Polavaram project: పోలవరంలో కుంగిన గైడ్‌ బండ్‌?

ABN , First Publish Date - 2023-06-04T03:55:15+05:30 IST

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే ప్రాంతంలో డివాల్‌ గైడ్‌ బండ్‌ కొంత మేర కుంగినట్లు సమాచారం.

Polavaram project: పోలవరంలో కుంగిన గైడ్‌ బండ్‌?

మంత్రి అంబటి పరిశీలన

మీడియాకు అనుమతి నో

లోపాలు బయట పడతాయనే!

ఎల్లుండి సీఎం జగన్‌ రాక

పోలవరం, జూన్‌ 3: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే ప్రాంతంలో డివాల్‌ గైడ్‌ బండ్‌ కొంత మేర కుంగినట్లు సమాచారం. స్పిల్‌వేకి ఎగువన ఎడమ వైపు నదీ ప్రవాహ వేగానికి గట్టు కోతకు గురి కాకుండా డివాల్‌ గైడ్‌ బండ్‌ను నిర్మించారు. ఇది కొంత మేర కుంగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని సమాచారం. తాజాగా జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు మీడియాను అడ్డుకున్నారు. దీంతో డివాల్‌ గైడ్‌ బండ్‌ కుంగిన విషయాన్ని మీడియా కంట పడకుండా చేసేందుకే ఇలా వ్యవహరించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి మీడియాను వెంట తిప్పుకొనే మంత్రి అంబటి ఈసారి మీడియాను రాకుండా చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డివాల్‌ గైడ్‌ బండ్‌ స్వల్పంగా కుంగిన మాట వాస్తవమేనని, అయితే దానివల్ల ఎలాంటి నష్టం లేదని జలవనరులశాఖ అధికారులు కొందరు అంటున్నారు. కానీ, వరదల సమయంలో రెండు లక్షల క్యూసెక్కుల జలాలు పోటెత్తితే గైడ్‌ బండ్‌ తీవ్ర స్థాయిలో దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని సీనియర్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. గైడ్‌ వాల్‌కు నదీ ప్రవాహం వైపు కాంక్రీట్‌ రివిట్‌మెంట్‌ చేసి ఉంటే దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుందని అంటున్నారు. మూడున్నర కిలోమీటర్ల మేర ప్రవహించాల్సిన వరద జలాలను కేవలం కిలోమీటరు పరిధిలో ఉన్న స్పిల్‌వే 48 గేట్ల ద్వారా విడుదల చేసే అవకాశం ఉండడం, భారీ స్థాయిలో వరద ప్రవహించే నేపథ్యంలో స్పిల్‌వేకి ఎగువ, దిగువన రివిట్‌మెంట్‌ పటిష్ఠంగా చేస్తేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకి ఎగువన ఎడమ వైపు గైడ్‌బండ్‌ నిర్మాణం తప్ప దిగువన కుడి, ఎడమల ఎలాంటి రివిట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టలేదు. దీనివల్ల స్పిల్‌ చానల్‌ ఇరువైపులా కోతకు గురయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. మంత్రి పర్యటనలో మీడియాను అనుమతించని విషయంపై పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఐ వెంకటేశ్వరావును వివరణ కోరగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎవరినీ అనుమతించడం లేదన్నారు.

ప్రాజెక్టును పరిశీలించిన అంబటి

మంత్రి అంబటి రాంబాబు శనివారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. సీఎం జగన్‌ ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్న నేపథ్యంలో మంత్రి డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌, శాండ్‌ ఫిల్లింగ్‌ పనులు, స్పిల్‌వే డివాల్‌, గ్యాప్‌ ఒకటి, రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించారు. సంబంధిత పనుల వివరాలను ఎస్‌ఈ నరసింహమూర్తి, సీఈ సుధాకర్‌బాబు మంత్రికి వివరించారు.

Updated Date - 2023-06-04T10:38:12+05:30 IST