Pawan Kalyan: వైసీపీ అనుకున్నది జరగదు!

ABN , First Publish Date - 2023-03-15T03:24:46+05:30 IST

ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు.

Pawan Kalyan: వైసీపీ అనుకున్నది జరగదు!

గెలుపుపై సంపూర్ణ నమ్మకం వస్తేనే ఒంటరిపోరు

కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి

వాళ్లు ఐక్యంగా ఉంటే మిగిలిన కులాలు కలిసి వస్తాయి

అన్ని కులాలకూ అధికారం దక్కాలంటే జనసేన రావాలి

రాష్ట్రం కులాల కాష్టం నుంచి బయటకు రావాలి

ఈసారి జనసేన ప్రయోగాలు చేయదు

బీజేపీ కలిసొస్తే టీడీపీ అక్కర్లేనంతగా ఎదిగేవాళ్లం

కార్యాచరణ అమలుకు బీజేపీ కలిసి రాలేదు

వైసీపీ కులాలను విడదీసే కుట్ర పన్నుతోంది

175 స్థానాల్లో పోటీ చేయమనడానికి వాళ్లెవరు?

పదో ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ మండిపాటు

‘‘దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది! వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒకటి కోరుకుంటోంది. కానీ అది జరగనివ్వను. ఏం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో నాకు తెలుసు! అదే జరుగుతుంది. ఓటును వృథా కానివ్వను. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన సంతకం ఉంటుంది. నేను, జనసేన తరఫున నిలబడే అభ్యర్థులంతా అసెంబ్లీలో ఉంటారు. ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపు కొంటాం. ఏదైనా రాష్ట్ర హితం కోసమే నా నిర్ణయముంటుంది. నన్ను నమ్మండి!’’

- పవన్‌ కల్యాణ్‌

మచిలీపట్నం/అమరావతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. ఈసారి ప్రయోగాలు చేయబోమని, అసెంబ్లీలో అడుగుపెట్టేలాగే తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలోని సుల్తాన్‌నగరంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. కులాల మధ్య ఐక్యత, కాపులు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం, పొత్తులు తదితర అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పనప్పటికీ... ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఒంటరి పోరుపైనా తన వైఖరి చెప్పారు. ‘‘మీరు సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారు. కానీ... మీరంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి... క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి నేను వెనుకాడను’’ అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురు చూస్తున్నానని పవన్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ... రాష్ట్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడి నాయకులే ముందుకు రావడంలేదని పవన్‌ బందరు సభలో పేర్కొన్నారు. ‘‘మేం అనుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే ఇప్పుడు టీడీపీతో అవసరంలేని స్థాయికి ఎదిగేవాళ్లం. అమరావతి రాజధాని అని చెప్పారు.

ఒక లాంగ్‌ మార్చ్‌ పెడతాం అన్నాను. బలోపేతమవుదామని చెప్పాను. అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారు. సాయంత్రానికి అదేంలేదని అన్నారు. కలిసికట్టుగా కార్యక్రమాలు నడపకపోతే నేనేం చేయాలి? అమ్మా పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది. మీరు చేయరు. నన్నూ చేయనివ్వరు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం దృష్టికి కూడా తెచ్చాను. నేను అనుకున్నట్లుగా జరిగి ఉంటే... వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంలో తెలుగుదేశం అనేదే వచ్చేది కాదు. టీడీపీ మీద నాకు ప్రత్యేక ప్రేమ లేదు. చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదు. కానీ... ఆయనమీద గౌరవముంది. ఆయన సమర్థుడు’’ అని పవన్‌ పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు... 20 సీట్లకే పవన్‌ పరిమితం... అంటూ వాట్సా్‌పలో వచ్చిన ప్రతి ఒక్కటీ నమ్మొద్దని పార్టీ అభిమానులకు సూచించారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే మోదీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు.

DSC_4505_1.jpg

జవాబుదారీతనం ఏదీ?

అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని పవన్‌ పేర్కొన్నారు. ‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఉండాలి’ అని చెప్పారు. జగన్‌ పేరెత్తకుండానే ఆయనపై విరుచుకుపడ్డారు. ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ... ఏదో చిన్న పిల్లవాడు, తెలియకుండా మాట్లాడేశారని సకల శాఖ మంత్రి ఇప్పుడు చెబుతున్నారు. సిమెంటు కంపెనీలు పెట్టడానికి, ఇసుక దోచుకోవడానికి, మద్యం పేరుతో దోచుకోవడానికి మాత్రం చిన్న పిల్లవాడు కాదా?’’ అని ప్రశ్నించారు. ఇసుక, మద్యంలో మొత్తం నగదు లావాదేవీలే నడుస్తున్నాయని, ఆ డబ్బులతోనే మళ్లీ ఓట్లు కొంటారని పేర్కొన్నారు. మూడు రాజధానులంటూ మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు అసిస్టెంట్‌ లోకాయుక్తలను నియమించలేని వీళ్లు కర్నూలును న్యాయ రాజధాని చేయగలరా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర యువత గంజాయి మత్తులో తూగుతోందన్నారు.

కాపుల పెద్దన్న పాత్ర...

రాష్ట్ర రాజకీయాలు మారాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్‌ ఆకాంక్షించారు. ఈ సీఎం ఇతర కులాలకు భయపడరని, ఎందుకంటే వారికి సంఖ్యాబలం లేదని చెప్పారు. అదే కాపులంతా ఐక్యంగా ఉంటే... మిగిలిన కులాల వారూ వెంట నడుస్తారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కులాలను విడదీసే కుట్రలు పన్నుతోందని పవన్‌ విమర్శించారు. కులాలను ఐక్యంగా ఉంచాలన్నది జనసేన సిద్ధాంతమని, అలాంటి తనను కులం పేరుతో దూషిస్తూ కులాన్ని అమ్మేస్తున్నానని అంటుంటే బాధేస్తుందన్నారు. కులాల కాష్టం నుంచి మనం బయటకు రావాలని పిలుపునిచ్చారు. ‘‘కాపుల ఆరాధ్యదైవం వంగవీటిరంగా చేసుకుంది ఓ కమ్మవారి ఆడపడుచును. నాయకులు కులాలు దాటి తమ పిల్లలను ఇతర కులాల వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వారికి లేని కులాలు మీకు ఎందుకు? దాని వల్ల అభివృద్ధి ఆగిపోతుంది’’ అని అన్నారు. ‘నేను టీడీపీని అందలం ఎక్కించడానికి ఉన్నాను.. కమ్మవారి కొమ్ముకాస్తున్నామని ఇక్కడ ఉన్న ఓ నాయకుడు అంటున్నాడు.

DSC_4603.jpg

నన్ను తిట్టే కాపు నాయకులందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఊడిగం చేస్తున్నారని నేను తిట్టలేనా? కానీ... నాకు అది రాదు. నేను సమాజాన్ని విశాల దృష్టితో చూసేవాడిని’’ అని పేర్కొన్నారు. ఒక్క కులం మీద సమాజాన్ని నడపలేమని... ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడి ఉన్నామని చెప్పారు. ‘‘వంగవీటి రంగా కాపులకు ఆరాధ్యదైవం. ఆయన తనను చంపేస్తున్నారని చెప్పినా కుల నాయకులు ఎందుకు అండగా నిలవలేదు. చనిపోయిన తర్వాత ఆయనకు విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏముంది?’’ అని పవన్‌ మండిపడ్డారు. ‘‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. బీసీలకు ఇవ్వాల్సిన నిధులనూ పక్కదారి పట్టిస్తున్నారు’’ అని అన్నారు. ఏపీలో కుల పెత్తనం ఆగిపోవాలన్నారు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కాలంటే జనసేన అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి కూడా జనసేన ఆలోచిస్తోందని చెప్పారు.

డబ్బులు నాకెందుకు?

‘‘గతంలో ప్యాకేజీ స్టార్‌ అన్నారు. నేను డబ్బులు ఆశించేవాడిని కాదు. ప్రస్తుతం నేను చేసే సినిమాకు రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నా. అలాంటి నాకు డబ్బులు అవసరం ఏముంది?’’ అని పవన్‌ ప్రశ్నించారు. ‘‘మీరు నాకు అధికారం ఇస్తే మీ కుల నాయకులతో పని చేయించే బాధ్యత తీసుకుంటాను. కూలీలా పనిచేస్తాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం బాధపడే పరిస్థితి తీసుకురాను. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడమే నా లక్ష్యం’’ అని తెలిపారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు రావాలన్నది తన ఆకాంక్ష అన్నారు. ‘బీజేపీతో పొత్తు అనగానే ముస్లింలు చాలా మంది ఆందోళన చెందారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు. కానీ మేం తెరవెనుక రాజకీయాలు చేయం’’ అని చెప్పారు.

ప్రముఖులను గుర్తు చేస్తూ

సభా వేదికకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. అలాగే, పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో పలువురు ప్రముఖులు రాసిన కవితలను ప్రస్తావించారు.

30 కిలోమీటర్లు.. 5 గంటలు..

విజయవాడ ఆటోనగర్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ 60 కిలోమీటర్ల దూరంలోని సభాప్రాంగణానికి రాత్రి 9.15 గంటలకు చేరుకుంది. ఆటోనగర్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉయ్యూరు వరకు ‘వారాహి’పైనే పవన్‌ ర్యాలీని కొనసాగించారు. అడుగడుగునా అభిమానులు ఆపుతుండటం.. వారాహితోపాటు సుమారు వెయ్యికిపైగా బైకులు, ఇతర వాహనాలు ర్యాలీగా వస్తుండటంతో ఉయ్యూరుకు చేరుకోవడానికే 5 గంటలకుపైగా సమయం పట్టింది. దీంతో సభకు సమయం మించిపోతుండటంతో పవన్‌ ఉయ్యూరు వద్ద వారాహి దిగిపోయి కారులో సభాప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకే సుమారు 30 ఎకరాల సభాప్రాంగణం జనాలతో నిండిపోయింది. సభాప్రాంగణం వద్ద పవన్‌ కల్యాణ్‌ ముందుగా కృష్ణా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతులకు సాయం అందించారు.

678.jpg

మగతనం చూపిస్తాం...

‘వైసీపీ నాయకులు కొంతమంది మగతనం గురించి మాట్లాడుతున్నారు. మీకు మగతనం చూపించాలా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి మాటకూ శిస్తు కట్టిస్తాం’ అని పవన్‌ హెచ్చరించారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయ్యమని డిమాండ్‌ చేయడానికి వాళ్లెవరని అడిగారు. ‘‘మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో, ఎవరికి టికెట్‌ ఇవ్వాలో మేం చెబుతున్నామా? దోపిడీ చేసిన సొమ్ముతో మదమెక్కి మాట్లాడుతున్నారు. మీ మదం ఎలా తగ్గించాలో మాకు తెలు సు. వైసీపీ వాళ్లు తొడలు ఎక్కువ కొడుతున్నారు. రెండు తొడలు బద్ధలు కొట్టి కింద కూర్చోబెడతాం’’ అని హెచ్చరించారు.

Autonagar-X-Road-to--Tadiga.jpg

పవన్‌ మాటలు...

పదేళ్లుగా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఎదుర్కొంటూనే ఉన్నాను. దెబ్బపడే కొద్దీ జనసేన బలపడుతుంది. నిలబడే నాయకుడుంటే... అండగా నిలుస్తామని మీరు నిరూపించారు.

జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టడానికి, పరివర్తన తేవడానికే!

కులాల పేరుతో కొట్టుకుని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి, ఒక కులంతో గొడవపడటానికి నేను లేను.

ఏపీలో ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలంటే జనసేన పాలన రావాలి.

అన్ని కులాల్లో నాకు అభిమానులున్నారు. సమాజాన్ని విశాల దృక్పథంతో చూసే వ్యక్తిని. ఒక్క కులం మీద, మతం మీద సమాజాన్ని నడపలేం.

కాపులు, ఎస్సీలు, ఎస్టీలతో నన్ను తిట్టిస్తున్నారు. అంటే... కాపులు-ఎస్సీలు, బీసీలు-కాపులు కొట్టుకు చావాలా? మాలోమేం కొట్టుకోవాలాఝ

కులాన్ని చూసి ఓటేస్తారా, గుణాన్ని చూసి ఓటేస్తారా... అనేది మీరే నిర్ణయించుకోండి.

ఈ దేశ మూలాలు గొప్పవి. పాకిస్తాన్‌లో హిందువులు ఉండలేని పరిస్థితి. కానీ, మన దేశంలో అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని చేశాం. షారుఖ్‌ను సూపర్‌స్టార్‌గా మార్చాం. మన క్రికెట్‌ టీమ్‌కు అజారుద్దీన్‌ను కెప్టెన్‌గా చేయగలిగింది మన దేశం. వసుధైక కుటుంబమనే సంస్కృతే దీనికి కారణం.

రామతీర్థంలో, పిఠాపురంలో ఆలయాలను అపవిత్రం చేస్తే నేటికీ దోషులను ఎందుకు పట్టుకోలేకపోయారు? మేం... ఏ ప్రార్థనా మందిరాలను అపవిత్రం చేసినా మేం దానిని శాంతి భద్రతల సమస్యగా చూస్తాం.

తెలంగాణలో ఎవరి కులాలు వారికి ఉంటాయి. కానీ... తెలంగాణ అనే భావన అందరిలో ఉంటుం ది. కానీ... ఆంధ్రాలో ఆ భావన లేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే, మా కులపోడికి కాదులే అంటారు.

నా మీద కేసుల్లేవు కాబట్టి బీజేపీ నేతలతో ధైర్యంగా మాట్లాడగలను.

మీకు కోపం రాలేదా?

రకరకాల కారణాలు చెప్పి అమ్మ ఒడిని దూరం చేస్తున్నారు. అడ్డగోలుగా ఇసుక దోచేస్తున్నారు. భవననిర్మాణ కార్మికుల జీవితాలు ఛిద్రమయ్యాయి. అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. మరి మీకు కోపం రాకుంటే ఎలా? ఇది మీ రాష్ట్రం, మీ సమాజం కాదా? మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి మద్యం అమ్ముతుంటే మీరు ప్రశ్నించకుంటే ఎలా? రెండు వందలుజేబులో పెట్టి 500 సారా పేరుతో దోచేస్తున్నారు. మిడిల్‌ క్లాస్‌, అపార్ట్‌మెంట్‌ సముదాయాల్లో ఉన్నవారు, చదువుకున్న వారు కూడా ఓటును అమ్ముకుంటే మార్పు ఎప్పుడు వస్తుంది? క్రిమినల్‌ రాజకీయాలు పోవాలి. జవాబుదారీతనం ఉన్న రాజకీయం రావాలి.

అవమానాలను ఎదుర్కొని..: నాదెండ్ల మనోహర్‌

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. జనసేన పార్టీ స్థాపించిన 9 ఏళ్లలో పార్టీ అధ్యక్షుడు పవన్‌ ఎన్నో అవమానాలు ధైర్యంగా ఎదుర్కొని జనం కోసం పార్టీని నిలబెట్టారని తెలిపారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా ధైర్యంగా నిలబడి సుల్తాన్‌ నగరంలో జనసేన సభకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది క్రియాశీలక సభ్యత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.19 లక్షలు చేయగా, ఈఏడాది 6.69 లక్షల సభ్యత్వాలు చేయగలిగామన్నారు. 300 రైతు కుటుంబాలను జనసేన ఆదుకుందన్నారు.

Updated Date - 2023-03-15T05:20:04+05:30 IST