితీ గల పోలీసంటూ పోలీస్ వర్గాల్లో చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది.

Updated Date - 2023-02-03T11:29:29+05:30 IST