Minister Marketing: మంత్రిగారి మార్కెటింగ్‌

ABN , First Publish Date - 2023-08-17T03:45:18+05:30 IST

ఆయన ఉత్తరాంధ్ర( Uttarandhra)కు చెందిన ఒక సీనియర్‌ మంత్రి(Senior Minister). ఎంత సీనియర్‌ అంటే... ముఖ్యమంత్రి కంటే సీనియర్‌! జగన్‌ తండ్రి వైఎస్‌ మంత్రివర్గంలోనే కీలకమైన శాఖలు నిర్వహించారు. ఇప్పుడు కూడా కీలక శాఖలోనే ఉన్నారు. అంతటి మంత్రి రాక రాక బుధవారం సచివాలయాని (Secretariat)కి వచ్చారు. ‘

 Minister Marketing: మంత్రిగారి మార్కెటింగ్‌

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా అవతారం

ఆలసించిన ఆశాభంగం..

‘‘విశాఖలో విల్లా, ప్లాటు కొనుగోలు చేసేంత సొమ్ము మీ వద్ద ఉందా? అదే శ్రీకాకుళం అయితే మీరే కాదు మీకు తెలిసిన స్నేహితులతో కూడా కొనిపించగలరు. మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత త్వరగా ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌కు చేరుకోగలం.. మన మీద భారం పడకుండా చూసుకోగలమన్నదే ముఖ్యం. మీకు ఆసక్తి ఉంటే పేర్లు, వివరాలు ఇవ్వండి. లోన్లు, ఇతర వనరులన్నీ అక్కడ సులభంగా దొరుకుతాయి. మీకు ఇబ్బంది ఉండదు. అన్నీ చూసుకుందాం!’’

- ఇవి మార్కెటింగ్‌లో బాగా నైపుణ్యమున్న రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ చెప్పిన మాటలు కావండోయ్‌! రాష్ట్ర కేబినెట్‌లో సీనియర్‌ మంత్రి, కీలక శాఖ నిర్వహిస్తున్న మంత్రివర్యుడి నోట వెలువడిన ఆణిముత్యాలివి! అదికూడా... రాష్ట్ర సచివాలయంలో! ఇదెలా సాధ్యమనుకుంటున్నారా! ‘నవ్వి పోదురుగాక...’ అనుకున్నాక ఏం చేయడానికైనా సిద్ధమే!

ఏకంగా సచివాలయంలోనే ప్లాట్ల వ్యాపారం

శ్రీకాకుళంలో 26 ఎకరాల్లో సొంత వెంచర్‌

బేరాల్లేక ఉసూరుమంటున్న మంత్రి

విశాఖ రాజధాని పేరుతో మార్కెటింగ్‌

సెక్రటేరియట్‌ అధికారులతో సమావేశం

ఓఎ్‌సడీ ద్వారా పిలిపించి రియల్‌ ముచ్చట్లు

కొనండి.. కొనిపించండి.. ఇబ్బంది ఉండదు

మంచి బేరం మాట్లాడుతానంటూ ఆఫర్‌

మంత్రి తీరుతో విస్తుపోయిన అధికారులు

(అమరావతి- ఆంధ్ర జ్యోతి): ఆయన ఉత్తరాంధ్ర(
Uttarandhra)కు చెందిన ఒక సీనియర్‌ మంత్రి(Senior Minister). ఎంత సీనియర్‌ అంటే... ముఖ్యమంత్రి కంటే సీనియర్‌! జగన్‌ తండ్రి వైఎస్‌ మంత్రివర్గంలోనే కీలకమైన శాఖలు నిర్వహించారు. ఇప్పుడు కూడా కీలక శాఖలోనే ఉన్నారు. అంతటి మంత్రి రాక రాక బుధవారం సచివాలయాని (Secretariat)కి వచ్చారు. ‘సెక్రటేరియట్‌లోని సీనియర్‌ ఆఫీసర్లను సమావేశపరచండి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అధికారులంతా రావాలి’ అని ఆదేశం జారీ చేశారు. ‘‘పరిపాలనా రాజధాని విశాఖకు పోతోందంటున్నారు. విశాఖలో కాపురం పెడతానని సీఎం చెబుతున్నారు. బహుశా... రాజధానికి సంబంధించిన అంశాలు, అందులో ఉత్తరాంధ్ర అధికారుల పాత్రపై మంత్రిగారు చర్చిస్తారేమో!’’ అని అనుకుని అధికారులు ఉరుకులు పరుగుల మీద కాన్ఫరెన్స్‌ హాలుకు వెళ్లారు. మంత్రిగారు రానే వచ్చారు. చాలా స్పష్టంగా, నెమ్మదిగా, ముద్దు ముద్దుగా మాట్లాడే ఆయన... మెల్లగా మొదలుపెట్టారు. ‘‘శ్రీకాకుళంలో మంచి వెంచర్‌ ఉంది. చక్కటి గేటెడ్‌ కమ్యూనిటీ. క్లబ్‌ హౌస్‌, విల్లాలు, ఫ్లాట్లూ అందుబాటులో ఉన్నాయి. రాజధాని విశాఖ(Visakhapatnam)కు వస్తుంది కదా! మీరు ఆ వెంచర్‌లో విల్లానో, ఫ్లాటో, ప్లాటో కొనండి. మీ వాళ్లకు కూడా చెప్పి కొనిపించండి. బాగుంటుంది’’ అంటూ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌(Real estate Agent) అవతారమెత్తారు.

ఆది నుంచీ అదే ‘రియల్‌’

ఆ మంత్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో ఎదిగారు. తొలిసారి వైఎస్‌ కేబినెట్‌లో ఉండగా భూముల వ్యవహారాలు చూసేవారు. పేదలకేమైనా మేలు చేస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన కన్నంతా రియల్‌ వ్యాపారంపైనే. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ వ్యాపారం బాగా సాగించారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, హైదరాబాద్‌తోపాటు బెంగళూరులో రియల్‌ వ్యాపారాలు జోరుగానే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో రియల్‌ వెంచర్‌ వేశారు. 16 ఎకరాల్లో విల్లాలు, 10 ఎకరాల పరిధిలో గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. లే అవుట్‌ బ్రోచర్లను కలర్‌ఫుల్‌గా రూపొందించారు. వచ్చే దసరాకు విశాఖ నుంచి పరిపాలన చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం అక్కడ ఉంటే.. ఆయనతో పాటు ఆయన కార్యాలయం, ఇతర ఆఫీసులు కూడా కొలువు తీరుతాయి. దీన్ని సీనియర్‌ మంత్రి అవకాశంగా తీసుకున్నారు. రాజధాని సంగతి దేవుడెరుగు..


ముందు అందివచ్చే రియల్‌ వ్యాపారం పెంచుకోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ‘వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో! ఇప్పుడే ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుందాం’ అని కూడా అనుకున్నారేమో! రియల్‌ వెంచర్‌ బ్రోచర్లతో సహా మంత్రివర్యులు బుధవారం సచివాలయానికి వచ్చారు. మార్కెటింగ్‌కు ఇంతకుమించిన వేదిక లేదనుకున్నారేమో! తన ఓఎ్‌సడీ ద్వారా సచివాలయంలోని కీలక శాఖల అధికారులను పిలిపించారు. 3 రాజధానులపై మీటింగ్‌ అని కొందరు... ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం అధిగమించడానికి ప్రణాళికలు అడుగుతారని మరికొందరు... కంగారుపడుతూ రిపోర్టులు, ఫైళ్లు సిద్ధం చేసుకొని వచ్చారు. అంతా వచ్చాక సదరు మంత్రి నెమ్మదిగా నోరు విప్పారు. దేశానికే తలమానికం కాబోతున్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో సొంత ఇల్లు ఉండటం అదృష్టమని రియల్‌ ముచ్చట్లు మొదలెట్టారు. ఆ భాగ్యం దక్కాలంటే ప్రతి ఒక్కరూ ప్లాట్లు కొనుక్కోవాలని అధికారులను, ఉద్యోగులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. విల్లా కొనుగోలు చేసే వారికి ప్లాట్ల కొనుగోలులో తక్కువ ధర ఉంటుందని, తన శక్తి మేరకు బేరం మాట్లాడుతానని ఆఫర్‌ కూడా ఇచ్చారు. ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదంటూ ఊరించారు. ఆసక్తి ఉన్న వారు తమ ఓఎస్డీకి పేర్లు, వివరాలు ఇవ్వాలని సూచించారు. ఎంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే మాత్రం మంత్రి ఇలాంటి మీటింగ్‌లు పెడతారా? తమ ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి మీటింగ్‌ చూడలేదంటూ సమావేశం ముగిశాక పలువురు అధికారులు వాపోయారు. ప్రభుత్వ శాఖలు, సచివాలయంలో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌. ఎవరి నోట విన్నా మంత్రి గారి రియల్‌ ముచ్చట్లే.

విశాఖలో జోరుగా వ్యాపారం

విశాఖలో మాజీ సైనికుల కుటుంబాలకు ఇచ్చిన అతి ఖరీదైన అసైన్డ్‌ భూములపై గతంలో ఆయన చక్రం తిప్పారు. మంత్రి బంధువులు, సన్నిహితులు ఆ భూములను దొడ్డిదారిలో చేజిక్కించుకున్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ భూముల స్కామ్‌పై నియమించిన సిట్‌ ఇచ్చిన నివేదిక నిండా ఆయన భూ బాగోతమే. విశాఖ నడిబొడ్డున లెక్కలేనన్ని భూములను మంత్రి బినామీ సొంతం చేసుకున్నారని సిట్‌ తేల్చింది. ఆ తర్వాత ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి కూడా అయ్యారు. ‘మూడు రాజధానులు’ పేరును రియల్‌ వ్యాపారానికి బాగా వాడుకున్నారు. విశాఖలో నాలుగు చోట్ల వేసిన వెంచర్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే శ్రీకాకుళంలో వేసిన వెంచర్‌కు ఆశించినంత స్పందన రావడం లేదు. విశాఖలో ఉన్న డిమాండ్‌ అక్కడ లేకపోవడమే కారణం. ఉద్యోగులు, వ్యాపారులు అటువైపు దృష్టిసారించడం లేదు. విశాఖ, సిక్కోలులో ప్రాపర్టీ షో కింద హడావుడి చేసినా ఫలితం రాలేదు. దీంతో సచివాలయంలోని అధికారులకు అంటగట్టేందుకు ప్లాన్‌ వేశారు.

Updated Date - 2023-08-17T04:50:33+05:30 IST