YSRCP: అవే కథలు.. పుక్కిటి పురాణాలు!!

ABN , First Publish Date - 2023-09-28T03:25:18+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలు కావడంతో అరెస్టును సమర్థించుకోవడానికి అధికారపక్షం బాగానే కసరత్తుచేసి సభకు వస్తుందని అంతా భావించారు.

YSRCP: అవే కథలు.. పుక్కిటి పురాణాలు!!

సభలో సీఎం మాట్లాడతారంటూ రోజూ హడావిడి

ఐదురోజుల సభలో నోరు మెదపని సీఎం జగన్‌

స్కిల్‌పై బుగ్గన..ఇన్నర్‌పై ధర్మాన ప్రసంగాలు

వినేందుకు ఆసక్తి చూపని ఎమ్మెల్యేలు

ప్రతిరోజూ సభలో జగన్మోహనరెడ్డి స్త్రోత్రం

గత ప్రసంగాలు ఇప్పుడు పోస్ట్‌చేసిన వైసీపీ సోషల్‌ మీడియా

ప్రజా సమస్యల ప్రస్తావనకు ప్రాధాన్యమివ్వని వైనం

తిరుమలలో దర్శనాలు అడిగినన్ని ఇవ్వడంలేదని చర్చ

సభల్లో ఈ విషయాలా మాట్లాడేది అంటూ విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలు కావడంతో అరెస్టును సమర్థించుకోవడానికి అధికారపక్షం బాగానే కసరత్తుచేసి సభకు వస్తుందని అంతా భావించారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో .. ఆయన చేసిన తప్పిదాలు ఏమిటో.. సీఐడీ కేసులెందుకు పెట్టిందో సభా నాయకుడిగా ప్రజలకు వివరించడం జగన్‌ బాధ్యత. కానీ, సభ జరిగిన ఐదు రోజులూ సీఎం గొంతే పెగలలేదు. ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించాల్సిన సభలో తిరుమల దర్శనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అడిగినన్ని ఇవ్వడం లేదనేది పెద్ద చర్చ అయింది. జగన్‌ మరీ ఏం మాట్లాడలేదంటే బాగుండదని.. స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వంటి అంశాలపై గతంలో సభలో ఆయన చేసిన ప్రసంగాలను వైసీపీ సోషల్‌ మీడియా విడుదల చేసి హడావిడి చేసింది.

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర శాసనసభా సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమై, ఐదు రోజులు కొనసాగి, బుధవారం ముగిశాయి. శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో అరెస్టు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశం కావడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత లభించింది. ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆర్నెళ్లలో గడువు ముగిసేలోగా శాసనసభా సమావేశాలు నిర్వహించాలనే రూల్‌ ప్రకారం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చంద్రబాబు అరెస్టుపై వాడివేడి చర్చలు జరుగుతాయని సహజంగానే అంతా భావించారు. కానీ, శాసనసభ, శాసన మండలి జరిగిన తీరు సర్వత్రా నిరాశను కలిగించింది. సమావేశాల ఆసాంతం నిరాసక్తత, నీరసం, చర్చల్లో పదును లేకుండా సాగాయి. శాసనసభా సమావేశాలు ప్రారంభమైన రెండో రోజునే తెలుగుదేశంపార్టీ శాసనసభ్యులు అసెంబ్లీని వాకౌట్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అధికారపక్షం ఏకపక్షంగా సభను నడిపించింది. చంద్రబాబు అవినీతిని నిరూపిస్తామంటూనే.. అధికార పార్టీ శాసనసభ్యులూ మంత్రులూ గతంలో చెప్పినవాటినే ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతో, ఇదంతా చప్పగా సాగదీతగా మారిపోయి.. పాలకపక్ష సభ్యులకే విసుగు తెప్పించింది. సమావేశాలు ఎంత త్వరగా అయిపోతాయిరా నాయనా అని కొందరు ఎమ్మెల్యేలు విసుక్కున్నారు. చివరిరోజు సాయంత్రం మూడున్నరైనా అసెంబ్లీ ఎప్పటికి ముగుస్తుందో తెలియక.. ఇంకెంత సేపు అంటూ చాలామంది ఎమ్మెల్యేలు చిరాకుపడటం కనిపించింది.

రోజూ అదే పాట..

సమావేశాల తొలిరోజు నుంచే స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఫైబర్‌గ్రిడ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ వంటి అంశాలపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పూసగుచ్చినట్లుగా వివరిస్తారంటూ అధికారపక్షం నానా హడావిడి చేసింది. సమావేశాలు ముగిసేంతదాకా అదే పాట పాడుతూ వచ్చారు. దీనికితోడు ముఖ్యమంత్రి ఎక్కువసేపు సభకు రాకపోవడంతో .. శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులేమిటో తేల్చి సభకు చెప్పే పనిలో ఆయన ఉన్నారంటూ పాలకపక్ష సభ్యులు కొందరు చెబుతూ వచ్చారు. ఇలా ఏరోజుకారోజు.. ముఖ్యమంత్రి మాట్లాడతారంటూ పాలకపక్ష శాసనసభ్యులను ప్రభుత్వ విప్‌లు.. మంత్రులు ‘‘అలర్ట్‌’’ చేస్తూ వచ్చారు. జగన్‌ మాట్లాడతారని మంత్రులూ విప్‌లూ చెబుతున్నా.. పట్టుమని సగం మంది అధికారసభ్యులు కూడా సభలో లేని పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభ్యుల హాజరు సగటున 56 మాత్రమే ఉందని కొందరు సభ్యులు పేర్కొన్నారు.


తొలి రెండు రోజులే హడావిడి..

సమావేశాలు మొదలైన తొలి రెండు రోజులు ప్రతిపక్ష తెలుగుదేశం శాసనసభ్యుల ఆందోళనలతో శాసనసభలో హడావిడి కనిపించింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఒకరకమైన గంభీరమైన వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు రాజకీయ దురుద్దేశాలూ .. కక్షే కారణమంటూ ప్రతిపక్షం గట్టిగా వాదిస్తూ వచ్చింది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం పోడియంను ప్రతిపక్ష సభ్యులు చుట్టుముట్టి ఆందోళనలు చేశారు. శాసనసభా సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేకించి బాలకృష్ణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. దానికి ప్రతిగా బాలకృష్ణ చేసిన సంజ్ఞలు రాష్ట్రంలో ప్రత్యేక చర్చకు దారితీశాయి. సమావేశాల తొలిరోజున స్పీకర్‌ నేతృత్వంలో జరిగిన శాసనసభా సలహా కమిటీ (బీఏసీ)కి తెలుగుదేశం పార్టీ గైర్హాజరైంది. దీనిని పాలకపక్షం ఊహించలేదు. రెండో రోజున కూడా చంద్రబాబుపై బనాయించిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ హక్కుల నోటీసును ఇచ్చిన తెలుగుదేశం.. సభలో సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే.. తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీనికి సభాపతి ఆమోదించకపోవడంతో .. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా తెలుగుదేశం సభ్యులు ప్రకటించారు.

అవే రికార్డులు మళ్లీ మళ్లీ..

జగన్మోహనరెడ్డి శాసనసభలో మాట్లాడతారంటూ ప్రతిరోజూ హడావిడి చేసినా చివరకు ఆయన మాట్లాడకుండానే సమావేశాలు ముగిసిపోయాయి. అయితే, ఇది ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు పంపుతుందని పాలకపక్షం.. సామాజిక మీడియా భావించాయి. గతంలో శాసనసభలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌, ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లపై ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలను మంగళవారం యథాతథంగా వైసీపీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆయన కొత్తగా మాట్లాడినట్లుగా కలరింగ్‌ ఇచ్చారు. శాసనసభలో జగన్‌ ప్రసంగంతో ప్రతిపక్షం దద్దరిల్లిపోయిందంటూ ట్యాగ్‌లైన్‌ పెట్టి మరీ వాటిని విడుదలచేశారు.


పార్టీ సమావేశంలో ప్రసంగం

చట్టసభలో నోరుమెదపని జగన్‌ మంగళవారం పాలకపక్ష ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో జరిగిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాపులో మాత్రం మాట్లాడారు. వచ్చే ఆర్నెల్లలో చేయాల్సిన కార్యాక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యేలకు కర్తవ్యబోధ చేశారు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అంటూ మరో కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడే సమయంలో అడ్డం రాని గొంతునొప్పి, జలుబు, నలత శాసనసభలో ఎందుకొచ్చాయని పలువురు సందేహం వ్యక్తం చేశారు. కాగా, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చలే లేవు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కేంద్రం చేసిన చట్టానికి మద్దతిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపైనా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం రాజకీయవర్గాల్లో విమర్శలకు తావిచ్చింది. తమకు, తమ మందీమార్బలానికి దర్శనాలు అడిగినన్ని ఇవ్వడం లేదని పెద్దల సభలో చర్చించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

జగన్‌ మౌనానికి కారణమేంటి?

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే .. దాదాపు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలంటూ పాలకపక్షం ప్రచారం చేస్తూ వచ్చింది. డిసెంబరులో లేదా జనవరిలో ఎన్నికలు జరిగితే.. షెడ్యూల్‌ విడుదలయ్యాక.. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే వీలులేదని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా.. మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేలా సభలో చర్చ జరుగుతుందని భావించారు. కొత్త పథకాలను ముఖ్యమంత్రి సభా వేదికగా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరగలేదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌లోగానీ.. ఫైబర్‌గ్రిడ్‌లోగాని.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లోగాని.. గతంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి ‘‘జిరాక్స్‌’’ కాపీ తరహాలో మంత్రులు బుగ్గన, గుడివాడ, ధర్మాన మాట్లాడారు. మం త్రుల ప్రసంగాల్లో కొత్త కోణం లేకపోవడంతో.. అరిగిపోయిన రికార్డు తరహాలో వారి ప్రసం గం ఉందని అధికారపక్ష సభ్యులే అనడం వినిపించింది. సాధారణ జలుబు, గొంతు నొప్పితో జగన్‌ బాధపడుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-09-28T08:34:38+05:30 IST