Share News

Vijayawada: వైద్యం వ్యాపారం కాదు.. ఒక సేవా కార్యక్రమం: వెంకయ్య

ABN , First Publish Date - 2023-11-19T11:27:25+05:30 IST

విజయవాడ: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపారం కాదని.. ఒక సేవా కార్యక్రమమని.. కానీ నేడు రాజకీయం, విద్య, వైద్య రంగాల్లో సేవా భావం తగ్గిందని అన్నారు.

Vijayawada: వైద్యం వ్యాపారం కాదు.. ఒక సేవా కార్యక్రమం: వెంకయ్య

విజయవాడ: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆదివారం విజయవాడలో ఓ ప్రైవేటు ఆస్పత్రి (Private Hospital)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపారం కాదని.. ఒక సేవా కార్యక్రమమని.. కానీ నేడు రాజకీయం, విద్య, వైద్య రంగాల్లో సేవా భావం తగ్గిందని, వాటిలొ ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల కోసం అంకిత భావంతో వైద్యులు పని చేయాలని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని, వైద్య వృత్తి సామాజిక బాధ్యతతో కూడుకున్నదని అన్నారు.

డాక్టర్‌ని దేవుడిగా కొలుస్తారని... వారి మాట వేద వాక్కుగా చూస్తారని, అందువల్ల నిజాయితీగా పని చేసి, రోగి త్వరగా కోలుకుని ఇంటికి పంపేలా చూడాలని వెంకయ్య సూచించారు. రోగులతో ఎంతో సహనంగా, స్నేహ భావంతో వైద్యులు మెలగాలని, వైద్యులు అవసరం లేకున్నా టెస్టులు, స్కానింగ్‌లు రాస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రేమగా, మంచిగా మాట్లాడితే రోగులకు సగం జబ్బు తగ్గిపోతుందన్నారు. పాశ్చాత్య ధోరణితో రోగాలు కొని తెచ్చుకుంటున్నామని అన్నారు.

ఇంట్లో భోజనం లేదు, నిద్ర లేదు.. సెల్ ఫొన్‌ను హెల్ ఫోన్‌గా మార్చారని, అర్ధరాత్రి యువత ఫోన్‌లకు అలవాటు పడ్డారని వెంకయ్య అన్నారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలలోపు లేచి వ్యాయామం చేయాలని, ఆధ్యాత్మిక భావనలో కాసేపు ఉండటం నేర్చుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, మిల్లెట్స్‌ని తినడం అలవాటు చేసుకుంటే మంచి శక్తిని ఇస్తాయన్నారు. చిరు ధాన్యాలతో భోజనం చేయాలని, శారీరక శ్రమ లేకపోతే తప్పకుండా జబ్బులు వస్తాయన్నారు. మన జీవన శైలి మార్చుకుంటే అనారోగ్యం దరి చేరదని, వైద్యులు కూడా నష్టపోకుండా, అదే విధంగా లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు అందించాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-19T11:27:28+05:30 IST