TDP Leader: పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందన్న అచ్చెన్న

ABN , First Publish Date - 2023-03-14T10:22:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని...

TDP Leader: పొత్తులపై సరైన సమయంలో సరైన  నిర్ణయం ఉంటుందన్న అచ్చెన్న

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Government) గద్దె దించాలనే దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కూడా ఉన్నారని... ఇందుకు ప్రజా స్వామ్యవాదులంతా ఏకం కావాలని టీడీపీ (TDP) - జనసేన (Janasena)లు పిలుపునిస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchennaidu)అన్నారు. మంగళవారం ఉదయం వెంకటపాలెంలోని రెండు ఎన్టీఆర్ విగ్రహాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... పొత్తులపై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని తెలిపారు. చివరి బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రభుత్వం, స్పీకర్ తీరు మారి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల (AP Assembly) ను వైసీపీ నాయకులు వారి ఇష్టం వచ్చినట్టు తయారుచేశారని మండిపడ్డారు. గతంలో శాసనసభ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా చూశారని... గడిచిన నాలుగేళ్లుగా శాసనసభ నిర్వహణ చూస్తే తమకెంతో బాధేస్తుందన్నారు. కనీసం ప్రతిపక్షాలు శాసనసభలో ఉన్నారని గుర్తించరని, మాట్లాడనివ్వరని, మైక్ ఇవ్వరని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత మీడియాను పెట్టుకుని తమకు నచ్చిన కంటెంట్‌ని బయటకి ఇస్తారని ఆరోపించారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో అయినా వారిలో మార్పు వచ్చి సజావుగా చర్చ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో 17 సమస్యలపై ప్రజలు బాధపడుతున్నారు వీటిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ అభ్యర్థిని పోటీలో పెట్టామన్నారు. రాజకీయాల్లో పొత్తులనేది సర్వసాధారణమని తెలిపారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల మీదే పోరాడుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief) చర్చించి.. ప్రకటన చేస్తారని వెల్లడించారు. టీడీపీ 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి బీసీ మహిళను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపినట్లు చెప్పారు. తెలుగుదేశానికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారని సాక్షాత్తూ స్పీకర్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారన్నారు. సైకిల్ గుర్తుపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలవడం ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-14T10:56:18+05:30 IST