Himachal Pradesh Results : స్వతంత్రులుగా బరిలో దిగిన ఐదుగురు ప్రముఖులు
ABN , First Publish Date - 2022-12-08T11:14:21+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల బెడదను ఎదుర్కొన్నాయి.
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల బెడదను ఎదుర్కొన్నాయి. బీజేపీ 11 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. చాలా మంది స్థానిక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొందరు కాంగ్రెస్‌లో చేరారు. అదేవిధంగా కాంగ్రెస్‌కు కూడా తిరుగుబాటు అభ్యర్థుల తలనొప్పి తీవ్రంగానే ఉంది. టిక్కెట్లను ఆశించి, భంగపడినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అటువంటివారిలో ఐదుగురు ప్రముఖులు ఉన్నారు.
ఇందు వర్మ
థియోగ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇందు వర్మ గడచిన ఇరవయ్యేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆమె భర్త రాకేశ్ వర్మ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్ళ క్రితం ఆయన గుండెపోటుతో మరణించడంతో ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. థియోగ్ ప్రాంతంలో ఆమె కుటుంబానికి గట్టి పట్టు ఉండటంతో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుతుందని భావించారు. అయితే ఆ పార్టీ టిక్కెట్ లభించకపోవడంతో ఆమె స్వతంత్రంగా పోటీ చేశారు.
కిర్పాల్ సింగ్ పర్మార్
ఫతేపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన కిర్పాల్ సింగ్ పర్మార్ బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఫతేపూర్ శాసన సభ ఉప ఎన్నికలో ఆయనకు బీజేపీ టిక్కెట్ లభించలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో కూడా ఆయనకు బీజేపీ టిక్కెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
హితేశ్వర్ సింగ్
రాజవంశీకుడైన మహేశ్వర్ సింగ్‌కు కుల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ ఇచ్చింది. అయితే ఆయన కుమారుడు హితేశ్వర్ సింగ్ తాను బంజర్ నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనను సముదాయించాలని మహేశ్వర్‌ను బీజేపీ కోరింది. కానీ హితేశ్వర్ వెనుకంజ వేయలేదు. దీంతో మహేశ్వర్‌కు కూడా టిక్కెట్‌ను నిరాకరించి, కుల్లు స్థానం నుంచి టీచర్ నరోత్తమ్ సింగ్‌కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో కుల్లు, బంజర్ నియోజకవర్గాల్లో బీజేపీకి తిరుగుబాట్లు తీవ్రంగా ఎదురయ్యాయి.
దయాల్ ప్యారి, గంగురామ్ ముసాఫిర్
సిర్మౌర్ ప్రాంతంలోని పచ్చద్ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ ఇద్దరు మహిళల మధ్య రికార్డు స్థాయిలో పోటీ ఉంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిని గంగు రామ్ ముసాఫిర్, బీజేపీ రెబెల్ అభ్యర్థిని దయాల్ ప్యారీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.
కేఎల్ ఠాకూర్
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసిన కేఎల్ ఠాకూర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. నలగఢ్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. 2017లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.