Chandrababu petitions: చంద్రబాబు పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా..

ABN , First Publish Date - 2023-10-05T17:12:03+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu petitions: చంద్రబాబు పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా..

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తరుపున ప్రమోద్ దూబే, సీఐడీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాదనల అనంతరం కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను మరో 14 రోజులపాటు న్యాయస్థానం పొడగించింది. రిమాండ్‌ గడువును అక్టోబర్ 19వరకు పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరిచారు.

దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ముగిసిన తర్వాత రిప్లై వాదన వినిపిస్తానని పొన్నవోలు అనడంతో.. మళ్లీ ఎలా చెబుతారని దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దూబే, పొన్నవోలు మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. ఈ పరిణామంతో న్యాయమూర్తి కొద్దిసేపు విచారణ వాయిదా వేశారు. మరికొద్దిసేపటి రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఏసీబీ కోర్టులో వాదోపవాదాలు ఇవే....

స్కిల్ డెవలప్‌మెంట్ నుంచి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించారని ఆధారాలు చూపించారు. ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు. సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుందన్నారు. చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని కోరారు. చంద్రబాబు రిమాండ్‌ను పొడగించాలని, 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేశారు.


చంద్రబాబుకు సంబంధం లేదు: ప్రమోద్ కుమార్ దూబే వాదనలు

‘‘ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు నిధులు మాత్రమే మంజూరు చేశారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముంది?. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు... అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం’’ అని ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.

Updated Date - 2023-10-05T17:12:03+05:30 IST