Share News

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

ABN , Publish Date - Sep 03 , 2026 | 07:38 AM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్/అమరావతి, సెప్టెంబర్ 03: తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌, జగిత్యాల, కామారెడ్డిలలో వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే మరో రుతుపవన ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


సెప్టెంబర్ 3, 4 తేదీల్లో బంగాళాఖాతంలో మత్య్సకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గాలులు బలంగా వీస్తాయని.. దీంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల వద్ద ఉండవద్దని ప్రజలను హెచ్చరించింది.

Updated Date - Sep 03 , 2026 | 08:35 AM