CM JAGAN: ఉద్యోగులపై జగన్‌ది ప్రేమా.. పగా?

ABN , First Publish Date - 2023-08-22T02:46:24+05:30 IST

అది... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సభ! ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు! ఆయన నాలుగు వరాలు కురిపిస్తారని...

CM JAGAN: ఉద్యోగులపై జగన్‌ది ప్రేమా.. పగా?

ఏపీఎన్జీవో సభలో సీఎం అబద్ధాల ప్రసంగం

చంద్రబాబుపై విమర్శలకే పరిమితం

పీఆర్సీ, ఐఆర్‌, బకాయిల ఊసెత్తని వైనం

తాను చేసిందేమిటో చెప్పలేని అసహాయత

టీడీపీ హయాంలో అత్యధిక ఫిట్‌మెంట్‌

రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇవ్వడమే జగన్‌ చరిత్ర

నాడు బడ్జెట్‌తో నిమిత్తంలేకుండా 1న జీతాలు

నేడు.. జీతాల కోసం ఎదురుచూపులు

ఓపీఎ్‌సతో సమాన లబ్ధికి నాడు కసరత్తు

సీపీఎస్‌ రద్దు అంటూ జగన్‌ ‘తప్పుడు’ హామీ

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌కూ అప్పుడే మేలు

అన్ని రకాల ఉద్యోగులకు జగన్‌ వంచనే

డీఏ ఇవ్వడమే గొప్ప అనేలా ‘ప్రకటన’

ఇదేనా మీ ప్రేమ?

సమస్యల పరిష్కారం కోసం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులపై

కక్షగట్టి వేధింపులకు దిగారు.

సీపీఎస్‌ ఉద్యోగులపై కేసులు పెట్టారు.

‘వీళ్లకు జీతాలు ఎక్కువ. పని తక్కువ’ అంటూ

ఉద్యోగులపై ప్రజల్లో ద్వేషం పెరిగేలా ప్రచారం చేశారు.

జిల్లా కేంద్రాల్లో 20ు ఉన్న హెచ్‌ఆర్‌ఏ

16 శాతానికి కుదించారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): అది... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees) ఏర్పాటు చేసుకున్న సభ! ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు! ఆయన నాలుగు వరాలు కురిపిస్తారని... పెండింగ్‌ డీఏలు(Pending DAS) ఇచ్చేస్తారని, పీఆర్సీ(PRS) వచ్చేలోగా ఐఆర్‌ ప్రకటిస్తారని, సీపీఎస్‌ రద్దుపై ప్రకటన చేస్తారని, ఇళ్ల స్థలాల గురించి చెబుతారని... ఉద్యోగులు చాలాచాలా ఆశించారు. కానీ... ముఖ్యమంత్రి ఎప్పట్లాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికి, గిట్టని మీడియాను నిందించడానికే పరిమితమయ్యారు. చంద్రబాబు(Chandrababu) ఎప్పుడో ఒక పుస్తకంలో ఉద్యోగుల గురించి ఇలా రాశారు, అలా రాశారు అని చదివి వినిపించిన జగన్‌... తాను ముఖ్యమంత్రి అయ్యాక అంత గొప్ప మేలు ఏం చేశారో చెప్పనేలేదు. చెప్పుకోడానికి ఏమీ లేదు కూడా! పైగా... ‘ఇలాంటి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే మీకు మళ్లీ మేలు చేస్తారా’ అని ఓ ప్రశ్నను గాలిలోకి వదిలారు. అసలు విషయం ఏమిటంటే... చంద్రబాబు రెండుసార్లు పీఆర్సీ ఇచ్చారు. అప్పట్లో తండ్రి వైఎస్‌, ఆ తర్వాత ఇప్పుడు జగన్‌ ఇచ్చిన ఫిట్‌మెంట్‌లు... చంద్రబాబు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ దరిదాపుల్లో కూడా రాలేవు. జగన్‌ హయాంలో ఉద్యోగులకు మిగిలింది ఆర్థిక నష్టం, వేధింపులు, చీదరింపులే! అయినా సరే... ఏపీఎన్జీవోల మహా సభలో ఉద్యోగుల మీద ప్రేమ ఉన్నట్లుగా జగన్‌ చెప్పడం, పక్కనే ఉన్న నాయకులు చప్పట్లు కొట్టడం గమనార్హం!

మేలు చేసింది ఎవరు?

ఉద్యోగులకు పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేది. చంద్రబాబు 1999లో 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ 16 శాతానికి సరిపెట్టారు. ఆర్థిక మంత్రిగా అత్యంత పొదుపు పాటిస్తారని, ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతారని పేరున్న రోశయ్య కూడా ఉద్యోగులకు 39 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ఇక... రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తెలంగాణ ఉద్యోగులకంటే తక్కువ కాకూడదనే ఉద్దేశంతో, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేశారు. పది నెలల అరియర్స్‌ కూడా ఇచ్చారు. పీఆర్సీ విషయంలో జగన్‌ చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఆయన చరిత్రలో ఎన్నడూలేని విధంగా ‘రివర్స్‌ పీఆర్సీ’తో ఉద్యోగులకు షాక్‌ ఇచ్చారు. ఐఆర్‌ 27 శాతంకాగా... ఫిట్‌మెంట్‌ను 23 శాతానికే పరిమితం చేశారు. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా నాలుగేళ్లు గడిపేశారు. ఆ బకాయిలు ఈ ప్రభుత్వ హయాంలో చెల్లిస్తారో... వచ్చే ప్రభుత్వం చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో... ఉద్యోగులంతా చంద్రబాబు హయాంలో జరిగిన లబ్ధిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

‘హాజరు’పై బేజారు

చంద్రబాబు ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టినప్పుడు... వైసీపీ దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. ఉద్యోగులను టీడీపీ రాచిరంపాన పెడుతోందన్నంతగా తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి... బయోమెట్రిక్‌ హాజరును చంద్రబాబు సర్కారు జీతాలతో ముడిపెట్టలేదు. కనీసం ఉద్యోగులు ఆఫీసుకు వస్తున్నారో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే బయోమెట్రిక్‌ తెచ్చామని, ఆలస్యంగా వచ్చినా జీతంలో కోత ఉండదని అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు జగన్‌ ముఖాధారిత హాజరు ప్రవేశపెట్టారు. దీనికి కొన్ని శాఖల్లో జీతాలకు లింక్‌ చేశారు.

12వ పీఆర్సీ ఐఆర్‌ ఊసేదీ...

ఎన్నికల స్టంట్‌లో భాగంగా జగన్‌ సర్కారు 12వ పీఆర్సీ వేసింది. సోమవారం ఏపీఎన్జీవో సభలో దీనికి సంబంధించి ఐఆర్‌ ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ... జగన్‌ ఆ ఊసే ఎత్తలేదు.

ఎలా చూసినా దిగదుడుపే.,...

ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి... ఏరకంగానూ చంద్రబాబును మించి జగన్‌ చేసిన మేలు ఏమీ లేదు. ఉద్యోగ నియామకాలూ లేవు. తన అజెండా ప్రకారం ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామకాలు తప్ప... చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఉద్యోగాలే లేవు. ప్రతి ఏటా ఇస్తామన్న జాబ్‌ క్యాలండర్‌ ఊసే లేదు.


పోలీసులకు ఏం చేసినట్లు...

ఇటీవల పుంగనూరులో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ... పోలీసులపై జగన్‌ ఎంతో ప్రేమ ఒలకబోశారు. కానీ... పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి, ప్రజల్లో చెడ్డపేరు తీసుకొచ్చిందే జగన్‌ సర్కారు. పోలీసులకు ఆర్థికంగానూ అన్యాయమే! వారి సరెండర్‌ లీవులు సకాలంలో ఇవ్వలేదు. టీఏ, డీఏలకూ దిక్కులేదు. దశాబ్దాలుగా వస్తున్న సైకిల్‌ అలవెన్సును తీసేశారు. యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌లో పని చేసే వారికి ఇచ్చే ప్రత్యేక అలవెన్స్‌ను రద్దు చేశారు. అయినప్పటికీ... పోలీసులకు తామేదో ఒరగబెట్టినట్లు చెప్పడం గమనార్హం.

ఒకటో తేదీ జీతం ఇవ్వలేని దైన్యం

‘మాకు ఉద్యోగులు ప్రయారిటీ కాదు’ అని ప్రభుత్వ పెద్దలు నేరుగానే చెప్పా రు. ఉద్యోగులు, పెన్షనర్లు ‘ఒకటో తేదీ జీతాలు, పెన్షన్లు ఇవ్వండి మహాప్రభో’ అనే దైన్యం జగన్‌ సర్కారులోనే నెలకొంది. ఒకటినే జీతం ఇవ్వాలంటూ చట్టం చేయాలని ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పార్ట్‌ టైం, ఫుల్‌ టైం, డైలీ వేజ్‌, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, హోంగార్డు, అంగన్వాడీ... తదితర ఉద్యోగుల జీతాలకు బడ్జెట్‌ కంట్రోల్‌ లేకుండా నేరుగా 010 తరహాలో ఒకటో తేదీనే డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు డిమాండ్లు పక్కనపెట్టి... ‘జీతం వస్తే చాలు దేవుడా’ అనుకునే పరిస్థితి వచ్చింది. అయినా సరే... తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది.

ఊరూరా ఊదరగొట్టి చేసిందేమిటి?

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ ఊరూరా మైకు పట్టుకుని ఊదరగొట్టారు. చివరికి... ‘అవగాహన లేకుండా ఆ హామీ ఇచ్చాం’ అని నాలుక మడతపెట్టారు. జీపీఎస్‌ అం టూ కొత్త ‘పథకం’ తీసుకొచ్చారు. నిజానికి... దేశంలోనే తొలిసారిగా చనిపోయిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ పింఛను, గ్రాట్యుటీ సౌకర్యాన్ని చంద్రబాబు హయాంలోనే కల్పించారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్‌ చందాను ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌తో కలిపి వారి ప్రాన్‌ ఖాతాలో ఒక నెల అటోఇటోగా జమ చేసేశారు. అప్పట్లో టక్కర్‌ కమిటీ వేసి ఓపీఎ్‌సతో సమానంగా అన్నికల్పిస్తామని బాబు సర్కార్‌ చెప్పినా... సీపీఎస్‌ ఉద్యోగులు జగన్‌ వలలోనే పడ్డారు. ఇప్పుడు ప్రాన్‌ ఖాతాల్లో వారి మినహాయించిన వాటా, ప్రభు త్వ వాటాను నెలల తరబడి జమ చేయట్లేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ నిలుపుదల చేయకుండా, సీపీఎస్‌ రద్దు చేయకుండా జీపీఎస్‌ ఎలా అమలు చేస్తా రు? కేంద్రం వద్ద ప్రాన్‌ ఖాతాలో ఉన్న ఉద్యోగుల సొమ్ము సంగతి ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు.

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌కూ మోసమే

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాన్ని చంద్రబాబు రూ.7 వేల నుంచి 14 వేలకు పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం ద్వారా వారికీ ఆర్థిక లబ్ధి చేకూర్చారు. దీంతో వారి వేతనం రూ.4వేల నుంచి ఒకేసారి రూ.13వేలకు పెరిగింది. కానీ... జగన్‌ తన మాటలతో వీళ్లిద్దరినీ మాయ చేశారు. ‘కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాం’ అని హామీ ఇచ్చారు. చివరికి... సమాన పనికి సమాన వేతనమూ ఇవ్వలేదు. దీనిపై ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు గళమెత్తినా ప్రయోజనం లేదు.

అంగన్వాడీలకు చెప్పిందేంటి... చేసిందేంటి?

అంగన్వాడీలకు వేతనాలు పెంచామని జగన్‌ డప్పు కొడుతున్నారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన 2019 జూన్‌ 8 నాటికి అంగన్‌ వాడీ వర్కర్స్‌ వేతనం రూ. 10,500 ఇప్పుడు ఇస్తున్నది రూ.11500. హెల్పర్‌, మినీ వర్కర్‌ వేతనం 6వేల నుంచి రూ.7000కు పెంచారు. వెరసి... చంద్రబాబు హయంలో కంటే ఇప్పుడు పెరిగింది వెయ్యి మాత్రమే! ఇదే జగన్‌... తెలంగాణ సర్కారుకంటే వెయ్యి ఎక్కువ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో అంగన్వాడీ వర్కర్‌కు రూ. 13650, హెల్పర్‌కు రూ. 7800 ఇస్తున్నారు. మరి... జగన్‌ ఇస్తున్నదేమిటి? ఇది మాట తప్పడం కాదా? అంగన్వాడీలు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు.

ఒక్క డీఏ ఇవ్వడమూ గొప్పేనా?

‘ఉద్యోగులకు దసరాకు ఒక డీఏ మంజూరు చేస్తాం’ అంటూ వారికి భారీ లబ్ధి చేకూరుస్తున్నట్లుగా జగన్‌ ప్రకటించారు. ఆరు నెలలకోసారి కేంద్రం తన ఉద్యోగులకు డీఏ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వాలి. ఇది చట్టబద్ధమైన నిబంధన. జగన్‌ హయాంలో వాటికీ దిక్కులేదు. డీఏలు సక్రమంగా ఇవ్వడంలేదు. కొన్ని డీఏలను పీఆర్సీలో కలిపేశారు. అరియర్స్‌ చెల్లింపులు లేవు. ఇప్పుడు దసరాకు ఇస్తానంటున్న డీఏ ఎప్పుడో 2022లో రావల్సింది! అది కూడా ‘దసరా కానుక’ అన్నట్లుగా చెప్పడం జగన్‌కే చెల్లింది.

Updated Date - 2023-08-22T04:08:51+05:30 IST