Share News

‘ఈశాన్య’ సీజన్‌లో సాధారణ వర్షపాతం

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:06 AM

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని ఐదు వాతావరణ సబ్‌ డివిజన్‌లలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు...

‘ఈశాన్య’ సీజన్‌లో సాధారణ వర్షపాతం

  • సగటులో 88 శాతం నుంచి 122 శాతం వరకు కురిసే అవకాశం

  • ఏపీలో మాత్రం సాధారణం కంటే తక్కువ

  • అక్టోబరులో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు

  • భారత వాతావరణ శాఖ అంచనా

విశాఖపట్నం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని ఐదు వాతావరణ సబ్‌ డివిజన్‌లలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు...మూడు నెలల్లో దీర్ఘకాలిక సగటు(334.1 మి.మీ.) కాగా.. ఇందులో 88 శాతం నుంచి 122 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ముందస్తు బులెటిన్‌ను బుధవారం ఐఎండీ విడుదల చేసింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణాదిలోని తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు కురుస్తాయి. ఏడాదిలో కురిసే వర్షంలో 30 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కురవాల్సి ఉంది. ఈ సీజన్‌లో తూర్పుగాలుల ప్రభావం, బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడడం ద్వారా వర్షాలు కురుస్తుంటాయి. అయితే, ఎల్‌నినో ప్రభావంతో తమిళనాడు కంటే ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. కాగా, అక్టోబరులో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని ఐఎండీ తెలిపింది. అక్టోబరు రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్‌ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేశారు.


నైరుతిలో 87.42 శాతం నమోదు

దేశంలో జూన్‌ ఒకటో తేదీన ప్రారంభమైన నైరుతి రుతుపవనాల సీజన్‌ అధికారికంగా బుధవారం ముగిసింది. నాలుగు నెలల సీజన్‌లో దేశంలో 868.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 759.4 మి.మీ.(87.42 శాతం) వర్షపాతం నమోదైంది. 13 శాతం లోటు నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో రోజుల తరబడి పొడి వాతావరణం కొనసాగడం, వడగాడ్పులు వీయడంతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురవగా, మరికొన్నిచోట్ల తీవ్ర దుర్భిక్షం నెలకొంది. వందేళ్ల కాలంలో ఇంత తీవ్రమైన ఎల్‌నినో రాలేదని, అందుకే రుతుపవనాలు ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు.

వాయవ్య భారతంలో 587.6 మిల్లీమీటర్లకుగాను 553 మి.మీ.(ఆరు శాతం తక్కువ), మధ్యభారతంలో 978మిల్లీమీటర్లకుగాను 952.8 మి.మీ. (మూడు శాతం తక్కువ), దక్షిణ భారతంలో 716.2 మిల్లీమీటర్లకుగాను 542 మి.మీ.(24 శాతం తక్కువ), ఈశాన్య/తూర్పుభారతంలో 1367.3 మిల్లీమీటర్లకుగాను 1017.1 మి.మీ. (26 శాతం తక్కువ) వర్షపాతం నమోదైంది. దేశంలో మొత్తం 741 జిల్లాలు ఉండగా.. 282 జిల్లాల్లో లోటు వర్షపాతం, 34 జిల్లాల్లో భారీ లోటు నమోదైంది. అలాగే, 312 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 106 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఐఎండీ సమాచారం మేరకు 2001 నుంచి ఇప్పటివరకు అతి తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో ఒకటిగా ‘2026’ నిలిచింది. 2026 నైరుతి రుతుపవనాల సీజన్‌ రైతాంగానికి చేదు మిగిల్చిందని వాతావరణ నిపుణుడొకరు అన్నారు. రోజుల తరబడి పొడి వాతావరణం కొనసాగడంతో భూమిలో తేమ శాతం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:06 AM