Lokesh: సీఎం జగన్‌కు లోకేష్ సవాల్.. ఏ విషయంలో అంటే..

ABN , First Publish Date - 2023-03-27T13:22:04+05:30 IST

పీలేరు భూఅక్ర‌మాల‌పై సీఐడీ లేదా సీబీఐ ద‌ర్యాప్తు జ‌ర‌పాలని టీడీపీ యువనేత నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Lokesh:  సీఎం జగన్‌కు లోకేష్ సవాల్.. ఏ విషయంలో అంటే..

అమరావతి: పీలేరు భూఅక్ర‌మాల‌ (Peeleru land illegal)పై సీఐడీ (CID) లేదా సీబీఐ (CBI) ద‌ర్యాప్తు జ‌ర‌పాలని టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy)కి లోకేష్ లేఖ రాశారు. పీలేరులో భూ అక్రమాలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దమ్ముంటే సీఐడీ లేదా సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. భూ ఆక్రమణలు నిర్ధారిస్తూ గతంలో కలెక్టర్ రూపొందించిన నివేదికను తన లేఖకు జత చేశారు. పీలేరు ఎమ్మెల్యే శాసనసభలో కోరినట్లు విచారణ జరిపించే దమ్ముందా అంటూ లోకేష్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో భూమాఫియాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ భూమాఫియా ఏ అవకాశమూ వదలకుండా దోచుకుంటోందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం భూ మాఫియాపై చర్యలు తీసుకోకపోగా సహకరిస్తుండటం విస్మయం కలిగిస్తోందన్నారు. ఒక్క పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే 601.37 ఎకరాల భూమిని ఈ భూమాఫియా దోచుకుందని ఆరోపించారు. తెలుగుదేశం పోరాటంతో చిత్తూరు కలెక్టర్‌ పీలేరులోని డీకేటీ భూములు, ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాపై 2021లోనే విచారణ చేయించారని తెలిపారు. మొత్తం 601.37 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ సవివర నివేదిక సమర్పించారన్నారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ తన నివేదికలో సిఫార్సు కూడా చేశారని అన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాఫియా పట్ల ఉదాసీనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో భూ కబ్జాకు పాల్పడిన ల్యాండ్ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని యువనేత డిమాండ్ చేశారు.

అధికార వైసీపీ నేతలకు భూ మాఫియాతో ప్రమేయం ఉన్నందుకే చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయన్నారు. పీలేరులోని భూ కుంభకోణంపై సీఐడీ లేదా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీకి చెందిన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Pileru MLA Chintala Ramachandra reddy) గ‌తంలో శాసనసభలో కోరారని గుర్తుచేశారు. పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన భూ కుంభకోణంపై సీఐడీ లేదా సీబీఐ విచారణను ఏర్పాటు చేయడంలో వైఎస్సార్‌సీపీ (YSRCP) నేతృత్వంలోని ప్రభుత్వం (AP Government) ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ భూ మాఫియాను రక్షించడానికే ప్రభుత్వ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడిన వీడియోలను తన లేఖతో పాటు లోకేష్ జత చేసి పంపించారు.

Updated Date - 2023-03-27T13:25:59+05:30 IST