Varla Ramaiah: మాచర్ల ఘటనపై NHRCకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-12-19T16:16:40+05:30 IST

పోలీసుల నిర్లక్ష్యంతో ఏపీలో శాంతిభద్రతలు కరవయ్యాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (TDP Senior leader Varla Ramaiah) ఆరోపించారు. మాచర్ల ఘటనపై

Varla Ramaiah: మాచర్ల ఘటనపై NHRCకి ఫిర్యాదు
NHRCకి ఫిర్యాదు

అమరావతి: పోలీసుల నిర్లక్ష్యంతో ఏపీలో శాంతిభద్రతలు కరవయ్యాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (TDP Senior leader Varla Ramaiah) ఆరోపించారు. మాచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌(National Human Rights Commission)కు లేఖ ద్వారా వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. లేఖలో ఏముందంటే.. ‘‘అధికార పార్టీతో కొంత మంది పోలీసులు కుమ్మక్కవడంతో రాష్ట్రంలో పౌరుల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయి. మాచర్ల ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) సోదరుడు వెంకటరామిరెడ్డి తన ప్రైవేటు గూండాలతో దాడికి పాల్పడ్డాడు. ప్రతిపక్ష పార్టీ సభ్యుల గృహాలపై దండెత్తి మహిళలు, పిల్లలు అని తారతమ్యం లేకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఇళ్లను తగలబెట్టారు. టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి చేస్తున్న శాంతియుత ర్యాలీపై దాడి చేయడంతో ఈ దుర్మార్గాలకు ఒడిగట్టారు. ప్రతిపక్షనేతల ఇళ్లల్లోని విలువైన ఆభరణాలు సైతం దొంగిలించుకుపోయారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ ఘోరకలిని చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. పోలీసులు కార్డెన్ సర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ గూండాలు ప్రతిపక్షనేతలపై మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మాచర్ల టౌన్ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేశారు. గత కొన్ని నెలలుగా ప్రజలు మాచర్లను వదిలి బయటకు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. మాచర్ల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నివాసాలు విడిచిపెట్టి జిల్లా హెడ్ క్వాటర్ గుంటూరులో తలదాచుకున్న రోజులు ఇంకా మరిచిపోలేదు. మాచర్ల ప్రాంతంలో శాంతిభద్రతల క్షీణించడానికి పోలీసు డిపార్ట్‌మెంటులోని కొంతమంది ఉన్నతాధికారులే కారణం. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, ఎస్పీ రవిశంకర్ రెడ్డి‌లు అధికార పార్టీ నేతలను సంతోషపెట్టడానికి శాంతిభద్రతలను ప్రమాదంలో పెట్టారు. మాచర్ల ఘటనపై, పోలీసుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చూడండి. రాజ్యాంగ విలువలను కాపాడండి. రాజ్యాంగపరమైన తమ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి.’’ అని లేఖలో వర్ల రామయ్య కోరారు.

Updated Date - 2022-12-19T16:16:41+05:30 IST