Vijayawada: వివిధ పోలీస్ స్టేషన్లలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2023-03-20T10:13:43+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివస్తున్న వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Vijayawada: వివిధ పోలీస్ స్టేషన్లలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

విజయవాడ: జీవో నంబర్‌ 1 (GO No.1)ను రద్దు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల (Anganwadi Workers) సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ (TDP), వామపక్ష పార్టీలు (Left Parties) సోమవారం ఛలో విజయవాడ (Vijayawada)కు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివస్తున్న వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్నారు.

అంగన్‌వాడీల అరెస్టులను ఖండించిన సీపీఎం... వారి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ దమనకాండను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పిలుపు మేరకు ఆందోళనకు వస్తున్న మహిళలను దౌర్జన్యంగా అరెస్టులు చేయడం శోచనీయమన్నారు. పెత్తందారులపై యుద్ధం అంటూ పేద మహిళ అంగన్‌వాడీలపై ప్రభుత్వం యుద్ధం చేస్తోందన్నారు. ముందస్తు అనుమతి కోరినా.. ధర్నాకు అనుమతి ఇవ్వకుండా వచ్చిన వారిని వచ్చినట్టు విచక్షణారహితంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంగన్‌వాడీల కోర్కెలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాలని, సీఎం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని బాబురావు అన్నారు.

కాగా ఈ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించి, టీడీపీ, వామపక్షాల వారిని ఎవరినీ విజయవాడవైపు వెళ్లకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఛలో అసెంబ్లీకి అంగన్వాడీల ఛలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు‌ పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. వందలాది మందికి‌ ముందుగా నోటీసులు పంపించారు. పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2023-03-20T10:13:43+05:30 IST