రైతులకు తీపి కబురు
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:00 AM
అన్నదాతలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఈ పథకాన్ని 2018-19 వరకు అమలు చేసి అనంతరం నిలిపి వేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని యాసంగి నుంచి పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం జిల్లాలో ఉన్న వేలాది మంది రైతులకు
జగిత్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఈ పథకాన్ని 2018-19 వరకు అమలు చేసి అనంతరం నిలిపి వేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని యాసంగి నుంచి పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం జిల్లాలో ఉన్న వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. గత యాసంగి, వానాకాలం సీజన్‌లలో అకాల వర్షాలు, అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోతుంటారు. ఇప్పుడు సర్కార్ తీపికబురు అందించింది.
ఫగతంలో ప్రకటన విడుదల చేసి...
గతంలో పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసి రైతుల నుంచి ప్రీమియం తీసుకునేవారు. వరి పంటకు గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సోయా, వేరుశనగ పంటలకు మండలం యూనిట్‌గా బీమా వర్తింపచేశారు. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వానాకాలంలో పత్తి ఉంటుంది. బ్యాంకుల నుంచి రైతులు పంట రుణం తీసుకునే సమయంలోనే వానాకాలం సీజన్‌కు 2 నుంచి 5 శాతం, యాసంగిలో 1.5 నుంచి 5 శాతం ప్రీమియం బ్యాంకర్లు తప్పనిసరిగా మినహాయించి బీమా కంపెనీకి చెల్లించేవారు. రైతులు చెల్లించిన ప్రీమియానికి సమానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన సగం ప్రీమియం రైతు రాయితీగా కంపెనీకి చెల్లించేవి. అప్పట్లో పంట నష్ట పోతే వరికి ఎకరాకు రూ.37,484, పత్తికి రూ.36,282 మొక్కజొన్నకు రూ.18,742 పరిహారం ఇచ్చారు. దాదాపు ఏడేళ్ల వరకు నిలిచిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఫయేటా నష్టమే...
యాసంగిలో అకాల వర్షాలు కురిస్తే వరితో పాటు ఇతర పంటలు, దెబ్బతింటున్నాయి. వర్షాలు లేకపోతే వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు నష్టం జరుగుతోంది. జిల్లాలోని అధిక శాతం మండలాల్లో ఏటా పంటలు దెబ్బతింటున్నాయి. జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి ధాన్యం సుమారు 5 వేల మెట్రిక్ టన్నులు. మొక్కజొన్న 2 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో తడిసినట్లు అంచనా ఉంది. ముఖ్యంగా వడగళ్ల వానతో పంటలకు నష్టం జరుగుతోంది. జిల్లాలో మెట్‌పల్లి, కోరుట్ల, మల్లాపూర్, రాయికల్, జగిత్యాల, మేడిపల్లి, భీమారం, గొల్లపల్లి మండలాల్లో మామిడి వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 126 గ్రామాల్లో 5,986 మంది రైతులకు చెందిన 9,393 ఎకరాల్లో వివిధ పంటలను అకాల వర్షాల వల్ల నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధికంగా మామిడి తోటలకే 6,162 ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది. మొక్కజొన్న 1,521 ఎకరాలు, వరి 1,128 ఎకరాలు, నువ్వులు 582 ఎకరాలల్లో నష్టం జరిగింది.
ఫసల్ బీమా అమలు చేస్తే ప్రయోజనమే...
-రాజిరెడ్డి, రైతు, గ్రామం తిమ్మాపూర్, మండలం ఇబ్రహీంపట్నం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్‌బీమా అమలు చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతీ యేటా యాసంగి, వానాకాలం సీజన్‌లలో అకాల వర్షాలు, అధిక వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నారు. పరిహారం అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.