FIFA World Cup 2022: 'ఇదేమీ అభిమానం సామీ.. వేరే లెవల్ అంతే'.. ఓ ఫ్యామిలీ ఏకంగా 23రోజుల పాటు..

ABN , First Publish Date - 2022-11-24T08:50:13+05:30 IST

మన దగ్గర క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే గేమ్‌కు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కేరళలో దీనికి పూర్తి విరుద్ధం. అక్కడ ఫుట్‌బాల్‌కు ఉన్నంత క్రేజ్ ఇండియాలో బహుశా మరెక్కడ ఉండదేమో.

FIFA World Cup 2022: 'ఇదేమీ అభిమానం సామీ.. వేరే లెవల్ అంతే'.. ఓ ఫ్యామిలీ ఏకంగా 23రోజుల పాటు..

దుబాయ్: మన దగ్గర క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరే గేమ్‌కు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కేరళలో దీనికి పూర్తి విరుద్ధం. అక్కడ ఫుట్‌బాల్‌కు ఉన్నంత క్రేజ్ ఇండియాలో బహుశా మరెక్కడ ఉండదేమో. అక్కడివారు అంతలా సాకర్‌ను అభిమానిస్తుంటారు. కేరళ వాసులు ఫుట్‌బాల్ అంటే పిచ్చెక్కిపోతారు. బ్రిటీషర్ల కంటే ముందే మన దేశానికి పోర్చుగల్ వారు వచ్చారు. వాళ్లు మొదట కేరళలోనే అడుగుపెట్టడంతో ఇక్కడ సాకర్ క్రీడా బాగా ఫేమస్ అయింది. దీంతో పాటు కేరళ నుంచి చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లడం, అక్కడ ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఉండటంతో అది ఇక్కడికీ పాకింది. ప్రధానంగా బ్రెజిల్, అర్జెంటీనాలకు కేరళలో విపరీతమైన అభిమానులు ఉంటారు. అలాంటి ఫ్యాన్స్‌లో కేవీటీ అష్రఫ్‌ కూడా ఒకరు. ఆయనకు ఫుట్‌బాల్‌ అంటే ఎనలేని అభిమానం. అలాగే ప్రయాణాలు చేయడమన్న కూడా అంతే ఇష్టం. దీంతో ఖతర్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసేందుకు అక్కడి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

Kerala-Family.gif

అయితే, అందరిలా విమానం ఎక్కలేదు మనోడు. ఏకంగా కారు జర్నీ చేశాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి. 23 రోజులపాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి అష్రఫ్ కుటుంబం ఖతర్ చేరుకుంది. అతని సతీమణి షహనాస్, కుమారుడు అబ్దుల్లా ఇబ్ను అష్రఫ్, అతని మేనల్లుడు మొహమ్మద్ ఫరాజ్ అక్టోబర్ 30న కన్నూర్ నుంచి తమ టాయోటా ఇన్నోవాలో బయల్దేరారు. రెండు వారాల పాటు ఇండియా గుండా ప్రయాణించిన తర్వాత ఈ కుటుంబం గత వారం దుబాయ్ చేరుకుంది. అక్కడ అష్రఫ్ కుమార్తె అక్సానా బేగం, ఆమె భర్త ఇర్ఫాన్ వారితో కలిశారు. ఆ తర్వాత యూఏఈ నుంచి బయల్దేరి ఒమన్, బహ్రెయిన్, కువైత్, సౌదీ అరేబియా మీదుగా ఖతార్ చేరుకుందీ ఫ్యామిలీ. ఖతార్‌లో నివాసముంటున్న ఫరాజ్ తల్లిదండ్రులను కలుసుకోవడంతో వీరి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. ఇప్పటికే ఈ కుటుంబం.. డిసెంబర్ 1న జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకుందట. అలాగే క్వార్టర్ ఫైనల్, సెమీస్‌లకు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఇలా కుటుంబం సాకర్ కోసం కారు జర్నీ చేసి మరీ ఖతార్ వెళ్లడం తెలిసి.. నెటిజన్లు 'ఇదేమీ అభిమానం సామీ.. వేరే లెవల్' అని కామెంట్ చేస్తున్నారు.

Updated Date - 2022-11-24T09:37:19+05:30 IST

Read more