Share News

Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్‌

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:02 PM

యూపీలోని రాయబరేలి లోక్‌సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డనుంది. ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజిమెంట్ కోసం 'స్పెషల్ 24' టీమ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు.

Lok Sabha Polls: ప్రియాంక అరంగేట్రం కోసం 'స్పెషల్ 24' టీమ్‌

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి (Rae Bareli) లోక్‌సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి తొలిసారి ఎన్నికల బరిలోకి దింపేందుకు ముందస్తుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్ మేనేజిమెంట్ కోసం 'స్పెషల్ 24' (Special 24) టీమ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏర్పాటు చేశారు.


కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 24 మంది మంది సభ్యుల ఈ కమిటీలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ప్రతినిధులు ఉంటారు. ఇందులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులకు చోటు కల్పించారు. అదనంగా ఐదుగురు కాంగ్రెస్ ప్రముఖలతో ఒక బ్యాకప్ టీమ్ కూడా ఉంటుంది. రాయబరేలిలో ఎన్నికల అంచనాల కోసం ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు, ఐటీ వార్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.


టీమ్‌లో ఎవరెవరు?

రాయబరేలి ఎన్నికల కోసం సోనియాగాంధీ ఏర్పాటు చేసిన 'స్పెషల్-24' సమన్వయ కమిటీలో ఆమెతో పాటు ఆమె ప్రతినిధులుగా కె.ఎల్.శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, రాయబేరిలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుశీల్ పసి, హర్జాండ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్ సింగ్, సదర్ సీటు మాజీ అభ్యర్థి డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సెరెనె అసెంబ్లీ అభ్యర్థి సుధా ద్వివేది, ఊంచహార్ అభ్యర్థి అతుల్ సింగ్, రాయబరేలి నగర్ పాలిక చైర్మన్ శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ చైర్మన్ సరితా గుప్తా, మాజీ నగర పాలిక చైర్మన్ ఎం.ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కల్యాణ్ సింగ్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లా ఉన్నారు.

Lok Sabha Elections: కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ అభ్యర్థి


వ్యూహకర్తలుగా...

కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జి అవినాష్ పాండే, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి ఆరాధనా మిశ్రాలు ఎన్నికల ప్రధాన వ్యూహకర్తలుగా వ్యవహరిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యాహాకర్తల్లో ఒకరుగా ఉంటూ పార్టీకి ఇటీవల గణనీయమైన విజయాలు సాధించి పెట్టిన సునీల్ కనుగోలు సైతం రాయబరేళి ఎన్నికల్లో మరోసారి వ్యూహకర్తగా తన సత్తా చాటుకోనున్నారు. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వంపై ఆసక్తి పెరుగుతున్నట్టు ఆయన జరిపిన ప్రాథమిక సర్వేలో తేలినట్టు చెబుతున్నారు. భారత్ జోడో యాత్ర సమయంలోనూ కనుగోలు టీమ్ సర్వే జరిపింది. రాయబరేళి ఎన్నికల్లోనూ ఇప్పుడు ఆయన తన వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.


రాయబరేలి నియోజకవర్గం

ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రాయబరేలి నియోజకవర్గం కాంగ్రెస్‌కు పెట్టని కోటగా నిలుస్తూ వచ్చింది. రాయబరేలిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్య వహించిన సోనియాగాంధీ ఈ ఏడాది రాజ్యసభ సీటుకు మళ్లారు. సోనియాగాంధీకి ముందు రాయబరేలి నియోజకవర్గానికి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి సోనియాగాంధీ ఇక్కడ ఓటమి ఎరుగని నేతగా నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ కూడా సోనియాగాంధీనే కావడం విశేషం.

Read Latest news and National News here..

Updated Date - Apr 29 , 2024 | 05:02 PM