Tamil Nadu : కాంగ్రెస్ భవితవ్యంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-28T18:34:23+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన మిత్ర పక్షం కాంగ్రెస్‌ సత్తాపై గట్టి నమ్మకంతో ఉన్నారు.

Tamil Nadu : కాంగ్రెస్ భవితవ్యంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
MK Stallin

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన మిత్ర పక్షం కాంగ్రెస్‌ సత్తాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యాన్ని కోల్పోలేదని చెప్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్‌తో కూడిన జాతీయ కూటమి ఉండాలని అంటున్నారు.

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కోల్పోయిందనడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడిన జాతీయ కూటమి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి గాడిలో పడుతోందని, భారత దేశానికి ఇప్పుడు అదే అవసరమని చెప్పారు. ఆ పార్టీ పునరుజ్జీవం బాటలో ఉందన్నారు.

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సోదరునిగా అభివర్ణిస్తూ, బీజేపీ (BJP) అనుసరించే సంకుచిత రాజకీయాలకు మేలైన విరుగుడు మందు వంటివారు సోదరుడు రాహుల్ గాంధీ అని స్టాలిన్ (MK Stallin) అన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా పని చేసే విధంగా చూడటం కోసం జాతీయ కూటమి ఏర్పాటవడం చాలా ముఖ్యమని చెప్పారు.

రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడమనే తమిళనాడు నమూనాను ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించవచ్చునని తెలిపారు. రాహుల్ గాంధీ బీజేపీతో కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికపై కూడా పోరాడుతున్నారన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) భారీ సంచలనం సృష్టించిందన్నారు.

రాజకీయంగా కాంగ్రెస్ క్షీణిస్తుండటానికి కారణాలేమిటని భావిస్తున్నారని ప్రశ్నించినపుడు స్టాలిన్ స్పందిస్తూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యం కోల్పోయిందనడాన్ని తాను అంగీకరించనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సోనియా గాంధీ (Sonia Gandhi) తీసుకున్న చర్యల ఫలితాలు రావడం ప్రారంభమైందన్నారు. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తన విశేష అనుభవంతో పార్టీని పునరుజ్జీవం దిశగా నడుపుతున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు.

కాంగ్రెస్, డీఎంకే పొత్తు వల్ల కలిసొచ్చిందనుకుంటున్నారా? భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుందా? అని అడిగినపుడు స్టాలిన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని తాము బలంగా భావిస్తున్నామన్నారు. మన దేశ ఫౌండింగ్ ఫాదర్స్ మనకు అప్పగించిన మౌలిక విలువలు, సిద్ధాంతాలు నిర్వీర్యం కాకూడదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయాలని కోరుకునే తమ వంటివారంతా కాంగ్రెస్‌తో కూడిన జాతీయ కూటమి ఉండాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో డీఎంకే ఇప్పటికే అటువంటి కూటమిని ఏర్పాటు చేసిందన్నారు. మిగతా చోట్ల కూడా అమలు చేయడానికి విజయవంతమైన నమూనాగా నిలిపిందన్నారు.

Updated Date - 2022-12-28T18:34:28+05:30 IST