ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:09 AM
విధి ఆడిన వింత నాటకంలో ఓ అభాగ్యుడి జీవితం నిలువునా దహించుకుపోయింది.
వృద్ధుడు సజీవ దహనం
వాంబేకాలనీలో విషాదం
శ్రీకాకుళం క్రైమ్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): విధి ఆడిన వింత నాటకంలో ఓ అభాగ్యుడి జీవితం నిలువునా దహించుకుపోయింది. ఒకప్పుడు పది మందిలో గౌరవంగా.. దర్జాగా బతికిన ఆ వ్యక్తి.. కాలక్రమంలో అనాథగా మారి చివరకు సిగరెట్ రగిలించిన మంటల్లో కాలి బూడిదయ్యాడు. నిద్రలోనే మృత్యువు ఒడికి చేరుకున్న ఆ వృద్ధుడి కడపటి ప్రయాణం స్థానికులను కంటతడి పెట్టించింది. పాత శ్రీకాకుళం వాంబే కాలనీలో బుధవారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదం ఇలా...
పాత శ్రీకాకుళం వాంబే కాలనీ మూడో బ్లాక్‌లో పాలిశెట్టి నరసింహమూర్తి అలియాస్ పిచ్చి రమణ(63) కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నాడు. బుధవారం ఉదయం రమణ ఉంటున్న ఇంటి నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఒకటో పట్టణ పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో రమణ సజీవ దహనమయ్యాడు. ఇంటి వరండాలో పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనం కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.
ప్రాణం తీసిన వ్యసనం?
కుటుంబ సభ్యులు దూరం కావడం... ఒంటరితనం... మతిస్థిమితం లేకపోవడంతో రమణ మద్యపానం, ధూమ పానానికి బానిసయ్యాడు. బుధవారం తెల్లవారుజామున మద్యం మత్తులో సిగరెట్ కాలుస్తూ... అలాగే నిద్రలోకి జారుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. చేతిలో కాలుతున్న సిగరెట్ ప్రమాదవశాత్తూ ఆయన కప్పుకున్న బొంతపై పడటంతో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మత్తులో ఉండటంతో మంటలు అంటుకున్నా తప్పించుకోలేక, ప్రాణాలు విడిచి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై వన్‌టౌన్ ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేరే ప్రాంతంలో ఉంటున్న రమణ సమీప బంధువులకు సమాచారం అందించారు.
ఒకప్పుడు వైభవం.. నేడు విషాదం
రమణ స్వగ్రామం సరుబుజ్జిలి మండలం రొట్టవలస. ఆయన తండ్రి పోలీసు శాఖలో విధులు నిర్వర్తించేవారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కుటుంబం. నగరంలోని తుమ్మావీధిలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తల్లిదండ్రులతో కలిసి ఆయన ఎంతో హాయిగా జీవించాడు. వయసు పైబడుతున్నా వివాహం కాకపోవడం... ఆ తర్వాత తల్లిదండ్రులు కన్నుమూయడం ఆయన జీవితాన్ని చీకటిమయం చేశాయి. క్రమంగా మానసికంగా అనారోగ్యానికి గురై.. ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. చివరికి పొట్టకూటి కోసం రోడ్లపై భిక్షాటన చేస్తూ.. వాంబే కాలనీలో తలదాచుకుంటూ కాలం వెళ్లదీశాడు. ఒకప్పుడు తమ కళ్లెదుటే ఉల్లాసంగా తిరిగిన రమణ.. ఇలా మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేనంతగా మారడం తుమ్మావీధి వాసుల హృదయాలను కలచివేసింది. ఒక నిండు ప్రాణాన్ని పరిస్థితులు, వ్యసనం బలిగొన్న తీరు స్థానికులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.