TRS : ఆధిక్యంపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం..!
ABN , First Publish Date - 2022-11-08T05:46:57+05:30 IST
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం! పలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛను ఇస్తున్నాం! వృద్ధులు,
అన్నీ చేసినా ఓట్లెందుకు రాలేదు!?
పార్టీపై సంక్షేమ సానుకూలత ఏదీ!?
మునుగోడులో అత్తెసరు మెజారిటీయేనా?
దిద్దుబాటు దిశగా చర్యలకు శ్రీకారం
తటస్థులు, సంస్థలతో సమీక్షకు నిర్ణయం
యువతను దగ్గర చేసుకోవడంపైనా చర్చ
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం! పలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పింఛను ఇస్తున్నాం! వృద్ధులు, వితంతువులకే కాకుండా ఎన్నో వర్గాలకు పింఛను అమలు చేస్తున్నాం! మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇస్తున్నాం! ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం! ఇలా ఒకటా రెండా.. ఇంటింటా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే! ఒక్క మునుగోడు ఓటర్లలోనే రెండు లక్షల మందికిపైగా ఉన్నారు! ఇంకా చెప్పాలంటే, ఓటర్లలో 99.5 శాతం మంది లబ్ధిదారులే! అయినా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమిటి!? కనీసం లక్ష ఓట్లు కూడా రాకపోవడం ఏమిటి!? 40 వేలకుపైగా ఆధిక్యత వస్తుందని అంచనా వేసుకుంటే పట్టుమని పది వేలు రావడం ఏమిటి!? ప్రస్తుతం ఇదీ అధికార టీఆర్‌ఎ్‌సలో అంతర్మథనం! రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూపించి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయాలని, బీఆర్‌ఎ్‌సకు వేదిక తయారు చేయాలని భావిస్తుంటే ఇక్కడే సానుకూలత లేకపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది. ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం వంద మంది ప్రజా ప్రతినిధులను నెల రోజులపాటు మునుగోడులోనే మోహరించినా.. ప్రభుత్వపరంగా, పార్టీపరంగా నభూతో.. అన్నట్లు ఖర్చు చేసినా ఆశించిన ఆధిక్యం ఎందుకు రాలేదనే అంశం ఇప్పుడు పార్టీ అధినాయకత్వంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
సర్వ శక్తులూ, సామ దాన భేద దండోపాయాలు, ఆర్థిక, అంగ బలాలను పూర్తి స్థాయిలో ప్రయోగించినా అత్తెసరు మెజారిటీ రావడమంటే అప్రమత్తం కావాలన్న హెచ్చరిక సంకేతం రావడమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ నెలకొంది. ఒక్క నియోజక వర్గంలోనే ఉప ఎన్నిక కనక ప్రత్యేకంగా దృష్టి సారించామని, రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితి ఉండదని, అప్పటికి సానుకూలతను పెంచుకోవడం ఎలా!? అని పార్టీ అధినాయకత్వం మథన పడుతోంది. పార్టీలోనా.. ప్రభుత్వంలోనా.. లోపం ఎక్కడుందనే అంశంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుత పరిస్థితికి కారణాలు, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలన్న అంశంపై కొందరు తటస్థులు, కొన్ని సంస్థల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఎంత చేసినా కొంతే సానుకూలత!?
ఉద్యమ సమయం నుంచీ ఉప ఎన్నిక అంటే టీఆర్‌ఎ్‌సకు కొట్టిన పిండే. రాజీనామా చేయడం.. ఉప ఎన్నికకు వెళ్లడం.. అధికార పార్టీపైనా ఆధిక్యత సాధించడం గతంలో ఎన్నో సార్లు జరిగింది. ఇక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక అయినా నల్లేరుపై బండి నడకేనన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. సర్పంచి నుంచి ఎంపీ వరకూ ఏ ఎన్నిక అయినా విజయ బావుటా తమదేనన్న భరోసా శ్రేణుల్లో ఏర్పడింది. కానీ, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అధికారంలో ఉన్నా.. ఉప ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సిటింగ్ సీట్లనూ కోల్పోవాల్సి వస్తోంది. తమకు ఎదురే లేదని, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదనే పరిస్థితి నుంచి కిం కర్తవ్యం అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామనే భరోసా బదులు మునుగోడులో గెలిచి కూడా ముప్పతిప్పలకు కారణం ఏమిటనే అంతర్మథనం చేయాల్సిన పరిస్థితి. నిజానికి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ జరగని అభివృద్ధి, ఆయా రాష్ట్రాల్లో చేయని సంక్షేమం తెలంగాణలో చేశామని టీఆర్‌ఎస్ అధినాయకత్వం లెక్కలతో సహా చెబుతోంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు మునుగోడులో అప్పటికప్పుడు గొర్రెలు, మేకల యూనిట్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1.33 లక్షల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు పెండింగ్ బకాయిలన్నిటినీ పోలింగ్ ముందు చెల్లించేసింది. భూ నిర్వాసితులకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇచ్చేసింది. వీటన్నిటికీ అదనంగా మద్యం ఏరులై పారించింది. ఓటుకు వేల రూపాయలను కుమ్మరించింది. అయినా, ఆశించిన ఆధిక్యమూ రాలేదు. మొత్తం ఓట్లు కూడా లక్ష దాటలేదు. అదే సమయంలో, ప్రత్యర్థి పార్టీలు మాత్రం సరిగ్గా డబ్బులు పంచకపోయినా, అసలు పంచకపోయినా ఓట్లను సంపాదించుకోగలిగాయి. ఈ నేపథ్యంలోనే, ఇన్ని చేసినా సానుకూలత ఎందుకు లేదు!? ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు!? అనే చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
యువత ఎందుకు దూరమయ్యారు!?
పార్టీ ఆవిర్భావం నుంచీ టీఆర్‌ఎస్ వెన్నంటి ఉన్నది యువతే. ఇంకా చెప్పాలంటే, ఉద్యమ సమయంలో ఆ పార్టీకి వెన్నెముకగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తమకు నియామకాలు వస్తాయనే ఆశతో యువతే పార్టీ క్యాడర్‌గా మారి పని చేశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే విషయం క్రమక్రమంగా అర్థమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికతో ఈ విషయం మరింత సుస్పష్టమైంది. నిన్న మొన్నటి వరకూ అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడలేదనే ఆగ్రహం యువతలో ఉండేది. ఇప్పుడు వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యంలో యువత తమకే మద్దతు తెలుపుతారనే అభిప్రాయం టీఆర్‌ఎస్ నేతల్లో ఉంది. కానీ, మునుగోడులో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. దాంతో, నోటిఫికేషన్లు ఇస్తున్నా నారాజ్ ఎందుకనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇక, బీసీల్లో కొన్ని సామాజిక వర్గాలు కూడా కొంత దూరమైన విషయం ఆ పార్టీ దృష్టికి వచ్చింది. ఆ వర్గాలను కూడా తిరిగి దరి చేర్చుకునే దిశగా వ్యూహం అమలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. అలాగే, ప్రజలతో సన్నిహితంగా ఉండడం, వారితో మమేకం కావడాన్ని మరింత విస్తృతం చేయాలన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత సంక్షేమంతోపాటు ఓటర్లతో వ్యక్తిగత సంబంధం నెరపడంపైనా ఇకపై దృష్టి పెట్టాలనే దిశగా ఆ పార్టీలో సమాలోచనలు సాగుతున్నాయి.