దూసుకొస్తున్న తుఫాన్!
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:10 AM
తుఫాన్ దూసుకువస్తోంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో దూసుకొస్తున్న తొలి తుఫాన్ ఇదే. రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో.. రైతులు ఖరీఫ్ పంట కోత పనుల్లో ఉన్న సమయంలో అందరి దృష్టినీ తన వైపు మళ్లించేలా తుఫాన్ తీవ్రత ఉండబోతోంది.
నేటి ఉదయానికి వాయుగుండం
ఎల్లుండికి తుఫాన్‌గా.. ఆపై తీవ్ర తుఫాన్‌గా
28న ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం
120-160 కి.మీ. వేగంతో పెనుగాలులు
తుఫాన్‌కు ‘ఆర్నాబ్’గా నామకరణం
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): తుఫాన్ దూసుకువస్తోంది. ఈశాన్య రుతు పవనాల సీజన్లో దూసుకొస్తున్న తొలి తుఫాన్ ఇదే. రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో.. రైతులు ఖరీఫ్ పంట కోత పనుల్లో ఉన్న సమయంలో అందరి దృష్టినీ తన వైపు మళ్లించేలా తుఫాన్ తీవ్రత ఉండబోతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించేలా దూసుకొస్తున్న తుఫాన్... అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి తీరాన్ని తాకనున్నది. ముఖ్యంగా ఈ నెల 27, 28 తేదీల్లో ఉత్తర కోస్తాలో గంటకు 120 నుంచి 160 కిలోమీటర్లు.. అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈమేరకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రెండు రోజులపాటు కొనసాగిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉదయం తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుంది. ఈ క్రమంలో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆపై మరింత బలపడి 26వ తేదీకల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూనే తుఫాన్‌గా మారుతుంది. ఈ తుఫాన్‌కు ‘ఆర్నాబ్’ అని పేరు పెట్టనున్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో తుఫాన్ మరింత బలపడి అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మధ్య (కళింగపట్నం- మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని పలు మోడళ్లు, విశాఖపట్నం- కాకినాడ మధ్య అని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి) తీరం దాటనున్నదని పేర్కొంది. 27 నుంచి ఉత్తరకోస్తా జిల్లాల్లో తీరం వెంబడి, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 120 నుంచి 160, అప్పుడప్పుడు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. కోస్తాలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం నుంచి కృష్టా జిల్లా వరకు భారీ నుంచి అతిభారీగా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 28న అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, పోలవరం, తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో అతిభారీ, గుంటూరు నుంచి నెల్లూరు వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు శనివారం ఉదయానికల్లా తీరానికి చేరుకోవాలని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
సహాయం కోసం కాల్ చేయండి
టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101
అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా దూదెకొండలో 68 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుఫాన్ కారణంగా పంటలు నష్టపోకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుఫాన్ సమాచారం, అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లలో సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల