Kodali Nani : ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి?

ABN , First Publish Date - 2023-05-29T12:52:02+05:30 IST

ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు.

Kodali Nani : ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి?

అమరావతి : ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘అసలు ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు? లోకేష్ పాదయాత్రకు వెళ్లి చనిపోయిన తారకరత్న ఫోటో ఎందుకు పెట్టలేదు? కేవలం చంద్రబాబును పొగిడించుకోవటానికే మహానాడు.

చంద్రబాబు రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో బోగస్. 2014, 2019 నాటి మీ మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో? ఏపీ సీఎం జగన్ ఏం చేశారో చర్చిద్దాం. ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ గతంలో అనే వారురు. 2014లో చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేయిస్తామని మోదీ, పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పారు. మరి వాటిని ఎందుకు అమలు చేయలేదు. రైతు రుణమాఫీ అని చెప్పి కనీసం పది శాతం కూడా చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత చదువులు, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏవైనా చేశారా? విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తానని చెప్పి ఇచ్చారా?

మహిళలకు 15 వందలు ఇస్తానని అంటున్నారు. ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి? వార్డు సభ్యులుగా గెలవలేని వారు కూడా మహానాడు వేదిక మీద మమ్మల్ని దూషించారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలను కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు. బీసీలను నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్. వారు కూడా ఎన్టీఆర్‌ ని దైవంగా చూశారు. అలాంటి వారిని వెన్నుపోటు పొడిచారు. ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న బీసీల కోసం చంద్రబాబు ఏం చేశారు? జగన్, వైఎస్ఆర్ 40 లక్షల ఇళ్లు బీసీల కోసం కట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు వేధిస్తున్నారు. సినిమాలు రాకుండా నిర్మాతలను బెదిరించారు.

ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ ఫోటో ఎందుకు పెట్టారు? రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లోని పేదలకు న్యాయం జరుగుతుందంటే అది జగన్ వలనే. చంద్రబాబు కేవలం అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు? వారి పేర్లు చెప్పుకుని అధికారంలోకి రావటం తప్ప చంద్రబాబు ఏమీ చేయలేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే అయన చుట్టూ వున్న వాళ్లంతా బాగుపడతారు. చంద్రబాబుది 420 మేనిఫెస్టో. దసరా నాటికి తెలంగాణ మేనిఫెస్టో వస్తుంది. దాన్ని కాపీ కొట్టి దసరానాడు ప్రకటిస్తారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-29T12:52:02+05:30 IST